వ్యాక్సిన్‌ ధర తగ్గించిన భారత్‌ బయోటెక్‌

తాజా వార్తలు

Updated : 29/04/2021 18:06 IST

వ్యాక్సిన్‌ ధర తగ్గించిన భారత్‌ బయోటెక్‌

హైదరాబాద్‌: కరోనా వ్యాక్సిన్‌ ధరను తగ్గిస్తూ ప్రముఖ ఔషధ తయారీ సంస్థ భారత్‌ బయోటెక్‌ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఆ సంస్థ తయారు చేస్తున్న కొవాగ్జిన్‌ను రూ.400లకే రాష్ట్ర ప్రభుత్వాలకు అందించనున్నట్లు ప్రకటించింది. అంతకు ముందు రాష్ట్ర ప్రభుత్వాలకు రూ.600లకు కొవాగ్జిన్‌ అందిస్తామని ప్రతిపాదించిన సంగతి తెలిసిందే.

బుధవారం కొవిషీల్డ్‌ ధరను తగ్గిస్తూ సీరం ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రాలకు రూ.300లకు విక్రయించనున్నట్లు ఆ సంస్థ సీఈవో అదర్‌ పూనావాలా ట్వీట్‌ చేశారు. గతంలో ఈ ధర రూ.400 ఉండేది. తాజాగా భారత్‌ బయోటెక్‌ కొవాగ్జిన్‌ ధరను రూ.600 నుంచి రూ.400లకు తగ్గించింది. సవరించిన ధరకు రాష్ట్రాలకు అందించనుంది. ప్రస్తుతం భారత్‌ ఎదుర్కొంటున్న క్లిష్ట పరిస్థితుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు భారత్‌ బయోటెక్‌ ప్రకటించింది.

ఇక కొవాగ్జిన్‌ను ప్రైవేటు ఆస్పత్రులకు ఒక డోసు టీకా రూ.1200 ధరకు ఇవ్వనున్నట్లు గతంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. ఎగుమతి ధర 15 డాలర్ల నుంచి 20 డాలర్ల (దాదాపు రూ.1100-1500) వరకూ ఉంటుంది. తమ టీకా తయారీ సామర్థ్యంలో 50 శాతానికి పైగా, కేంద్ర ప్రభుత్వానికి సరఫరా చేయడానికి ప్రత్యేకించినట్లు భారత్‌ బయోటెక్‌ వెల్లడించింది. కొవాగ్జిన్‌ టీకాను భారత ప్రభుత్వానికి ఒక డోసుకు రూ.150 ధరకు అందిస్తున్నామని, దాన్ని ప్రభుత్వం ప్రజలకు ఉచితంగా పంపిణీ చేస్తోందని పేర్కొంది. టీకా అభివృద్ధి, క్లినికల్‌ పరీక్షల నిర్వహణ, ఉత్పత్తికి ఇప్పటివరకూ సొంత నిధులు ఖర్చు చేసినట్లు వివరించింది. ఇది ఎంతో శుద్ధి చేసిన ఇన్‌-యాక్టివేటెడ్‌ టీకా అని, దీన్ని తయారు చేయటం అత్యంత ఖరీదైన వ్యవహారమని తెలియజేసింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని