బ్యాంకుల్లోనూ భయం భయం

తాజా వార్తలు

Published : 20/08/2020 01:14 IST

బ్యాంకుల్లోనూ భయం భయం

కరోనా బారిన పడ్డ 3,152 మంది సిబ్బంది


ఇంటర్నెట్‌ డెస్క్‌: రోజు గడవాలన్నా, ఎక్కడికైనా వెళ్లాలన్నా జేబులో డబ్బు ఉండాల్సిందే. అత్యవసరాలతో పాటు నిత్యావసరాలకు కాసులు తప్పనిసరి. లేదంటే పనులు జరగవు. ఆర్థిక అవసరాలు తీర్చడంలో బ్యాంకులది ప్రధాన భూమిక. రుణాల మంజూరు, సేవింగ్స్‌ ఖాతాల నిర్వహణ తదితరాల అవసరాల కోసం బ్యాంకుకు వెళ్లడం తప్పనిసరి. అదే సిబ్బందికి శాపంగా మారుతోంది. ఉద్యోగులు పెద్ద సంఖ్యలో కరోనా బారిన పడుతుండటం కలకలం రేపుతోంది.

నియంత్రణ చర్యలు తీసుకుంటున్నా..

కరోనా వారియర్స్‌గా ముందు వరుసలో విధులు నిర్వహిస్తున్న వైద్యులు, ఆరోగ్య, పారిశుద్ధ్య సిబ్బంది, పోలీసులను వైరస్‌ వదలడం లేదు. ఆయా విభాగాల్లో పని చేస్తున్న వారు పెద్ద సంఖ్యలోనే కొవిడ్‌ బారిన పడ్డారు. ప్రజలకు ఎప్పటికప్పుడు సమాచారం చేరవేసే మీడియా ప్రతినిధులు కరోనాకు గురయ్యారు. ఇదే కోవలో బ్యాంకింగ్‌ రంగాన్ని కొవిడ్‌ భయపెడుతోంది. సిబ్బందికి కరోనా సోకుతుండటం కలకలం రేపుతోంది. ప్రభుత్వ, ప్రైవేటు రంగంలోని బ్యాంకులు కొవిడ్ మార్గదర్శకాలు పాటిస్తున్నా ముప్పు తప్పడం లేదు. ఇప్పటివరకు కరోనా కాటుకు 36మంది చనిపోగా విధులు నిర్వహిస్తున్న బ్యాంకర్లు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. 
తెలంగాణ వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రభుత్వేతర బ్యాంకులకు చెందిన 3,152  మంది సిబ్బంది కరోనా బారిన పడ్డారు. వీరిలో భారతీయ స్టేట్‌ బ్యాంకుకు చెందిన 750 మంది ఉండగా, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు చెందిన 456 మంది, బ్యాంకు ఆఫ్‌ బరోడా 255, సెంట్రల్‌ బ్యాంకు 150, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాకు చెందిన మరో 78 మంది కరోనా బాధితులయ్యారు. వీరితో పాటు వివిధ బ్యాంకుల్లో పని చేసే సిబ్బందికి కరోనా సోకిందని  బ్యాంకు అధికారుల ఫెడరేషన్‌ తెలుగు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శి నాగేశ్వర్‌ తెలిపారు. 
విధి నిర్వహణకు ఉద్యోగుల అనాసక్తి
ప్రధానంగా 50 ఏళ్లు పైబడి దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. అధికారులైతే తమ ఛాంబర్‌లోకి సహోద్యోగులు కూడా రాకుండా ఆంక్షలు విధించారు. పాలనాపరమైన అవసరాలు ఉన్నా వీలైనంత వరకు ఫోన్ల ద్వారానే సమాచార మార్పిడి చేసుకుంటున్నారు. ఉద్యోగులు విధుల నిర్వహణకు చొరవ చూపడం లేదు. కొందరు సిబ్బంది ఏదో ఓ సాకుతో సెలవు పెడుతున్నారు. ఉద్యోగులకు యాజమాన్యాలు శానిటైజర్లు, మాస్కులు, ఫేస్‌ షీల్డ్‌లతో పాటు పీపీఈ కిట్లను సమకూరుస్తోంది. అయినా సిబ్బంది కొవిడ్‌ బారిన పడటం బ్యాంకింగ్‌ రంగాన్ని ఆందోళన కలిగిస్తోంది. కొంత మంది ఖాతాదారులు మార్గదర్శకాలు ఉల్లంఘిస్తూ బ్యాంకుల వద్ద గొడవలకు దిగుతున్నారనే ఆరోపణలున్నాయి. బ్యాంకర్లు కరోనా బారిన పడకుండా చొరవ చూపాలని ప్రభుత్వానికి విన్నవించినా ఆశించిన ఫలితం లేదని ఆలిండియా బ్యాంక్‌ ఆఫీసర్స్‌ కాన్ఫడరేషన్‌ ఆందోళన వ్యక్తం చేసింది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం బ్యాంకర్లు వైరస్‌ బారిన పడకుండా మరిన్ని చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. సేవల కోసం నేరుగా బ్యాంకులకు రాకుండా డిజిటల్‌ లావాదేవీలను నిర్వహించుకోవాలని బ్యాంకర్లు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని