కేరళలో ‘ఈనాడు’ ఇళ్ల పట్టాలు అందజేసిన సీఎం

తాజా వార్తలు

Updated : 09/02/2020 23:31 IST

కేరళలో ‘ఈనాడు’ ఇళ్ల పట్టాలు అందజేసిన సీఎం

అలెప్పీ: కేరళ వరదల్లో తీవ్రంగా నష్టపోయిన అలెప్పీ ప్రజలను ఆదుకోవాలని రామోజీ గ్రూప్‌ బలంగా నిశ్చయించుకుందని కేరళ సీఎం పినరయి విజయన్‌ అన్నారు. కేరళ ప్రభుత్వం కంటే ఎక్కువ ఆసక్తి, తపన కనబరిచిందని ఆయన కొనియాడారు. ఆదివారం కేరళ వరద బాధితులకు ‘ఈనాడు’ సహాయనిధితో చేపట్టిన నూతన గృహాలను సీఎం అందజేశారు. 121 లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు, తాళాలను ఆయన అందించారు. అలెప్పీలోని హోటల్‌ కేమ్లాట్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. సంకల్పం బలంగా ఉన్నందునే ఈ కార్యక్రమం నిర్వహించుకుంటున్నామని సీఎం అన్నారు. ముందుకొచ్చి బాధితులను ఆదుకున్నందుకు రామోజీ గ్రూప్‌ను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నట్లు విజయన్‌ చెప్పారు. ఈ కార్యక్రమం కోసం యువ ఐఏఎస్‌ మైలవరపు కృష్ణతేజ పోషించిన పాత్ర కీలకమని సీఎం కొనియాడారు. భవిష్యత్తులో కేరళ ప్రభుత్వ సంబంధిత కార్యక్రమాల్లో రామోజీ గ్రూప్‌ భాగస్వామ్యం అవుతుందని ఆశిస్తున్నట్లు ఆయన చెప్పారు.

ఆదుకోవడంలో రామోజీ గ్రూప్‌ ముందుంటుంది: సీహెచ్‌ కిరణ్‌, ఈనాడు ఎండీ

ప్రకృతి విపత్తులు వచ్చినపుడు బాధితులను ఆదుకోవడంలో రామోజీ గ్రూప్‌ ఎప్పుడూ ముందుంటుందని ‘ఈనాడు’ ఎండీ సీహెచ్‌ కిరణ్‌ అన్నారు. ఇళ్ల పట్టాల పంపిణీ సందర్భంగా ఆయన మాట్లాడారు. కేరళ కుటుంబశ్రీ ద్వారా ఈ ప్రాజెక్టును తీర్చిదిద్దిన వారికి  ఆయన అభినందనలు తెలిపారు. గుజరాత్‌లోని కచ్‌ ప్రాంతంలో భూకంపం, ఒడిశాలో సూపర్‌ సైక్లోన్‌, తమిళనాడులో సునామీ, విశాఖలో హుద్‌హుద్‌తో పాటు కృష్ణా, గోదావరి నదులకు వరదలు.. ఇలా విపత్తులు వచ్చినపుడు అండగా నిలిచినట్లు కిరణ్‌ గుర్తు చేశారు. కేరళలోని వరద బాధితులకు ఇళ్లు కట్టించి ఇచ్చే మహాక్రతువులో పాల్గొని పూర్తి సహాయ సహకారాలు అందించిన ఐఏఎస్‌ అధికారి కృష్ణతేజతో పాటు స్థానిక అధికారులకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. లబ్ధిదారులకు ఇళ్లు అందించే కార్యక్రమంలో కేరళ మంత్రులు థామస్‌ ఐజక్‌, సుధాకరన్‌, తిలోత్తమన్‌, ‘ఈనాడు’ తెలంగాణ ఎడిటర్‌ డీఎన్‌ ప్రసాద్‌, మార్గదర్శి వైస్‌ ప్రెసిడెంట్‌ రాజాజీ, యువ ఐఏఎస్‌ అధికారి, కేరళ పర్యాటక శాఖ ఏడీజీ మైలవరపు కృష్ణతేజ పాల్గొన్నారు. వరద బాధితులకు ఇళ్ల నిర్మాణం చేపట్టిన విధానాన్ని కృష్ణతేజ.. ‘ఈనాడు’ ఎండీ కిరణ్‌కు వివరించారు.

కేరళ వరదల్లో సర్వం కోల్పోయిన వారికి అండగా నిలిచేందుకు రామోజీ గ్రూపు సంస్థల తరఫున ఛైర్మన్‌ రామోజీరావు రూ.3కోట్లతో ‘ఈనాడు’ సహాయనిధిని ఏర్పాటు చేశారు. మానవతావాదులూ ఇతోధికంగా సాయం చేయాలంటూ పిలుపునిచ్చారు. ఈ పిలుపును అందుకున్న ప్రజలు, చిరు వ్యాపారులు, విద్యార్థులు, పారిశ్రామిక  వేత్తలు, ఎన్‌ఆర్‌ఐలు... ఇలా ఎందరో సహృదయులు తమకు సాధ్యమైనంత మేరకు విరాళాలు అందించారు. వారి దాతృత్వ హృదయాన్ని సాక్షాత్కరిస్తూ నిధి రూ.7.77 కోట్లకు చేరింది. ఆ డబ్బుతో అలెప్పీ జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో సర్వం కోల్పోయిన 121 కుటుంబాలకు ‘ఈనాడు’ ఆధ్వర్యంలో రెండు పడకగదుల ఇళ్లు కట్టించారు. ప్రతి రూపాయినీ సద్వినియోగం చేస్తూ... బాధితులకు నిలువ నీడ కల్పించాలన్న సంకల్పంతో చేపట్టిన ఈ మహాక్రతువులో మహిళలు కీలక భూమిక పోషించారు. కేరళలోనే అతిపెద్ద మహిళా గ్రూప్‌ కుటుంబశ్రీకి ఇళ్ల నిర్మాణ బాధ్యత అప్పగించడంతో ఇది సాధ్యమైంది.

ఫొటోగ్యాలరీ కోసం క్లిక్‌ చేయండి

ఇవీ చదవండి..

 ‘ఈనాడు’ ఎండీకి లబ్ధిదారుల కృతజ్ఞతలు

 సాయం మీది... సంతోషం వారిది!

 

 

 Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని