విశాఖలో హైరిస్క్‌ జోన్లు ఇవే!

తాజా వార్తలు

Updated : 24/03/2020 16:35 IST

విశాఖలో హైరిస్క్‌ జోన్లు ఇవే!

ఆయా ప్రాంతాల్లో ప్రత్యేక చర్యలు

 1470 మంది హోం క్వారంటైన్‌..

వెల్లడించిన మంత్రి ఆళ్ల నాని

విశాఖ: విదేశాల నుంచి రాష్ట్రానికి వచ్చేవాళ్లు అధికారులకు సహకరించాలని.. లేకపోతే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ఏపీ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని హెచ్చరించారు. కరోనా నివారణకు విశాఖ జిల్లాలో 20 కమిటీలు ఏర్పాటు చేసినట్టు చెప్పారు. మంగళవారం విశాఖలో మరో ఇద్దరు మంత్రులు కన్నబాబు, అవంతి శ్రీనివాస్‌తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. విశాఖలో మూడు కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని చెప్పారు. నగరంలోని సీతమ్మధార, గాజువాక, అనకాపల్లి ప్రాంతాలను హైరిస్క్‌ జోన్లగా గుర్తించినట్లు ఆయన వివరించారు. ఆయా ప్రాంతాల్లో ప్రత్యేక చర్యలకు చేపడుతున్నామన్నారు. విశాఖ జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు 1470 మంది హోం క్వారంటైన్‌లో ఉన్నారని చెప్పారు. కరోనా నివారణపై జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉందన్నారు. 

ఐసోలేషన్‌ వార్డులు, క్వారంటైన్‌ కేంద్రాల్లో అన్ని వసతులు కల్పిస్తు్న్నట్లు ఆళ్ల నాని వివరించారు. కరోనా నివారణ చర్యలకు కేంద్రం నుంచి నిధులు వచ్చే అవకాశముందన్నారు. అయితే ఆ నిధులు వచ్చేంత వరకు ఎదురు చూడకుండా ముందుగానే జాగ్రత్తలు చేపట్టామని.. సీఎం జగన్‌ కూడా అందుకే లాక్‌డౌన్‌ నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. లాక్‌డౌన్‌ సమయంలో ప్రజలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకూడదనే రేషన్‌కార్డు లబ్ధిదారులకు బియ్యం పంపిణీ చేయడంతో పాటు ఖర్చుల కోసం రూ.వెయ్యి నగదును అందజేయనున్నామని వివరించారు. మంత్రి కన్నబాబు మాట్లాడుతూ కరోనాపై విశాఖ జిల్లా యంత్రాంగం చేపట్టిన చర్యలు సంతృప్తికరంగా ఉన్నాయన్నారు. విదేశాల నుంచి అధికంగా వచ్చినవాళ్లు ఉన్న ప్రాంతాలనే హైరిస్క్‌ జోన్లుగా ప్రకటించామని.. అలా అని ఆయా ప్రాంతాల్లో ఉన్న అంతమందికీ ముప్పు ఉన్నట్లు కాదని స్పష్టం చేశారు. ప్రతి 10 మంది విదేశీ ప్రయాణికులకు ఒక అధికారిని కేటాయించామన్నారు. ప్రతి పంచాయతీలోనూ కార్యదర్శులను ప్రత్యేకాధికారిగా నియమించి నివారణ చర్యలు చేపట్టాలని ఆదేశించినట్లు కన్నబాబు వివరించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని