లాక్‌డౌన్‌ వేళ .. పాప మందుల కోసం..

తాజా వార్తలు

Updated : 11/04/2020 15:06 IST

లాక్‌డౌన్‌ వేళ .. పాప మందుల కోసం..

సమయం మించిపోతుండగా.. 150 కిమీ బైక్‌రైడ్‌

తిరువనంతపురం: కరోనా వైరస్‌ నేపథ్యంలో ప్రస్తుతం లాక్‌డౌన్‌ కొనసాగుతున్న వేళ మానవత్వం చాటుకునే ఘటన కేరళలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అలెప్పీలో నివసిస్తున్న నాలుగేళ్ల బాలిక క్యాన్సర్‌తో పోరాటం చేస్తోంది. కీమో థెరపీలో భాగంగా ప్రతినెల ఆ బాలికను కుటుంబసభ్యులు అలెప్పీ నుంచి తిరువనంతపురం ప్రాంతీయ క్యాన్సర్‌ ఆస్పత్రికి తీసుకొచ్చేవారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో తిరువనంతపురానికి వచ్చి వెళ్లడం ఇబ్బందని, వైద్యులు ఆ బాలికకు తాత్కాలికంగా మందులు వాడమని సూచించారు. ఈ నేపథ్యంలో ఆ పాపకు మార్చి 29న సాయంత్రం 6 గంటలకల్లా మందులు వేయాల్సి ఉంది. అలెప్పీలో ఆ మందులు దొరకకపోవడంతో కుటుంబ సభ్యులు అక్కడి సివిల్‌ పోలీస్‌ రతీశ్‌ను సంప్రదించారు.

రతీశ్‌ తిరువనంతపురం మెడికల్‌ కాలేజ్‌లో పనిచేస్తున్న తన స్నేహితుడు, మాజీ పోలీస్‌ అధికారి విష్ణుకు పాప పరిస్థితిని వివరించాడు. విష్ణు పాపకు కావాల్సిన మందులు తిరువనంతపురం నుంచి పంపించడానికి సహకరిస్తానని చెప్పి ఆ మందుల చీటీని(ప్రిస్కిప్షన్‌)ను తీసుకెళ్లాడు. తీరా అక్కడికెళ్లాక ఆ చీటీ పాతదని తెలిసి, ఆ పాపకు అవసరమైన మందులు ఇచ్చారు తిరువనంతపురం వైద్యులు. అయితే, అప్పటికే పాపకు మందులు వాడాల్సిన సమయం మించిపోతుండడంతో విష్ణు వెంటనే బైక్‌పై 150 కిమీలకు పైగా ప్రయాణించి సాయంత్రం 5:10 కల్లా వాటిని అందజేశాడు. ఆపద సమయంలో తన మిత్రుడు చాలా రిస్క్‌ తీసుకొని మోటార్‌బైక్‌పై అంతదూరం ప్రయాణించాడని రతీశ్‌ మీడియాకు తెలిపాడు. ఆ మందులు ఇచ్చాక వారి నుంచి విష్ణు ఒక్క రూపాయి కూడా తీసుకోలేదని రతీశ్‌ తెలిపాడు. పాపది నిరుపేద కుటుంబమని, ఆమెకు వైద్యం చేయించే స్థామత కూడా వారికి లేదని చెప్పాడు. దాతలెవరైనా సాయమందించాలని ఆయన కోరాడు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని