సాధారణ జలుబు‌తో కొవిడ్‌ నుంచి రక్షణ!

తాజా వార్తలు

Updated : 24/03/2021 13:05 IST

సాధారణ జలుబు‌తో కొవిడ్‌ నుంచి రక్షణ!

బ్రిటన్‌ పరిశోధనల్లో వెల్లడి

ఇంటర్నెట్‌ డెస్క్‌: కరోనా వైరస్‌ను నివారించేందుకు ఓ వైపు వ్యాక్సిన్లను అందుబాటులోకి తీసుకువస్తుండగా, మరోవైపు చికిత్స కోసం ప్రయోగాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో సాధారణ జలుబుకు కారణమయ్యే వైరస్‌, కొవిడ్‌ మహమ్మారిని ఎదుర్కోవడంతోపాటు కొంతవరకు రక్షణ కల్పిస్తున్నట్లు బ్రిటన్‌లోని యూనివర్సిటీ ఆఫ్‌ గ్లాస్‌గోవ్‌ పరిశోధకులు వెల్లడిస్తున్నారు. అయితే, ఈ రక్షణ కొంతకాలం మాత్రమే ఉంటుందని స్పష్టంచేస్తున్నారు.

మానవుల్లో సాధారణ జలుబుకు రైనోవైరస్ అనే వైరస్‌ కారణమని తెలిసిందే. మనలో కనిపించే జలుబు ఇన్‌ఫెక్షన్లకు దాదాపు 40శాతం ఈ రైనోవైరస్ కారణమవుతున్నట్లు అంచనా. ఒకవేళ ఇది వచ్చినప్పటికీ దీని ప్రభావం స్పల్పకాలమే ఉంటుంది. సాధారణంగా ఇలాంటి వైరస్‌లు తమ మనుగడ కోసం ఇతర స్థావరాలపై ఆధారపడుతాయి. ఇలా ఎన్నో రకాల వైరస్‌లకు మానవ శరీరం కేంద్రంగా ఉండగా, వీటిలో కొన్ని సొంతంగా తమ స్థావరాలను ఏర్పరచుకుంటాయి. మరికొన్ని మాత్రం ఇతర వైరస్‌లతో కలిసి జీవిస్తాయి. కానీ, ఇన్‌ఫ్లూయెంజా, రైనోవైరస్‌లు మానవ శరీర కణాలపై దాడి చేసి ఒంటరిగానే వాటి మనుగడ కోసం పోరాటం చేస్తాయి.

రైనోవైరస్ ప్రభావాన్ని తెలుసుకునేందుకు పరిశోధన చేపట్టిన బ్రిటన్‌ శాస్త్రవేత్తలు, మానవ శ్వాసకోస ప్రతిరూపాన్ని ఉపయోగించారు. ఇందులో సార్స్‌-కోవ్‌-2, రైనోవైరస్ రెండింటినీ స్వేచ్ఛగా కణాలకు సోకే విధంగా వదిలిపెట్టారు. కొంత వ్యవధి కాలంలో ఈ రెండు వైరస్‌లను విడుదల చేసి, ఆయా సమయాలను నోట్‌ చేసుకున్నారు. అనంతరం రైనోవైరస్‌ను సార్స్‌-కోవ్‌-2 వైరస్‌ ఎదుర్కోలేకపోతున్నట్లు పరిశోధకులు గుర్తించారు. ‘మానవ శ్వాసకోస కణాల్లో కరోనావైరస్‌కు కారణమయ్యే ప్రతిరూపాలను అడ్డుకోవడం కోసం రైనోవైరస్‌ రోగనిరోధక ప్రతిస్పందనలను ప్రేరేపిస్తున్నట్లు గుర్తించాము’ అని పరిశోధనలో పాల్గొన్న ప్రొఫెసర్‌ పాబ్లో మర్సియా వివరించారు. తద్వారా సాధారణ జలుబు వల్ల వచ్చే రోగనిరోధక శక్తి కరోనా వైరస్‌ను ఎదుర్కోవడంలో రక్షణ కల్పిస్తుందని నిర్ధారణ చేసుకున్నామన్నారు.

రక్షణ స్వల్ప కాలమే..!

కరోనా వైరస్‌ ఇన్‌ఫెక్షన్‌ నిర్మూలనలో రైనోవైరస్‌ సమర్థవంతంగా దోహదపడుతుందని, కానీ, కరోనా మహమ్మారి నిర్మూలనకు ఇదే పూర్తి పరిష్కారం కాదని పరిశోధకులు అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా రైనోవైరస్‌ వల్ల కలిగే రక్షణ సుదీర్ఘకాలం ఉండదని, జలుబు తగ్గిన కొన్ని రోజులకే వాటి వల్ల వచ్చిన రోగనిరోధకత తగ్గిపోవడమే ఇందుకు కారణమని బ్రిటన్‌ శాస్త్రవేత్త ప్రొఫెసర్‌ పాబ్లో మర్సియా పేర్కొన్నారు. అయినప్పటికీ, యూరప్‌లో దశాబ్దం కిందట వచ్చిన స్వైన్‌ఫ్లూ మహమ్మారిని తగ్గించడంలోనూ, వైరస్‌ వ్యాప్తిని మందగించడంలో రైనోవైరస్‌ దోహదపడినట్లు వచ్చిన అధ్యయనాలను పరిశోధకులు ఉదహరిస్తున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని