
తాజా వార్తలు
మాస్కులు, వెంటిలేషన్తోనే వైరస్ కట్టడి..!
వాషింగ్టన్: గది, ఇండోర్ ప్రదేశాల్లో గాలిలో వైరస్ వ్యాప్తి చెందుతున్నట్లు ఇప్పటికే పలు అధ్యయనాలు వెల్లడించాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఇండోర్ ప్రదేశాలైన ఆసుపత్రులు, జైళ్లు, మాంస ప్యాకింగ్ కేంద్రాల్లో వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు కేవలం మాస్కులు, భౌతిక దూరం ఉంటే సరిపోదని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా సరైన వెంటిలేషన్‌తో పాటు మాస్కు నుంచి లీకేజీలను గుర్తించడం, భౌతిక దూరాన్ని పాటించడం వైరస్ వ్యాప్తి కట్టడిలో ఎంతో కీలకమని సూచిస్తున్నారు.
జలుబు, దగ్గు వంటి సమస్యలున్నప్పుడు గది వాతావరణంలో వైరస్ నుంచి మాస్కులు, భౌతిక దూరం ఎంతవరకు రక్షణ కల్పిస్తాయనే దానిపై ఇప్పటివరకు అధ్యయనాలు వచ్చాయి. కానీ, ఇలాంటి లక్షణాలేవీ లేని సమయంలోనూ సాధారణ శ్వాస వల్ల గాలిలో వైరస్ ఏవిధంగా వ్యాప్తి చెందుతున్న దానిపై ఐఐటీ భువనేశ్వర్ శాస్త్రవేత్తలు పరిశోధన జరిపారు. తాజా అధ్యయనం అమెరికన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిజిక్స్‌లో ప్రచురితమయ్యింది.
అధ్యయనంలో భాగంగా ఓ మనిషి నమూనాకు కృత్రిమ శ్వాసను అందించే ఏర్పాట్లు చేశారు. వీటికి నీరు, గ్లిజరిన్‌తో కూడిన మిశ్రమాన్ని ఓ పొగమంచు ఉత్పత్తి సాధనంతో ప్రయోగించి..అనంతరం వీడియో కెమెరా సాయంతో ఏరోసల్ రేణువుల గమనాన్ని పరీక్షించారు. ముఖంపై ఎటువంటి మాస్కు లేని సమయంలో శ్వాసరేణువులు 5సెకన్లలోనే 4 అడుగుల దూరం ప్రయాణిస్తున్నట్లు కనుగొన్నారు. ముఖ్యంగా ఎన్-95, ఐదు లేయర్లు కలిగిన మాస్కులు పూర్తి రక్షణ కలిగిస్తున్నాయని గుర్తించినట్లు పరిశోధనకు నేతృత్వం వహించిన వేణుగోపాల్ వెల్లడించారు. మాస్కుల్లో లీకేజీ ఉన్నట్లయితే సాధారణ సంభాషణ చేసినప్పుడు నోటి నుంచి వెలువడే సూక్ష్మ బిందువులు కొంతదూరం ప్రయాణిస్తున్నాయని తెలిపారు. ఈ నేపథ్యంలో భౌతిక దూరం పాటించడం వీలుకాని ప్రాంతాల్లో కేవలం మాస్కులు సరిపోవని.. సరైన వెంటిలేషన్, ఫేస్‌షీల్డ్ వంటివి ఉండాలని సూచిస్తున్నారు.