AskKTR: కొవిడ్‌ వేళ మీరు పాటించిన చిట్కాలేంటి?
close

తాజా వార్తలు

Updated : 14/05/2021 05:26 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

AskKTR: కొవిడ్‌ వేళ మీరు పాటించిన చిట్కాలేంటి?

ఇంటర్నెట్‌డెస్క్‌: కరోనా ఉద్ధృతి దృష్ట్యా తెలంగాణలో 10 రోజుల పాటు లాక్‌డౌన్‌ విధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో  కరోనాకు కళ్లెం వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి ప్రణాళికలు చేపడుతోంది? 18 ఏళ్ల పైబడిన వారికి టీకాలు ఎప్పట్నుంచి ఇస్తారు? కరోనాకు చికిత్సను ఆరోగ్యశ్రీలో చేరుస్తారా? రాష్ట్రంలో చేపట్టిన ఫీవర్‌ సర్వే ఎలా కొనసాగుతోంది? కరోనాపై పోరాటంలో తన వ్యక్తిగత అనుభవాలు సహా అనేక అంశాలపై నెటిజన్లు ట్విటర్‌లో అడిగిన ప్రశ్నలకు తెలంగాణ మంత్రి, తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌  #AskKTR పేరుతో నిర్వహించిన కార్యక్రమంలో సమాధానాలిచ్చారు. ఆ విశేషాలివే..

లాక్‌డౌన్‌లో ఉదయం 6 నుంచి 10గంటల మధ్య మాత్రమే అనుమతిస్తున్నారు. దీంతో ఉదయం 6గంటలకే సిబ్బంది పని ప్రదేశాలకు చేరుకోవడం కష్టంగా ఉంది. అలాగే, దుకాణాలకు వచ్చేవారితో రద్దీ పెరగడం వల్ల లాక్‌డౌన్‌ ఉద్దేశం నెరవేరదు కదా? ఈ సమయం పెంచే అవకాశం ఉందా? 

కేటీఆర్‌: లాక్‌డౌన్‌ అమలులో ఉన్నంతవరకు ఉదయం 6 గంటల నుంచి 10గంటల వరకే అనుమతిస్తారు. దీన్ని గుర్తుపెట్టుకోండి. ఇక రెండోది.. అన్ని ఈ- కామర్స్‌ సంస్థల ద్వారా నిత్యావసర, ఆహారాన్ని డెలివరీ చేసేందుకు అవకాశం ఉంది. వాస్తవానికి ఈ నాలుగు గంటలు అనుమతించడంపైనా విమర్శలు వస్తున్నాయి. కానీ ప్రజల అసౌకర్యాన్ని తగ్గించేందుకే అనుమతిస్తున్నాం. 

తక్కువ పరీక్షలు చేసి కరోనా తగ్గుముఖం పడుతోందని చెప్పడం ద్వారా సంతృప్తి చెందుతున్నామా? 

కేటీఆర్‌: అలా ఎప్పుడూలేదు. సమాచారం ఆధారంగానే నేను మాట్లాడుతున్నా. ఆస్పత్రుల్లో చేరికలు, హోం ఐసోలేషన్‌ కేసుల తదితర ఆధారంగానే చెబుతున్నా. కొన్నికేసుల్లో అనవసరంగా రెమిడెసివిర్‌ సిఫారసు చేయాలంటూ రోగులు, వారి బంధువుల నుంచి ఒత్తిడి ఎదురవుతోంది. బ్లాక్‌ మార్కెట్‌కు పాల్పడుతున్న అనేకమందిని అరెస్టుచేశాం. 

ఆక్సిజన్‌ సిలిండర్లు, రెమిడెసివిర్‌ వయల్స్‌ అధిక ధరలకు విక్రయిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఎంఆర్‌పీ ధరలకు ఆక్సిజన్‌ను విక్రయించేందుకు ప్రత్యేక కౌంటర్లు తెరిస్తే పేద ప్రజలకు మేలు జరుగుతుంది కదా? పరిశీలించండి.

కేటీఆర్‌: దేశ వ్యాప్తంగా ఆక్సిజన్‌ లభ్యత ఓ ఛాలెంజ్‌గా ఉంది. ఆక్సిజన్‌ పూర్తిగా కేంద్రం చేతుల్లోనే ఉంది. రెమ్‌డెసివిర్‌ వినియోగంపై ఆడిట్‌ చేస్తున్నాం. 

తెలంగాణ గ్లోబల్‌ టెండర్లు పిలవడాన్ని ప్రశ్నిస్తూ ఓ కాంగ్రెస్‌ నేత ప్రెస్‌మీట్‌ పెట్టారు. దానిపై మీ కామెంట్‌?

కేటీఆర్‌: మహమ్మారి సమయంలో రాజకీయాలు చేయడం తగదు.  ప్రతిపక్షాలు విమర్శలు చేయడం వారి విజ్ఞతకే వదిలేద్దాం. కేంద్ర ప్రభుత్వం నుంచి రాబట్టుకోవాల్సిన వాటి మేం దృష్టిపెట్టాం. అదే సమయంలో టీకా ఉత్పత్తి కంపెనీలతో సంప్రదింపులు కొనసాగిస్తున్నాం. దేశ వ్యాప్తంగా ఉన్న డిమాండ్‌కు అనుగుణంగా టీకాల సరఫరా జులై ఆఖరులో లేదా ఆగస్టు ప్రారంభంలో మొదలవుతుంది. అప్పటివరకు ఇదో సవాలే. 

మా నాన్న కొవిషీల్డ్‌ తొలి డోసు వేసుకున్నారు. రెండో డోసు మే 23న వేసుకోవాలని కొవిన్‌ పోర్టల్‌లో సమయం చూపిస్తోంది. కానీ వ్యాక్సినేషన్‌ సెంటర్‌ అందుబాటులో లేదని వస్తోంది. ఈ సమస్యకు పరిష్కారమేంటి? 

కేటీఆర్‌: తెలంగాణలో ఇప్పటివరకు 45ఏళ్లు పైబడిన వారిలో 45.37లక్షల మందికి తొలి డోసు వేశాం. రెండో డోసు 10.3లక్షల మందికి అందించాం. టీకా పంపిణీ ప్రస్తుతానికి కేంద్ర ప్రభుత్వం చేతుల్లో ఉంది.

టీఎస్‌పీఎస్సీ ప్రకటించిన 893 స్టాఫ్‌నర్సుల ఉద్యోగాల భర్తీ చేయండి సర్‌.. 

కేటీఆర్‌: ఈ అంశాన్ని ఆరోగ్యశాఖ కార్యదర్శి దృష్టికి తీసుకెళ్తాం.

హైదరాబాద్‌లో కోచింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌లకు ఆఫ్‌లైన్‌లో తరగతులకు అనుమతి ఎప్పుడు ఇస్తారు? ఆన్‌లైన్‌ విద్యతో అనేకమంది విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు సర్‌..

కేటీఆర్‌: ఇది చాలా అసాధారణమైన పరిస్థితి.. బ్రదర్‌. ప్రతి ఒక్కరూ కష్టసమయాన్ని ఎదుర్కొంటున్నారు. ఆన్‌లైన్‌ కోచింగ్‌ రూపంలో మీకు ప్రత్యామ్నాయం ఉన్నప్పుడు ఇంకా మీ నుంచి ఫిర్యాదులు వస్తాయని నేను అనుకోను. 

కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలని తెలంగాణ కోరుతోంది. ఎప్పుడు చేస్తారు సర్‌?

కేటీఆర్‌: ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తాం.

కరోనా నుంచి కోలుకున్నారు కదా.. ఆ సమయంలో మీరు పాటించిన కొన్ని టిప్స్‌ చెప్పండి?

కేటీఆర్‌:  వైద్య నిపుణుల సలహాలు సూచనలు పాటించండి (వాట్సాప్‌ నిపుణులు కాదు). మానసికంగా దృఢంగా ఉండాలి. కరోనా తర్వాత ఎలా ముందుకెళ్లాలో ప్రణాళిక వేసుకోండి. ఆందోళన కలిగించే వార్తలు చూడొద్దు. ఫేస్‌బుక్‌/వాట్సాప్‌లో వచ్చే అనవసర పోస్ట్‌లు చదవొద్దు. తగినంత వ్యాయామం చేయండి. ఎంత నడవగలిగితే అంత నడవండి. సొంతంగా మెడిసిన్‌ వాడకండి.

కొవిడ్‌తో పోరాడుతున్నప్పుడు మీ వ్యక్తిగత అనుభవాన్ని పంచుకోగలరా?

కేటీఆర్‌: నాకు ఏడు రోజుల పాటు జ్వరం ఉంది. దీంతో పాటు ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్‌ చేరింది. నేను డయాబెటిక్‌ కావడంతో బీపీని కంట్రోల్‌ చేసుకోవడం పెద్ద ఛాలెంజ్‌ అయ్యింది. వైద్యుల సూచనలు పాటించడం ద్వారా కోలుకున్నాను. 

ఇంటింటి సర్వే ఎలా కొనసాగుతోంది?
కేటీఆర్‌: రాష్ట్ర వ్యాప్తంగా జ్వర బాధితులను గుర్తించేందుకు ఇంటింటి సర్వే కోసం 28వేల మందికి పైగా సిబ్బందితో బృందాలను ఏర్పాటు చేశాం. 60లక్షల కుటుంబాలకు సర్వే పూర్తి చేశాం. దాదాపు 2.3లక్షలకు పైగా మెడికల్‌ కిట్‌లను సరఫరా చేశాం. సర్వే కొనసాగుతోంది. ఈ భారీ ప్రయత్నం తాలూకు ఫలితాలు త్వరలోనే కనబడతాయి.

18ఏళ్లు పైబడిన వారికి టీకా ఎప్పటి నుంచి వేస్తారు? 

కేటీఆర్‌: సమస్యంతా టీకా లభ్యతతోనే. మేం ఎంత మేర టీకాను సేకరించగలమో అంతలా కృషిచేస్తున్నాం. ప్రస్తుతానికైతే తొలి డోసు తీసుకున్న 45 లక్షల మందికి రెండో డోసు అందించడంపైనే దృష్టిపెట్టాం. రోజుకు 9లక్షల మందికి టీకాలు పంపిణీ చేసే సామర్థ్యం తెలంగాణకు ఉంది.

బ్లాక్‌ ఫంగస్‌ దేశమంతా వేగంగా వ్యాపిస్తోంది. కొన్ని ఆస్పత్రులు దీనికి చికిత్స అందించేందుకు తిరస్కరిస్తున్నాయి. దీనిపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? 

కేటీఆర్‌: ఆ వివరాలు ఏమైనా ఉంటే నా కార్యాలయానికి పంపగలరు.

తెలంగాణలో చాలా మంది సాయం కోసం ఎవరిని సంప్రదించాలో తెలియడంలేదు. అందువల్ల ప్రభుత్వం 24గంటలూ అందుబాటులో ఉండేలా ట్విటర్‌లో హెల్ప్‌లైన్‌ ఏర్పాటు చేస్తే బాగుటుంది. 

కేటీఆర్‌: ఎలాంటి ప్రశ్నలకైనా, సమస్యలకైనా 108ని సంప్రదించవచ్చు. మీరు జీహెచ్‌ఎంసీ పరిధిలో నివసించేవారైతే 040-21111111కు కాల్‌ చేయవచ్చు.

ఈ మహమ్మారి సమయంలో విద్యార్థులు, తల్లిదండ్రులకు కెరీర్‌ ప్లానింగ్‌ ఏమైనా చెబుతారా?

కేటీఆర్‌:  నేనేమీ నిపుణుడిని కాదు

కొవిడ్‌ కేసులు ఇంకా పెరిగితే గ్రామ/కమ్యూనిటీ ఐసోలేషన్‌ సెంటర్లు పెట్టే ప్రణాళిక ఏమైనా ఉందా? 

కేటీఆర్‌: ప్రజలు ఒకరినొకరు కలవడాన్ని తగ్గించడం ద్వారా (లాక్‌డౌన్‌లు, కర్ఫ్యూలు వంటివి అమలు చేయడం వల్ల)  కరోనాను అరికట్టగలుగుతాం. అందరికీ టీకాల విషయంలో అనేక ప్రశ్నలు ఎదురవుతున్నాయి. వ్యాక్సినేషన్‌లో తెలంగాణ పనితీరు జాతీయ సగటు కన్నా ఇతర రాష్ట్రాల కన్నా మెరుగ్గా ఉంది. కానీ వ్యాక్సిన్ల లభ్యతే ఓ సవాల్‌గా ఉంది. 

మాకు చప్పట్లు వద్దు.. పూల వర్షం కురిపించొద్దు. మాకు ఆత్మగౌరవం కావాలి. సరైన వేతనాలతో భద్రత కల్పించాలి. ఆరోగ్య సిబ్బందికి నాణ్యమైన వైద్య చికిత్స అందించేలా చర్యలు తీసుకోండి. 

కేటీఆర్‌: ఈ విషయాన్ని గౌరవ సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్తాం.

వ్యాక్సినేషన్‌ వేగవంతం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ఎవరితోనైనా డైరెక్టుగా సంప్రదింపులు జరుపుతోందా?  

కేటీఆర్‌:  మేం వ్యాక్సిన్‌ తయారీ దారులతో చర్చలు జరుపుతున్నాం. భారత్‌ బయోటెక్‌, సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌, డాక్టర్‌ రెడ్డీస్‌తో చర్చలు జరుగుతున్నాయి. మేం సేకరించదగినంత టీకాను పొందేలా కృషిచేస్తున్నాం. డీజీసీఐ అనుమతించిన ఏ టీకానైనా మనం సేకరించవచ్చు. ఇప్పటివరకు కొవాగ్జిన్‌, కొవిషీల్డ్‌, స్పుత్నిక్‌-వి మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఫైజెర్‌, మోడెర్నా కూడా కూడా అనుమతించే అవకాశాలు ఉన్నాయి. ఆగస్టు నాటికి బీఈ నుంచి స్వదేశీ టీకా వచ్చే అవకాశం ఉంది. 

సర్‌.. థర్డ్‌ వేవ్‌ ముప్పు ఉందని, అది పిల్లలపై పెద్దగా ప్రభావం చూపిస్తుందని వింటున్నాం. పిల్లలకు టీకా తయారవుతోందా? 

కేటీఆర్‌: చిన్న పిల్లలకు సంబంధించి కొవాగ్జిన్‌ టీకాకు క్లినికల్‌ ట్రయల్స్‌ కొనసాగుతున్నాయి. ఈ టీకాను 5 నుంచి 18 ఏళ్ల వరకు వేయొచ్చు.

అనేకమంది ఫస్ట్‌డోస్‌ కోసం ఎదురుచూస్తున్నారు? ఎప్పుడు వేస్తారు?

కేటీఆర్‌:  నీతిఆయోగ్ సభ్యుడు (ఆరోగ్యం) వీకే పాల్‌ చెప్పిన వివరాల ప్రకారం.. ఆగస్టు నుంచి డిసెంబర్‌ మధ్య 216 కోట్ల టీకా డోసులు అందుబాటులోకి వస్తాయి. వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ భారత్‌లో ఏడాది మొత్తం జరుగుతుంది.

తెలంగాణలో లాక్‌డౌన్‌ మళ్లీ పొడిగిస్తారా?

కేటీఆర్‌: రాష్ట్రంలో ప్రస్తుతం విధించిన లాక్‌డౌన్‌ను కొనసాగించాలా? లేదా?అనే అంశంపై 20న రాష్ట్ర కేబినెట్‌ నిర్ణయం తీసుకుంటుంది. 

మీరు, కేసీఆర్‌ గారు ఇద్దరూ ప్లాస్మాదానం చేస్తారా?

కేటీఆర్‌: త్వరలోనే నేను చేస్తాను

స్పుత్నిక్‌- వి టీకా తెలంగాణలో సామాన్యుడికి ఎప్పుడు ఇస్తారు?
కేటీఆర్‌: 
 కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు కేటాయిస్తుందో.. అప్పుడు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని