కరోనాపై పోరులో డ్రోన్లు

తాజా వార్తలు

Published : 15/04/2020 19:19 IST

కరోనాపై పోరులో డ్రోన్లు

కీలక సమయంలో ఉపయోగపడుతున్న బుల్లి యంత్రాలు

దిల్లీ: కరోనా వైరస్‌పై యావత్‌ దేశం పోరాడుతోంది. బాధితుల ప్రాణాలు కాపాడేందుకు వైద్యులు అహర్నిశలూ శ్రమిస్తుండగా.. ప్రజలంతా భౌతిక దూరం పాటించేలా పోలీసులు విశ్రాంతి లేకుండా విధులు నిర్వర్తిస్తున్నారు. ఇలాంటి కీలక సమయంలో బుల్లి యంత్రాలైన డ్రోన్లు తమ వంతు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ప్రజలను భౌతిక దూరం పాటించడంతో పాటు క్రిమి సంహారక మందుల పిచికారీకి ఉపయోగపడుతున్నాయి.

డ్రోన్లు వినియోగించాలంటే కేంద్ర పౌర విమానయాన సంస్థ అనుమతి తప్పనిసరి. ఈ విధంగా దేశవ్యాప్తంగా సుమారు 20వేల డ్రోన్లు రిజిస్టరయ్యాయని డ్రోన్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా డైరెక్టర్‌ స్మిత్‌ షా పేర్కొన్నారు. కొన్ని స్టార్టప్‌లు ఇలాంటి కీలక సమయంలో ఎలాంటి రుసుమూ తీసుకోకుండానే ప్రభుత్వానికి తమ వంతు సాయపడుతున్నాయని వివరించారు.

ఎలా ఉపయోగపడుతున్నాయి?

కరోనాను నియంత్రించాలంటే మనకున్న ఒకే ఒక్క మార్గం భౌతిక దూరం. ప్రజలు పెద్ద ఎత్తున గుమిగూడకుండా ఉండడం ముఖ్యం. అందుకే ప్రజలు రోడ్లపైకి రాకుండా పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. అయినప్పటికీ కొందరు వారి మాటల్ని పెడచెవిన పెడుతున్నారు. దీంతో ప్రజలపై ఓ కన్నేసి ఉంచేందుకు గుజరాత్‌ పోలీసులు డ్రోన్లను ఆయుధాలుగా మలచుకున్నారు. సుమారు 200 డ్రోన్లతో ప్రజలు గుమిగూడకుండా నిఘా ఉంచారు. దిల్లీ పోలీసులు సైతం ప్రజలు భౌతిక దూరం పాటించే విధంగా డ్రోన్లను ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా అతిపెద్ద ఆజాద్‌పుర్‌ మండిలోని హోల్‌సేల్‌ కూరగాయల, పండ్ల మార్కెట్‌లో పెద్దఎత్తున వ్యాపారులు చేరుకుంటున్నారని తెలిసి అక్కడ డ్రోన్లతో నిఘా ఉంచారు. ఇటీవల వరంగల్‌లో మున్సిపల్‌ అధికారులు ప్రైవేటు కంపెనీతో కలిసి క్రిమి సంహారక ద్రావణాన్ని పిచికారీ చేశారు. అటు మీడియా సంస్థలు సైతం తమ కవరేజీకి డ్రోన్లను వినియోగిస్తున్నాయి. రిమోట్‌ కంట్రోల్‌తో పనిచేసే డ్రోన్లను మీడియా సంస్థలు వినియోగిస్తున్నాయి. వీటి ద్వారా వీడియోలు, ఫొటోలు తీయడం సాధ్యపడుతోంది.

సంఖ్య పెరగాలి..

కరోనాపై పోరులో మనం చేస్తున్న ప్రయత్నాలు సఫలమవ్వాలంటే డ్రోన్ల వినియోగం మరింత పెరగాల్సిన అవసరం ఉందని డ్రోన్లపై ఏర్పాటైన ఫిక్కీ కమిటీలోని సభ్యుడు అంకిత్‌ మెహతా అన్నారు. ముఖ్యంగా మెగాఫోన్లతో కూడిన డ్రోన్లు ఈ సమయంలో ఎంతో అవసరమని పేర్కొన్నారు. అదే చేయకుంటే పోలీసులు చేస్తున్న ప్రయత్నాలన్నీ బూడిదలో పోసిన పన్నీరే అని ఆయన పేర్కొన్నారు. దీంతో పాటు పెద్ద ఎత్తున వీటిని తయారు చేయాలని సూచించారు. తక్షణం ఆదేశిస్తే వీటిని అందివ్వడానికి కనీసం రెండు నుంచి మూడు వారాల సమయం పడుతుందని చెప్పారు. 24×7 నిఘాకు ఇవి ఉపయోగపడతాయని మెహతా పేర్కొన్నారు. ప్రస్తుతం పౌర విమానయాన సంస్థ వద్ద నమోదైన 20వేల డ్రోన్లను సేవలకు వినియోగించుకుంటే ఉత్తమమని డీఎఫ్‌ఐ డైరెక్టర్‌ షా అభిప్రాయపడ్డారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని