బస్సు కండక్టర్‌ స్థాయి నుంచి ఐఏఎస్‌ దిశగా!
close

తాజా వార్తలు

Published : 29/01/2020 00:34 IST

బస్సు కండక్టర్‌ స్థాయి నుంచి ఐఏఎస్‌ దిశగా!

బెంగళూరు: జీవితంలో ఉన్నతమైన లక్ష్యాలు ఉంటే ఏదైనా సాధించగలం.. ఆ మాటను బెంగళూరుకు చెందిన ఓ వ్యక్తి నిరూపిస్తున్నాడు. బస్సు కండక్టర్‌ నుంచి ఏకంగా సివిల్‌ సర్వీసెస్‌ అధికారి అయ్యే దిశగా అడుగులు వేస్తున్నాడు. ఇటీవలె విడుదలైన యూపీఎస్సీ సివిల్స్‌ పరీక్ష మెయిన్స్‌లో ఉత్తీర్ణత సాధించిన కండక్టర్‌ మధు.. మార్చి 25న నిర్వహించబోయే ఇంటర్వ్యూకు సన్నద్ధమవుతున్నాడు.

మధుది కర్ణాటకలోని మాండ్య మాలవల్లి గ్రామం.  బెంగళూరు మెట్రో పాలిటన్‌ రవాణా సంస్థ(బీఎంటీసీ)లో కండక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. పేద కుటుంబం కావడంతో దూరవిద్య ద్వారా కళాశాల విద్య పూర్తి చేసిన మధు.. 19 ఏళ్లకే కండక్టర్‌ ఉద్యోగంలో చేరాడు. జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలని నిత్యం పరితపించేవాడు. ఉద్యోగం చేస్తూనే యూపీఎస్సీ సివిల్స్‌ పరీక్షకు నిత్యం ఐదు గంటలు సన్నద్ధమయ్యాడు.

గత జూన్‌లో నిర్వహించిన ప్రిలిమ్స్‌లో ఉత్తీర్ణత సాధించిన మధు.. ఇటీవల విడుదలైన మెయిన్స్‌ ఫలితాల్లోనూ పాసై అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాడు. ప్రస్తుతం ఐఏఎస్‌ అధికారి అవడమే లక్ష్యంగా ఇంటర్వూకు సిద్ధమవుతున్నాడు.

ఈ సందర్భంగా మధు మాట్లాడుతూ.. ‘ఎలాంటి కోచింగ్‌ లేకుండా యూపీఎస్సీ సివిల్‌ సర్వీసెస్‌ పరీక్ష కోసం నిత్యం ఐదు గంటలు స్వతహాగా సిద్ధం అయ్యాను. మా బాస్‌(బీఎంటీసీ ఎండీ) శిఖా సైతం నాకు సహాయం చేశారు. విలువైన సూచనలు అందించారు. ప్రస్తుతం ఇంటర్వ్యూకు హాజరయ్యేందుకు కూడా ఆమె నాకు సలహాలు ఇస్తున్నారు. ఆమె స్ఫూర్తిగా తీసుకుని నేను ముందుకువెళ్తున్నాను. నేను ఇప్పుడు ఏ పరీక్ష పాసయ్యానో నా తల్లిదండ్రులకు తెలియదు. కానీ వారు సంతోషంగా ఉన్నారు. జీవితంలో ఉన్నతమైన స్థాయికి ఎదగాలనే ఆశయమే ఈ పరీక్షలో పాసయ్యేందుకు తోడ్పడింది. ప్రస్తుతం ఇంటర్వ్యూకు వెళ్లడానికి కూడా ఎంతో ఆత్మవిశ్వాసంతో ఉన్నాను’ అని తెలిపాడు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని