Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లోని టాప్ 10 వార్తలు

తాజా వార్తలు

Updated : 16/09/2021 17:08 IST

Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లోని టాప్ 10 వార్తలు

1. పేదలకు ఇచ్చిన ఇళ్ల రుణాలకు వన్‌టైం సెటిల్‌మెంట్ పథకం‌: పేర్ని నాని

విశాఖ ఎల్జీ పాలిమర్స్ సంస్థ భూముల్లో ప్లాస్టిక్ పరిశ్రమను తొలగించేందుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రమాద రహిత, పర్యావరణ అనుకూల పరిశ్రమను నెలకొల్పేందుకు ఎల్జీ పాలిమర్స్‌కు అనుమతి ఇచ్చింది. మైనార్టీ సబ్ ప్లాన్‌కు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. హౌసింగ్‌ కార్పొరేషన్‌ వద్ద కుదువపెట్టిన పత్రాలను ప్రైవేటు ఆస్తిగా మార్చుకొనేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందని పేర్ని నాని తెలిపారు. 1983 నుంచి పేద, మధ్యతరగతి ప్రజలు రుణాలు పొంది కట్టుకున్న ఇళ్ల ధ్రువపత్రాలు హౌసింగ్‌ కార్పొరేషన్ వద్దే ఉన్నాయన్నారు. ఇలా రాష్ట్రంలో 56,67,301 మంది లబ్ధిదారులకు వన్‌టైం సెటిల్‌మెంట్‌ ద్వారా రుణ విముక్తి కల్పించాలని నిర్ణయించినట్లు చెప్పారు.

ఓట్ల లెక్కింపునకు ఏపీ ఎస్‌ఈసీ కసరత్తు
మోదీ దేశాన్ని హోల్‌సేల్‌గా అమ్మేస్తున్నారు: నారాయణ

2. వచ్చే ఐదేళ్లలో ₹3 లక్షల కోట్ల ఎగుమతులు.. 10 లక్షల ఉద్యోగాలు: కేటీఆర్‌

ఐటీ, అనుబంధ రంగాల్లో వచ్చే ఐదేళ్లల్లో రూ.3 లక్షల కోట్ల ఎగుమతులు.. 10లక్షల ఉద్యోగాలు లక్ష్యంగా పెట్టుకున్నామని తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ వెల్లడించారు. దీంతో పాటు ఎలక్ట్రానిక్స్‌లో రూ.70 వేల కోట్లు పెట్టుబడులు సాధించటం లక్ష్యంగా చేసుకున్నామని కేటీఆర్ స్పష్టం చేశారు. ఈ కంపెనీలను ద్వితీయ శ్రేణి నగరాలకు విస్తరిస్తామని.. ఈ విషయంలో కంపెనీలు కూడా కలిసి రావాలని కోరారు. హైదరాబాద్‌ హెచ్‌ఐసీసీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 2021-26 కాలానికి వర్తించే రెండో ‘ఇన్‌ఫర్‌మేషన్ అండ్ కమ్యూనికేషన్‌ టెక్నాలజీ’ పాలసీని కేటీఆర్ ఆవిష్కరించారు.

3. ప్రపంచంలో అసలైన మనుషులు ఇద్దరే ఇద్దరు!

తనీశ్‌, ముస్కాన్‌ సేథి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘మరో ప్రస్థానం’. జానీ దర్శకత్వం వహించారు. ఈ సినిమా సెప్టెంబరు 24న విడుదలకానుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం ట్రైలర్‌ని విడుదల చేసింది. స్ట్రింగ్‌ ఆపరేషన్‌ నేపథ్యంలో సాగే కథ ఇది. విలన్‌ బృందం వరుస హత్యలు చేస్తుంటుంది. హీరో బృందం వాటిని చిత్రీకరించి, నిజాన్ని బయటపెట్టాలనుకుంటుంది. హత్యల్ని షూట్‌ చేసిన కెమెరా విలన్లకి దొరుకుతుంది. దాంతో రెండు బృందాల మధ్య పోరాటం మొదలవుతుంది. ఈ క్రమంలో సాగే సంభాషణలు మెప్పిస్తున్నాయి.

4. తెలంగాణలో మహిళలకు భద్రత లేదు: విజయశాంతి

తెలంగాణలో మహిళలకు భద్రత లేకుండా పోయిందని భాజపా నేత విజయశాంతి ఆరోపించారు. రాష్ట్రంలో మహిళలు, యువతులు బయట తిరిగే పరిస్థితి లేదన్నారు. సైదాబాద్‌ బాధిత కుటుంబాన్ని విజయశాంతి పరామర్శించారు. సింగరేణికాలనీలో దారుణమైన ఘటన జరిగినా, ముఖ్యమంత్రి రాకపోవడం సిగ్గుచేటని.. కేసీఆర్‌కు సీఎంగా కొనసాగే హక్కులేదన్నారు. చట్టాలను మార్చాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా విజయశాంతి అభిప్రాయపడ్డారు. ఈ అంశాన్ని ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళ్లనున్నట్లు చెప్పారు. 

5. షావోమి స్మార్ట్‌గ్లాసెస్‌.. స్క్రీన్ కాదు మరో స్మార్ట్‌ఫోన్‌

షావోమి కంపెనీ స్మార్ట్‌ వేరబుల్స్‌ శ్రేణిలో మరో కొత్త ఉత్పత్తిని విడుదల చేసింది. ఇప్పటికే ఫిట్‌నెస్‌ బ్యాండ్, స్మార్ట్‌వాచ్‌లతోపాటు గృహోపకరణాలను విడుదల చేసిన షావోమి.. తాజాగా స్మార్ట్‌ గ్లాసెస్‌ను తీసుకొచ్చింది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న స్మార్ట్‌గ్లాసెస్‌ మోడల్స్‌కి భిన్నంగా సరికొత్త ఫీచర్స్‌ని ఇందులో పరిచయం చేసినట్లు తెలిపింది. షావోమి స్మార్ట్‌గ్లాసెస్‌లో మైక్రో ఎల్‌ఈడీ ఆప్టికల్ వేవ్‌గైడ్ సాంకేతికతను ఉపయోగించారు. దీంతో స్మార్ట్‌గ్లాసెస్‌ మెసేజ్‌లు, నోటిఫికేషన్లు, నేవిగేషన్, కాలింగ్, ఫొటో, ట్రాన్స్‌లేషన్ వంటి సర్వీసులను యూజర్‌కి అందిస్తుంది. షావోమి స్మార్ట్‌గ్లాసెస్‌లో క్వాడ్‌కోర్ ఏఆర్‌ఎమ్‌ ప్రాసెసర్‌ను ఉపయోగించారు. ఆండ్రాయిడ్ ఓఎస్‌ సాయంతో ఈ స్మార్ట్‌గ్లాసెస్ పనిచేస్తాయి.

6. భాజపా ‘నో రిపీట్‌’ ఫార్ములా.. గుజరాత్‌లో ‘కొత్త’ కేబినెట్‌

ప్రధానమంత్రి నరేంద్రమోదీ సొంతరాష్ట్రమైన గుజరాత్‌లో నూతన మంత్రివర్గం కొలువుదీరింది. మూడు రోజుల క్రితం నూతన ముఖ్యమంత్రిగా భూపేంద్ర పటేల్‌ బాధ్యతలు చేపట్టగా.. గురువారం మంత్రుల ప్రమాణస్వీకారం జరిగింది. గాంధీనగర్‌లోని రాజ్‌భవన్‌లో జరిగిన కార్యక్రమంలో మొత్తం 24 మంది శాసనసభ్యులతో గవర్నర్‌ ఆచార్య దేవవ్రత్‌ ప్రమాణం చేయించారు. వీరిలో 10 మంది కేబినెట్‌ మంత్రులు కాగా.. 14 మంది సహాయ/స్వతంత్ర మంత్రులు. గుజరాత్‌లో వచ్చే ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని భాజపా ‘నో రిపీట్‌’ విధానాన్ని అవలంభించింది.

7. Imran Khan on Taliban: తాలిబన్లతో కలిసి పనిచేయాల్సిందే..!

అఫ్గానిస్థాన్‌ను హస్తగతం చేసుకొని ప్రభుత్వం ఏర్పాటు చేసిన తాలిబన్లతో కలిసి పనిచేసేందుకు అంతర్జాతీయ సమాజం ముందుకు రావాలని పాకిస్థాన్‌ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ ఖాన్ పిలుపునిచ్చారు. అక్కడి మహిళల హక్కులతో పాటు సమ్మిళత ప్రభుత్వం ఏర్పాటు విషయంలో వారిని ప్రోత్సహించాలని సూచించారు. తీవ్ర సంక్షోభ పరిస్థితులు నెలకొన్న అఫ్గానిస్థాన్‌లో శాంతి, స్థిరత్వం రావాలంటే తాలిబన్లతో అంతర్జాతీయ సమాజం కలిసి పనిచేయడం ఒక్కటే మార్గమని ఇమ్రాన్‌ ఖాన్‌ అభిప్రాయపడ్డారు.

8. సెన్సెక్స్‌ @59 వేలు.. బ్యాంక్‌ షేర్ల అండతో మరోసారి గరిష్ఠాలకు సూచీలు

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు మరోసారి దూసుకెళ్లాయి. వాహన, టెలికాం రంగాలకు కేంద్ర కేబినెట్‌ ఇచ్చిన బూస్ట్‌తో బుధవారం జీవనకాల గరిష్ఠాలను తాకిన సూచీలు.. గురువారం నాటి ట్రేడింగ్‌లోనూ అదే దూకుడును కనబరిచాయి. దీంతో సెన్సెక్స్‌ 59,000 మార్కుపైన ముగియగా.. నిఫ్టీ 17,600 పాయింట్లపైన స్థిరపడింది. ఈ నెల 3న తొలిసారి సెన్సెక్స్‌ 58 వేల మార్కును అందుకోగా.. రెండు వారాల వ్యవధిలోనే మరో మైలురాయిని అధిగమించింది. ముఖ్యంగా బ్యాంక్‌ షేర్లు రాణించడంతో సూచీలు వరుసగా మూడోరోజూ లాభాల్లో ముగిశాయి.

9. ధోనీ అద్భుతమైన కెప్టెన్‌: ముత్తయ్య మురళీధరన్‌

‘ధోనీ అద్భుతమైన కెప్టెన్‌’ అని శ్రీలంక మాజీ స్టార్‌ స్పిన్నర్‌ ముత్తయ్య మురళీధరన్‌ ప్రశంసించారు. ఆయన ఐపీఎల్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ తరపున ధోనీతో కలిసి ఆడిన అనుభవాలను గుర్తుచేసుకొన్నారు. ‘చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్టు చాలా బాగుంది. ఐపీఎల్ ఆరంభ సీజన్‌(2008) గురించి మాట్లాడుకుంటే.. టోర్నీలో చాలా సార్లు 200 పరుగుల మార్కును దాటడంతోపాటు ఎక్కువ వికెట్లు తీశారు. కెప్టెన్‌గా ధోనీ చాలా బాగా పనిచేశాడు. అప్పుడు జట్టులో ఉన్న చాలా మంది ఆటగాళ్లు వారి జాతీయ జట్లలో దిగ్గజ క్రికెటర్లు. ధోనీ ప్రతి ఆటగాడిని అర్థం చేసుకుంటాడు. బలమైన జట్టుని నిర్మించాడు’ అని ముత్తయ్య పేర్కొన్నాడు.

10. వరంగల్‌ ఎంజీఎంకు రాజు మృతదేహం...చెప్పులు విసిరిన స్థానికులు

రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సైదాబాద్‌ హత్యాచార కేసు నిందితుడు రాజు మృతదేహం వరంగల్‌ ఎంజీఎం మార్చురీకి చేరింది. భారీ పోలీసు బందోబస్తు నడుమ మృతదేహాన్ని కాజీపేట రైల్వే సీఐ రామ్మూర్తి ఆధ్వర్యంలో అంబులెన్స్‌లో తరలించారు. మృతదేహం మార్చురీకి చేరుకోగానే పోలీసులు మార్చురీ గేట్లు మూసివేశారు. ఈక్రమంలో గుర్తు తెలియని వ్యక్తులు మృతదేహాన్ని తరలిస్తున్న అంబులెన్స్‌పై చెప్పులు విసిరారు. దీంతో పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యారు. ఎంజీఎం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 

రాజును పోలీసులే కాల్చి చంపారు: కుటుంబ సభ్యుల ఆరోపణ


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని