ఖాళీలను గుర్తించేదెప్పుడు.. భర్తీ చేసేదెపుడు?
close

తాజా వార్తలు

Published : 28/01/2020 07:03 IST

ఖాళీలను గుర్తించేదెప్పుడు.. భర్తీ చేసేదెపుడు?

ఏపీపీఎస్సీ ఉద్యోగ ప్రకటనల కోసం ఎదురుచూపులు

ఈనాడు, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఏపీపీఎస్సీ) నుంచి వెలువడే ఉద్యోగ ప్రకటనల కోసం నిరుద్యోగులు ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం నుంచి ఉద్యోగ ఖాళీల వివరాలు అందితే ప్రకటనల జారీకి సిద్ధమని ఏపీపీఎస్సీ చెబుతోంది. కానీ.. ప్రభుత్వశాఖల్లో ఖాళీల గుర్తింపు కసరత్తు మాత్రం ప్రాథమిక దశలోనే ఉన్నట్లు తెలిసింది. మరోవైపు.. వయోపరిమితిని 42 నుంచి 46 సంవత్సరాలకు పొడిగించే అవకాశాలున్నా అధికారిక ఉత్తర్వులు రాలేదు. ఈడబ్ల్యూఎస్‌ అమలుపై ఉత్తర్వులొస్తే 9 రకాల నోటిఫికేషన్ల జారీపై సందిగ్ధత వీడుతుంది. భూపరిపాలనశాఖలో 600 వరకు జూనియర్‌ అసిస్టెంట్లు, ఇతర శాఖలకు చెందిన మరికొన్ని ఉద్యోగాల ఖాళీల వివరాలు ఏపీపీఎస్సీ వద్ద సిద్ధంగా ఉన్నాయి.

ముఖ్యమంత్రి మాట.. తూచ్‌
జనవరి 1వ తేదీనే ఏపీపీఎస్సీ ద్వారా ఉద్యోగ ప్రకటనల జారీకి ‘వార్షిక పట్టిక’ను (క్యాలెండర్‌) విడుదల చేస్తామని ముఖ్యమంత్రి జగన్‌ సెప్టెంబరు 30న ప్రకటించారు. కానీ.. ఇది కార్యరూపం దాల్చలేదు. సంక్రాంతి తర్వాత లేదా జనవరి నెలాఖరులోగా వార్షిక పట్టికను విడుదల చేస్తామని ఏపీపీఎస్సీ డిసెంబరు నెలాఖరులో ప్రకటించింది. కానీ ఇంతవరకు ఏపీపీఎస్సీకి ఉద్యోగ ఖాళీల వివరాలే అందలేదు.

మందకొడిగా చర్యలు
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి హయాంలో ఏటా క్రమం తప్పకుండా వార్షిక పట్టిక జారీ చేయాలని అధికారిక ఉత్తర్వులు వెలువడ్డాయి. కానీ అమలు కాలేదు. గత ప్రభుత్వ హయాంలో ఏపీపీఎస్సీ తాత్కాలిక వార్షిక పట్టిక జారీచేసింది. ఇదీ కార్యరూపం దాల్చలేదు. మౌఖిక పరీక్షలు రద్దు చేస్తున్నట్లు వైకాపా ప్రభుత్వం అక్టోబరులో ప్రకటించడంతో నిరుద్యోగులు సన్నద్ధత ప్రారంభించారు. కానీ వివిధశాఖల్లో ఉద్యోగ ఖాళీల గుర్తింపునకు అవసరమైన చర్యలు మందకొడిగా సాగుతున్నాయి. ఖాళీల గుర్తింపుపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి స్థాయిలో అన్ని శాఖలతో ఓ సమీక్ష జరిగింది. మలి విడత సమావేశాన్ని నెల రోజుల తర్వాత నిర్వహిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. తదుపరి చర్యలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లున్నాయి. ఖాళీ అయ్యే ఉద్యోగాల్లో 70% ప్రత్యక్ష నియామకాలు, 30% పదోన్నతులతో భర్తీ చేస్తారు. ఈ వివరాలపై ఆయాశాఖల్లో స్పష్టత రావాల్సి ఉంది. ప్రభుత్వం హామీ ఇచ్చిన అధ్యాపకులు, ఇతర ఒప్పంద ఉద్యోగాల క్రమబద్ధీకరణ విషయంలోనూ అధికారిక నిర్ణయం వెల్లడిలో జాప్యం జరుగుతోంది. ఈ విషయం తేలితే భర్తీ చేయాల్సిన పోస్టుల సంఖ్యపై స్పష్టత వస్తుంది. ఇలా రకరకాల కారణాలతో ఉద్యోగ ఖాళీలను గుర్తించలేకపోతున్నారు. ఉద్యోగ ఖాళీల గుర్తింపుపై అధికారిక ఉత్తర్వులు వెలువడి, అదనపు సమాచారం అందితేనే ప్రకటన జారీకి ఏపీపీఎస్సీ సిద్ధమవుతుంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని