Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లోని టాప్ 10 వార్తలు

తాజా వార్తలు

Published : 19/09/2021 16:57 IST

Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లోని టాప్ 10 వార్తలు

1. గంగమ్మ ఒడికి చేరిన ఖైరతాబాద్‌ మహాగణపతి

పంచముఖ రుద్ర మహా గణపతి రూపంలో భక్తులకు దర్శనమిచ్చిన ఖైరతాబాద్‌ గణేశుడి నిమజ్జనం పూర్తయింది. ట్యాంక్‌బండ్‌పై ఏర్పాటు చేసిన నాలుగో నంబర్‌ క్రేన్‌ ద్వారా మహా గణపతిని గంగమ్మ ఒడికి చేర్చారు. చివరి రోజు మహాగణపతి దర్శనం కోసం భారీగా భక్తులు తరలివచ్చారు. ఇవాళ ఉదయం 8.18 గంటలకు ప్రారంభమైన గణనాథుని శోభాయాత్ర.. భక్తుల కోలాహలం మధ్య సందడిగా కొనసాగింది. 9 రోజులుగా మహాగణపతి దర్శనం కోసం హైదరాబాద్‌ సహా వివిధ ప్రాంతాల నుంచి భారీగా భక్తులు తరలివచ్చారు.

తిరుపతిలో కూలిన తితిదే ఆర్చి.. తప్పిన పెను ప్రమాదం

2. తెదేపా అడ్డుతగిలినా సీఎం జగన్‌ వెంటే ప్రజలు: కన్నబాబు

ఆంధ్రప్రదేశ్‌లో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఫలితాలు చూస్తుంటే సీఎం జగన్‌ విజయ పరంపర కొనసాగుతున్నట్లు అర్థమవుతోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు అన్నారు. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో వైకాపాకు 80 శాతం ఫలితాలు వచ్చాయని.. ఇప్పుడు ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లోనూ అంతకుమించి ఫలితాలు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. సీఎం జగన్‌కు ప్రజాబలం ఉందని చెప్పేందుకు ఈ ఎన్నికల ఫలితాలే నిదర్శనమన్నారు.

3. నిమజ్జనానికి వచ్చేవారు స్వీయ జాగ్రత్తలు పాటించాలి: మంత్రి తలసాని

గణనాథుల నిమజ్జనానికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తెలంగాణ ప్రభుత్వం పక్కా ఏర్పాట్లు చేసిందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. కొవిడ్  నిబంధనల మేరకు నిర్వాహకులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. నగరంలో గణేశ్‌ నిమజ్జనం ఏర్పాట్లను ఆయన పర్యవేక్షించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలూ చోటుచేసుకోకుండా అన్ని శాఖలను అప్రమత్తం చేశామని తెలిపారు. నిమజ్జనం కోసం పెద్ద ఎత్తున ప్రజలు ట్యాంక్‌బండ్‌ వద్దకు వచ్చే నేపథ్యంలో.. కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేసినట్టు తెలిపారు.

4. ఎంపీపీ, జడ్పీ ఛైర్మన్‌ ఎన్నికకు ఎస్‌ఈసీ నోటిఫికేషన్‌

ఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతున్న నేపథ్యంలో ఎంపీపీ, జడ్పీ ఛైర్మన్‌ ఎన్నికకు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. మండల, జిల్లా పరిషత్‌ అధ్యక్షులు, ఉపాధ్యక్షుల ఎన్నికకు తేదీలు ఖరారు చేసింది. ఈ మేరకు ఎస్‌ఈసీ నీలం సాహ్ని ఆదేశాలు జారీ చేశారు. ఈనెల 24న మధ్యాహ్నం 3 గంటలకు ఎంపీపీ, వైస్‌ ఎంపీపీ.. 25న మధ్యాహ్నం 3 గంటలకు జడ్పీ ఛైర్మన్‌, వైస్‌ ఛైర్మన్ల ఎన్నిక ప్రక్రియ చేపట్టనున్నారు.

పరిషత్ ఎన్నికల కౌంటింగ్‌ లైవ్‌బ్లాగ్‌

5. వారి ఆహ్వానం.. పెట్టుబడుల ఆకర్షణకు అవకాశంగా భావిస్తాను: కేటీఆర్

తెలంగాణ రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌కు మరో అరుదైన గౌరవం దక్కింది. వచ్చే ఏడాది జనవరి 17 నుంచి 21వరకు స్విట్జర్‌ల్యాండ్‌లోని దావోస్‌లో వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం (డబ్ల్యూఈఎఫ్‌) నిర్వహించే వార్షిక సదస్సు-2022కు హాజరుకావాల్సిందిగా డబ్ల్యూఈఎఫ్‌ నుంచి కేటీఆర్‌కు ఆహ్వానం అందింది. కొవిడ్ నుంచి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ వేగంగా కోలుకోవడానికి సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ కేటీఆర్ నాయకత్వంలో తెలంగాణ చూపిన విజన్‌కు గుర్తింపుగా ఆయన్ను ఆహ్వానించినట్లు డబ్ల్యూఈఎఫ్‌ వెల్లడించింది. తెలంగాణను సాంకేతిక రంగంలో రారాజుగా కేటీఆర్ నిలిపారని డబ్ల్యూఈఎఫ్ అధ్యక్షుడు బోర్గ్ బ్రెండె ప్రశంసించారు.

6. తల్లిదండ్రులపై పోలీసులకు ఫిర్యాదు చేసిన తమిళ నటుడు విజయ్‌

అనుమతి లేకుండా తన పేరు వాడుతున్నారంటూ తమిళ సినీనటుడు విజయ్‌.. తల్లిదండ్రులతో పాటు మరో 11 మందిపై కేసు పెట్టిన ఘటన సంచలనం సృష్టించింది. వివరాల్లోకి వెళితే... ఏడాది క్రితం విజయ్‌ మక్కల్‌ ఇయ్యకమ్‌ పేరుతో ఆయన తండ్రి చంద్రశేఖర్‌ పార్టీ పెట్టారు. పార్టీకి ప్రధాన కార్యదర్శి, కోశాధికారిగా విజయ్‌ తల్లిదండ్రులు ఉన్నారు. తండ్రి పెట్టిన పార్టీతో తనకు సంబంధం లేదని హీరో విజయ్‌ గతంలో ప్రకటించారు. కానీ, తల్లిదండ్రులు విజయ్‌పేరుతో పార్టీ కార్యకలాపాలు కొనసాగిస్తున్నారని, తన పేరు వాడుకుంటున్నారని ఆరోపిస్తూ విజయ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

7. పంజాబ్‌ సీఎంగా సుఖ్‌జిందర్‌ సింగ్‌ రంధావా!

పంజాబ్‌ తదుపరి ముఖ్యమంత్రిగా సుఖ్‌జిందర్‌ సింగ్‌ రంధావా నియమితులుకానున్నారు. మెజార్టీ ఎమ్మెల్యేలు ఆయనవైపే మొగ్గు చూపడంతో అధిష్ఠానంతో చర్చించి ఏఐసీసీ నియమించిన పరిశీలకులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. కాసేపట్లో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌ రాజీనామా నేపథ్యంలో ఈ ప్రకటన వెలువడనుంది. తొలుత పీసీసీ మాజీ అధ్యక్షుడు సునీల్‌ జాఖడ్‌, ప్రతాప్‌ సింగ్‌ బజ్వా, మాజీ సీఎం రాజేందర్‌ కౌర్‌ భట్టల్‌ పేర్లు కూడా వినిపించినప్పటికీ.. అదృష్టం సుఖ్‌జిందర్‌నే వరించినట్లు తెలిసింది.

Gujarat: ఒక్కరోజు కలెక్టర్‌గా 11 ఏళ్ల బాలిక..!

8. టోల్‌ ద్వారా ఏటా రూ.1.40 లక్షల కోట్లు!

ప్రతిష్ఠాత్మక దిల్లీ-ముంబయి ఎక్స్‌ప్రెస్‌వే అందుబాటులోకి వస్తే.. నెలకు దాదాపు రూ.1,000-1,500 కోట్ల ఆదాయం వస్తుందని కేంద్ర రహదారులు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ(ఎన్‌హెచ్‌ఏఐ) రానున్న రోజుల్లో కాసుల వర్షం కురిపించనుందన్నారు. టోల్‌ రూపంలో ఎన్‌హెచ్‌ఏఐకి ఏటా వస్తున్న రూ.40 వేల కోట్ల ఆదాయం వచ్చే ఐదేళ్లలో రూ.1.40 లక్షల కోట్లకు పెరుగుతుందని అంచనా వేశారు.

9. అమెరికా పక్షాన ఉన్నందుకు భారీ మూల్యం చెల్లించాం..!

అఫ్గాన్‌ యుద్ధంలో అమెరికా పక్షాన నిలిచినందుకు పాకిస్థాన్‌ భారీ మూల్యమే చెల్లించిందని ఆ దేశ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ వాపోయారు. దీనికి తోడు అవమానకర రీతిలో అమెరికన్లు అఫ్గానిస్థాన్‌ను వీడటానికి కూడా ఇస్లామాబాదే  కారణమని నిందిస్తున్నట్లు పేర్కొన్నారు. ‘రష్యా టుడే’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అమెరికా అధికారులపై ఇమ్రాన్‌ ఖాన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. అమెరికాపై నిందలు వచ్చిన ప్రతిసారి వారు పాకిస్థాన్‌ వైపు వేలెత్తి చూపుతారన్నారు. ఇటీవల అమెరికా సెనేట్‌లోని విదేశీ వ్యవహారాల కమిటీ విచారణలో చాలా మంది అధికారులు పాక్‌ను నిందించారు. తాలిబన్లకు వారే ఆశ్రయమిచ్చారని ఆరోపించారు.

10. చెన్నైపై సిక్సుల వర్షం కురిపిస్తే.. రోహిత్‌ అరుదైన రికార్డు

ముంబయి ఇండియన్స్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ కొత్త చరిత్రకు అడుగు దూరంలో నిలిచాడు. ఆదివారం చెన్నైతో తలపడే మ్యాచ్‌లో అతడు చెలరేగితే టీ20 క్రికెట్‌లో భారత్‌ తరఫున అరుదైన రికార్డు నెలకొల్పనున్నాడు. పరిమిత ఓవర్లలో ధనాధన్‌ బ్యాటింగ్‌తో అదరగొట్టే ఈ ముంబయి బ్యాట్స్‌మన్‌ సాయంత్రం మరో మూడు సిక్సర్లు బాదితే పొట్టి ఫార్మాట్‌లో మొత్తం 400 సిక్సులు పూర్తిచేసిన తొలి భారత బ్యాట్స్‌మన్‌గా నిలుస్తాడు. ప్రస్తుతం రోహిత్‌ 397 సిక్సర్లతో కొనసాగుతున్నాడు.

చెన్నైతో పోరులో ముంబయికి ఆ ఒక్కటే సమస్య


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని