Ts Corona: అదనంగా 12వేల పడకలు
close

తాజా వార్తలు

Published : 24/04/2021 20:28 IST

Ts Corona: అదనంగా 12వేల పడకలు

తెలంగాణ సీఎస్‌ సోమేశ్‌కుమార్‌

హైదరాబాద్: రానున్న రోజుల్లో కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు రాష్ట్రంలో ఆక్సిజన్ సౌకర్యంతో కూడిన 12వేల అదనపు పడకలను యుద్ధప్రాతిపదినక ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్లను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) సోమేశ్ కుమార్ ఆదేశించారు. ఇందు కోసం రూ.20 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసినట్లు చెప్పారు. కొవిడ్ నివారణ చర్యలపై అన్ని జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, వైద్యాధికారులు, జిల్లా, ప్రాంతీయ ఆస్పత్రుల సూపరింటెండెంట్లతో సీఎస్ దృశ్యమాధ్యమ సమీక్ష నిర్వహించారు. మౌలిక సదుపాయాలు, మానవ వనరులను కరోనా నియంత్రణలో సమర్థంగా వినియోగించుకోవాలన్నారు. మహమ్మారిపై పోరులో అన్ని శాఖలు కలిసి సమన్వయంతో పనిచేయాలని కోరారు.

‘‘రోగుల పరిస్థితులకు అనుగుణంగా అన్ని ఆస్పత్రుల్లో సరైన వైద్యం అందేలా వ్యవస్థను ఏర్పాటు చేయాలి. స్వల్ప లక్షణాలున్న వారికి చికిత్స కోసం కరోనా కేర్ సెంటర్లను వీలైనంత ఎక్కువగా వినియోగించుకోవాలి. ఆస్పత్రికి వచ్చే ఏ రోగికీ చికిత్స నిరాకరించరాదు. ప్రతి బాధితుడికి తగిన చికిత్స అందేలా కలెక్టర్లు తగు చర్యలు తీసుకోవాలి. జిల్లా వైద్యాధికారులు, ఆస్పత్రుల సూపరింటెండెంట్లు, ఆర్ఎంవోలతో కలెక్టర్లు రోజుకు రెండు మార్లు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి ఎప్పటికప్పుడు పరిస్థితులు అంచనా వేసి తగిన చర్యలు తీసుకోవాలి.

అవసరమైతే ఇతర శాఖల నుంచి సిబ్బందిని కేటాయించాలి. ఆ బాధ్యత పూర్తిగా కలెక్టర్లదే. లేదా తాత్కాలిక పద్ధతిలో నియమించుకోవాలి. ఆస్పత్రుల్లో సరిపడా ఆక్సిజన్ అందుబాటులో ఉండేలా చూసుకోవాలి. ప్రస్తుత పరిస్థితుల్లో అత్యంత కీలకమైన ఆక్సిజన్‌ను సమర్థంగా, జాగ్రత్తగా వినియోగించుకోవాలి. ఒక్క యూనిట్ కూడా వృథా కాకూడదు. ఆస్పత్రుల్లో వీలైనంత ఎక్కువ మంది రోగులకు చికిత్స అందేలా చూడాలి. అవకాశం ఉన్న చోట వార్డులను కొవిడ్ వార్డులుగా మార్చి ఆక్సిజన్, ఐసీయూ, వెంటిలేటర్ సౌకర్యం కల్పించాలి. అవసరమైతే  రాష్ట్రంలోని వైద్య కళాశాలల్లో ఉన్న మానవవనరులు, మౌలిక సదుపాయాలను ఉపయోగించుకోవాలి’’ అని సీఎస్‌ వివరించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని