బీటెక్‌లో ఈఏడాది 4 కొత్త కోర్సులు:JNTUH

తాజా వార్తలు

Published : 04/02/2020 16:26 IST

బీటెక్‌లో ఈఏడాది 4 కొత్త కోర్సులు:JNTUH

హైదరాబాద్‌: ఇంజినీరింగ్‌ విద్యలో నాణ్యతా ప్రమాణాలు పడిపోతున్నాయనే ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో జేఎన్‌టీయూ హైదరాబాద్‌ చర్యలు చేపట్టింది. కళాశాలల అనుబంధ గుర్తింపును మరింత కఠినతరం చేసే దిశగా నిబంధనల్లో పలు మార్పులు చేస్తూ ముసాయిదాను రూపొందించింది. ఇందులో భాగంగానే బీటెక్‌లో ఈ ఏడాది నాలుగు కొత్త కోర్సులకు జేఎన్‌టీయూ హైదరాబాద్‌ ఆమోదముద్ర వేసింది. కృత్రిమ మేథ, కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఐటీ, కంప్యూటర్ సైన్స్‌ అండ్‌ బిజినెస్‌ సిస్టమ్స్‌, ఐటీ అండ్‌ ఇంజినీరింగ్‌ కోర్సులకు అనుమతిచ్చింది. కొత్త మార్పులతో బీటెక్‌లో కోర్సుల సంఖ్య 22కు పెరిగింది. అదేవిధంగా ఎం ఫార్మసీలో ప్రస్తుతం ఉన్న 4 కోర్సులను రద్దు చేసి కొద్ది మార్పులతో మరో నాలుగింటిని చేర్చింది. ఫార్మసీ ప్రాక్టీస్‌, ఫార్మాస్యూటికల్‌ అనాలిసిస్‌, ఫార్మాస్యూటికల్‌ రెగ్యులేటరీ అఫైర్స్‌, ఫార్మాస్యూటికల్‌ క్వాలిటీ అస్యూరెన్స్‌ కోర్సులను కొత్తగా ఆమోదించింది. రాష్ట్ర ప్రభుత్వం అనుమతిస్తే కళాశాలలు కొత్త కోర్సులు, సీట్ల సంఖ్య పెంచుకోవచ్చని జేఎన్‌టీయూహెచ్‌ ప్రతిపాదించింది. ముసాయిదాను వెబ్‌సైట్‌లో ఉంచి సలహాలు, సూచనలను ఆహ్వానించింది. 

ఆ బాధ్యత యాజమాన్యాలదే..

అదేవిధంగా అధ్యాపకుల విద్యార్హతలు నకిలీవని తేలితే యాజమాన్యాలదే బాధ్యత అని జేఎన్‌టీయూ హైదరాబాద్‌ స్పష్టం చేసింది. నిబంధనలు పాటించకపోతే అనుబంధ గుర్తింపు రద్దు చేస్తామని హెచ్చరించింది. డిగ్రీ, పీజీ విద్యార్థులు, అధ్యాపకులందరికీ బయోమెట్రిక్‌ హాజరు విధానం అమలు చేయాలని ముసాయిదాలో స్పష్టం చేసింది. అధ్యాపకులు కళాశాల నుంచి మధ్యలో వెళ్లిపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొంది. ప్రతినెలా సక్రమంగా జీతం ఇవ్వడంతోపాటు సర్వీసు రిజిస్టర్లను యూనివర్సిటీలకు పంపించాలని కళాశాలలకు సూచించింది. ప్రతి కళాశాల తప్పనిసరిగా పాలకమండలిని ఏర్పాటు చేసుకుని ఏటా రెండు సార్లు సమావేశమై తీర్మానాలను ఆన్‌లైన్‌లో విశ్వవిద్యాలయానికి పంపించాలని సూచించింది. విద్యార్థులు, సిబ్బంది సమస్యల పరిష్కారానికి ఆన్‌లైన్‌ వ్యవస్థ ఏర్పాటు చేసి ఫిర్యాదులను వారం రోజుల్లో పరిష్కరించాలని ఆదేశించింది. లేనిపక్షంలో యాజమాన్యం యూనివర్సిటీ ఎదుట హాజరుకావాల్సి ఉంటుందని ముసాయిదాలో జేఎన్‌టీయూహెచ్‌ స్పష్టం చేసింది.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని