పనితీరు సరిగా లేకపోతే క్షమించను: కేసీఆర్‌
close

తాజా వార్తలు

Published : 14/06/2021 01:32 IST

పనితీరు సరిగా లేకపోతే క్షమించను: కేసీఆర్‌

పల్లె, పట్టణ ప్రగతిపై సీఎం సమీక్ష

హైదరాబాద్‌: రాష్ట్రంలోని పల్లెలు, పట్టణాల అభివృద్ధికి అందరి భాగస్వామ్యం కావాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. ఒక జిల్లాను దత్తత తీసుకుని పల్లె, పట్టణ ప్రగతిలో పాల్గొననున్నట్లు సీఎం చెప్పారు. గ్రామాలు, పట్టణాల అభివృద్ధిని యజ్ఞంలా భావించి కృషి చేయాలన్నారు. గ్రామాలు, పట్టణాల్లో పచ్చదనం, పరిశుభ్రతకు ప్రాధాన్యమిచ్చే పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలు ప్రారంభించి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా వాటి అమలు తీరుపై సీఎం సమీక్షించారు. అన్ని జిల్లాల అదనపు కలెక్టర్లు, జిల్లా పంచాయతీ అధికారులు(డీపీవో)తో పల్లె, పట్టణ ప్రగతిపై సమీక్ష నిర్వహించారు.

త్వరలోనే హరితహారం కార్యక్రమాన్ని చేపట్టాలని అధికారులను సీఎం ఆదేశించారు. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతిలో భాగంగా మొక్కలు నాటడం, తదితర కార్యక్రమాల పురోగతిని స్వయంగా పరిశీలిస్తానని వెల్లడించారు. ఇందులో భాగంగా జూన్‌ 20న సిద్దిపేట, కామారెడ్డి జిల్లాల్లోని కొన్ని గ్రామాలు, జూన్‌ 21న వరంగల్‌ జిల్లాలో ఆకస్మిక తనిఖీలు ఉంటాయని తెలిపారు. అధికారులు పనితీరు చక్కదిద్దుకోకపోతే క్షమించే ప్రస్తకే లేదని సీఎం హెచ్చరించారు. ఆకస్మిక తనిఖీ సందర్భంగా అదనపు కలెక్టర్లు, డీపీఓల పనితీరు బేరీజు వేసి కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఆ తర్వాత ఎవరు చెప్పినా వినేది లేదని స్పష్టం చేశారు. జూన్‌ 21న వరంగల్‌ పర్యటనలో భాగంగా నూతనంగా నిర్మించిన జిల్లా కలెక్టరేట్‌ను సీఎం ప్రారంభించనున్నారు. అక్కడే మల్టీ సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రికి శంకుస్థాపన చేయనున్నారు. 24 అంతస్తులతో అత్యంత ఆధునిక సాంకేతిక హంగులతో ఈ గ్రీన్‌ బిల్డింగ్‌ ఆస్పత్రిని నిర్మించనున్నారు.

తక్షణ పరిష్కారం కోసం నిధులు..
స్థానిక సంస్థల సమస్యల తక్షణ పరిష్కారం కోసం అదనపు కలెక్టర్లకు రూ.25 లక్షల నిధులు కేటాయిస్తున్నట్లు సీఎం తెలిపారు. అలాగే అదనపు కలెక్టర్లకు రాష్ట్ర ప్రభుత్వం కొత్త వాహనాలను కేటాయించింది. ఒక్కొక్కటి దాదాపు రూ.25 లక్షల విలువైన కియా కార్లను అదనపు కలెక్టర్ల కోసం కొనుగోలు చేసింది. ముఖ్యమంత్రి సమీక్ష అనంతరం వాహనాలను వారికి అందించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని