మేడారం బయలుదేరిన పగిడిద్దరాజు
close

తాజా వార్తలు

Updated : 04/02/2020 19:30 IST

మేడారం బయలుదేరిన పగిడిద్దరాజు

మహబూబాబాద్‌‌: మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరకు వేలాదిగా తరలివస్తున్న భక్తులతో మేడారం జనసంద్రమైంది. మేడారం జాతర రేపు ప్రారంభం కానుంది. ఈ జాతరలో ప్రధాన ఘట్టాల్లో ఒకటి పగిడిద్దరాజును మేడారం గద్దెల వద్దకు తీసుకురావడం. మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం పోనుగొండ్ల నుంచి సమ్మక్క భర్త పగిడిద్దరాజును తీసుకొని పెనుక వంశస్తులు మేడారానికి ప్రయాణం ప్రారంభించారు. కాలినడకన 66 కి.మీ. అటవీ మార్గంలో ప్రయాణించి పగిడిద్దరాజును మేడారం గద్దెల వద్దకు తీసుకురానున్నారు.

మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం పోనుగొండ్ల గ్రామంలోని ప్రజలంతా తమ ఇళ్లకు మట్టిపూతలు చేసుకుని, ముగ్గులు వేసుకున్నారు. స్వామి వారిని కుంకుమ భరణి రూపంలో పెనుక వంశస్తులు ఇంటి నుంచి ఆలయానికి తీసుకొచ్చారు. అనంతరం స్వామివారిని పడగ రూపంలో అలంకరించి స్థానిక పగిడిద్దరాజు ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. శివసత్తుల పూనకాలతో డోలు వాయిద్యాలతో స్వామివారిని ఊరేగించారు. అనంతరం పడగరూపంలో అలంకరించిన స్వామివారి ప్రతిమతో అటవీమార్గం మీదుగా కాలినడకన గిరిజనులు మేడారం బయలుదేరారు. దాదాపు 66 కి.మీ. ప్రయాణం చేయాల్సి ఉండగా ఈరోజు రాత్రి ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం లక్ష్మీపురం గ్రామానికి చేరుకుంటారు. అక్కడ పెనుక వంశస్తుల ఇంట్లో బసచేసి రేపు మళ్లీ అక్కడి నుంచి బయలుదేరుతారు. బుధవారం రాత్రి మేడారం సమ్మక్క ఆలయానికి చేరుకుంటారు. కన్నెపల్లి నుంచి సారక్క, కొండాయి నుంచి గోవిందరాజులు సైతం మేడారం సమ్మక్క ఆలయానికి చేరుకుంటారు. అక్కడ పూజారులంతా కలిసి పూజలు చేసి దేవుళ్లను గద్దెలపై ప్రతిష్ఠిస్తారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని