baba ka dhaba: మళ్లీ పాత హోటల్‌కే చేరారు!
close

తాజా వార్తలు

Published : 10/06/2021 01:35 IST

baba ka dhaba: మళ్లీ పాత హోటల్‌కే చేరారు!

 

దిల్లీ: బాబా కా ధాబా గుర్తుందా? అదేనండీ గతేడాది కరోనా, లాక్‌డౌన్ సమయంలో కస్టమర్లు లేక ఇబ్బందులు ఎదుర్కొన్న వృద్ధ దంపతుల చిన్న హోటల్‌. ఓ యూట్యూబర్‌ వారి కన్నీటి గాథను సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేయడంతో రాత్రికి రాత్రే ఫేమస్‌ అయిపోయారు. తెల్లవారే సరికి వారి ధాబా ముందు కస్టమర్లు క్యూ కట్టారు. కొందరు దాతలు విరాళాలు ఇచ్చి ఆర్థికంగా ఆదుకున్నారు. దీంతో ఆ వృద్ధ దంపతులు ధాబాను వదిలి పెద్ద హోటల్‌ ప్రారంభించారు. అయితే, గతేడాది లాక్‌డౌన్‌ వారిని ఒక్క మెట్టు పైకి ఎక్కిస్తే.. ప్రస్తుత లాక్‌డౌన్‌ వారిని మళ్లీ కిందకి దించింది. కరోనా, ఆంక్షలు నేపథ్యంలో కస్టమర్ల లేక నష్టాలు వస్తుండటంతో హోటల్‌ను మూసివేసి వారి పాత ధాబానే మళ్లీ ప్రారంభించారు.

వృద్ధ దంపతులు కాంత ప్రసాద్‌, బదామీ దేవీ దిల్లీలోని మాల్వియా నగర్‌లో బాబా కా ధాబా పేరుతో హోటల్‌ నిర్వహించేవారు. నిత్యం కస్టమర్లతో కళకళలాడే ఆ ధాబా.. గతేడాది కరోనా కారణంగా విధించిన లాక్‌డౌన్‌తో మూతపడింది. కొన్ని నెలల తర్వాత ఆంక్షల సడలింపుతో తిరిగి తెరిచినా కస్టమర్లు రాకపోవడంతో వారు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అక్టోబర్‌ నెలలో యూట్యూబర్‌ గౌరవ్‌ వసన్‌ వారి కష్టాలను వీడియో ద్వారా నెటిజన్లకు వివరించి.. వారి హోటల్‌ను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశాడు. ఆ వీడియో వైరల్‌గా మారడంతో దిల్లీ ప్రజలు బాబా కా ధాబా హోటల్‌లో తినడానికి పెద్ద ఎత్తున వచ్చారు. ధాబా ముందు సెల్ఫీలు దిగి సోషల్‌మీడియాలో పోస్టులు చేశారు. ఫుడ్‌ డెలివరీ సంస్థ జోమాటో కూడా తాము సేవలందించే రెస్టారెంట్ల జాబితాలో బాబా కా ధాబాను చేర్చింది. కొందరు దాతలు ఆర్థిక సాయం చేశారు. దీంతో కాంత ప్రసాద్‌ తన అప్పులన్నీ తీర్చేయడంతోపాటు ధాబాను మూసేసి గత డిసెంబర్‌లో స్థానికంగా మరో పెద్ద హోటల్‌ ప్రారంభించాడు.

అయితే, కొత్తగా ప్రారంభించిన హోటల్‌ కొన్ని రోజులు బాగానే నడిచింది. కానీ, మళ్లీ కరోనా విజృంభించడం.. ఆంక్షలు, లాక్‌డౌన్‌ విధించడంతో హోటల్‌కు కస్టమర్ల రాక క్రమంగా తగ్గిపోయింది. దీంతో కాంత ప్రసాద్‌ దంపతులు నష్టాలు భరించలేక ఇటీవల హోటల్‌ను మూసివేశారు. గతంలో మాల్వియా నగర్‌లో వారు నిర్వహించిన చిన్న బాబా కా ధాబా హోటల్‌నే ఇప్పుడు పునఃప్రారంభించారు. ‘‘రూ.లక్ష పెట్టుబడి పెట్టి ప్రారంభించిన కొత్త హోటల్‌లో నష్టాలే ఎదురయ్యాయి. పెట్టుబడి పెట్టిన మొత్తంలో ఇప్పటి వరకు కేవలం రూ.35వేలే వెనక్కి వచ్చాయి. అందుకే ఆ హోటల్‌ను మూసేసి మా పాత హోటల్‌ను తెరిచాం. ఇక్కడ కస్టమర్లు ఎక్కువగా వస్తున్నారు. నేను జీవించి ఉన్నంత వరకు ఈ ధాబాను నిర్వహిస్తా. వ్యాపారం సరిగా సాగకపోతే మూసేస్తా. మా కోసం రూ. 20లక్షలు దాచుకున్నాం’’అని కాంత ప్రసాద్‌ చెప్పుకొచ్చాడు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని