AP News: చిన్నారుల కోసం 3 చోట్ల కేర్‌ సెంటర్లు: జగన్‌

తాజా వార్తలు

Updated : 07/06/2021 17:24 IST

AP News: చిన్నారుల కోసం 3 చోట్ల కేర్‌ సెంటర్లు: జగన్‌

థర్డ్‌వేవ్‌ వస్తే తీసుకోవాల్సిన చర్యలపై సీఎం సమగ్ర సమీక్ష

అమరావతి: చిన్నారుల కోసం రాష్ట్రవ్యాప్తంగా 3 కేర్‌ సెంటర్లు ఏర్పాటు చేయాలని ఏపీ సీఎం జగన్‌ అధికారులను ఆదేశించారు. విశాఖ, తిరుపతితో పాటు విజయవాడ-గుంటూరు ఒకచోట వాటిని సిద్ధం చేయాలని సూచించారు. కొవిడ్‌ నియంత్రణ, నివారణ, వ్యాక్సినేషన్‌పై తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం సమీక్ష నిర్వహించారు. కొవిడ్‌ థర్డ్‌వేవ్‌ వస్తే తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో జగన్‌ సమగ్రంగా చర్చించారు. థర్డ్‌వేవ్‌పై అనాలసిస్‌, డేటాలను అధికారులు ఆయనకు వివరించారు. చిన్నారుల కోసం ఏర్పాటు ఒక్కో కేర్‌ సెంటర్ నిర్మాణానికి రూ.180కోట్లతో ప్రణాళిక సిద్ధం చేయాలని సీఎం ఆదేశించారు. థర్డ్‌వేవ్‌పై పిల్లల తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని.. పోషకాహార పంపిణీ, టీకాల కార్యక్రమాన్ని కొనసాగించాలని సూచించారు. 

థర్డ్‌వేవ్‌ వస్తుందనే భావించి సిద్ధమవ్వాలి

పిల్లల్లో కరోనా లక్షణాలు గుర్తించేందుకు ఆశా, ఆరోగ్య కార్యకర్తలకు శిక్షణ ఇవ్వాలని.. అన్ని బోధనాసుపత్రుల్లో పీడియాట్రిక్‌ వార్డులు ఏర్పాటు చేయాలని జగన్‌ దిశానిర్దేశం చేశారు. పీహెచ్‌సీలు, ఏరియా ఆస్పత్రులను పరిశీలించి అవకాశం ఉన్నచోట పిల్లలకు చికిత్స అందించాలన్నారు. థర్డ్‌వేవ్‌ వస్తుందా? లేదా? అనేదానిపై ఆధారాలు లేవని అధికారులు పేర్కొనగా.. థర్డ్‌వేవ్‌ వస్తుందనే భావించి కావాల్సిన మందులను ముందే సిద్ధం చేసుకోవాలని సీఎం సూచించారు. అప్పటికప్పుడు మందులు దొరకవని.. ముందుగానే నాణ్యమైన ఔషధాలను తెచ్చుకోవాలన్నారు. అవసరమైన మేరకు వైద్యులు, సిబ్బందిని నియమించేందుకు చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశించారు. ఆస్పత్రుల వారీగా ఆక్సిజన్‌ ఉత్పత్తి ప్లాంట్లపైనా దృష్టి పెట్టాలని సూచించారు. దీనికి సంబంధించి జరుగుతున్న పనులపై ఎప్పటికప్పుడు నివేదించాలని ఆదేశించారు. ఎలాంటి పరిస్థితులు వచ్చినా ఎదుర్కొనేందుకు సన్నద్ధంగా ఉండాలన్నారు. 

అలసత్వం వద్దు

ప్రస్తుతం రాష్ట్రంలో కొవిడ్‌ కేసుల సంఖ్య తగ్గుతున్నా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరముందని సీఎం చెప్పారు. పాజిటివిటీ రేటు తగ్గడంతోపాటు పరిస్థితి అదుపులోకి వచ్చేంత వరకు అధికార యంత్రాంగం అలసత్వం వహించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేశారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని