AP NEWS: అయ్యో పాపం!

తాజా వార్తలు

Updated : 01/06/2021 16:06 IST

AP NEWS: అయ్యో పాపం!

తిరుపతి: నాలుగైదేళ్లుగా తన కుమారుడి నరకయాతన చూసిన ఆ తల్లి గుండె తల్లడిల్లింది. పేగు తెంచుకుని పుట్టిన కొడుకు కళ్ల ముందే కుమిలిపోతూ ఉంటే చూసి తట్టుకోలేకపోయింది. చేతిలో ఉన్న ప్రతి పైసా ఖర్చు పెట్టి ఆరోగ్యం కుదుటపడేలా చేయాలని తాపత్రయ పడినా సాధ్యం కాక మనసు చంపుకొని  తన బిడ్డకు కారుణ్య మరణాన్ని ప్రసాదించాలని వేడుకుంది. ఆ తల్లి వేదన ఆలకించిందో ఏమో... కారుణ్య మురణానికి అనుమతి లభించకముందే ఆ పసివాడి ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోయాయి. చిత్తూరు జిల్లా పుంగనూరులో జరిగిన హృదయవిదారక ఘటన ఇది.

వివరాల్లోకి వెళితే... చిత్తూరుజిల్లా చౌడేపల్లి మండలం బీర్జెపల్లికి చెందిన మణి, అరుణల కుమారుడు హర్షవర్దన్‌ (9) అరుదైన రక్త సంబంధిత వ్యాధితో ఐదేళ్లుగా పోరాడుతున్నాడు. ఐదేళ్లక్రితం పాఠశాలలో ఉండగా జరిగిన ప్రమాదంతో హర్షవర్దన్‌లోని రక్త సంబంధిత వ్యాధి వెలుగుచూసింది. కారణం లేకుండా శరీరభాగాల నుంచి రక్తం ధారలా కారిపోయే ఆ వ్యాధిని నయం చేయించేందుకు హర్షవర్దన్‌ తల్లిదండ్రులు చేయని ప్రయత్నాలు లేవు. కడు పేద కుటుంబం కావడంతో ఉన్నదంతా అమ్మేసి అప్పులు చేసి వైద్యం చేయించినా హర్షవర్దన్‌ కోలుకోలేదు. కుమారుడిపై తండ్రి ఆశలు వదిలేసుకున్నా తల్లి అరుణ మాత్రం ఎడతెగని పోరాటం చేస్తూనే ఉంది. తన బిడ్డను బతికించుకునేందుకు ఉన్న అన్ని అవకాశాలను ప్రయత్నించింది. ఎక్కడ చూపించినా వైద్యులు తమ వల్ల కాదని చెప్పడంతో తన బిడ్డ బాధ చూడలేక ప్రభుత్వమే ఆదుకోవాలని ... లేదా కారుణ్య  మరణం ప్రసాదించాలని కోరుతూ పుంగనూరు కోర్టును వేడుకోవాలని రెండ్రోజులుగా ప్రయత్నిస్తోంది. కోర్టుకు సెలవులు అని స్థానికులు చెప్పడంతో తిరుగు ప్రయాణం అవుతుండగా హర్షవర్దన్‌ ప్రాణాలు కోల్పోయాడు. చేసేదిలేక తన భర్త ఇల్లు వదిలి వెళ్లిపోయినా.. ఇన్నేళ్లపాటు ప్రాణాలతో పోరాడిన పేగుబంధం విగతజీవిగా మారడంతో ఆ తల్లి కన్నీరుమున్నీరుగా విలపించడం అందరినీ కలచివేసింది. స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఆ తల్లిని ఓదార్చేందుకు గ్రామస్థులంతా ప్రయత్నిస్తున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని