ఏపీలో కరోనా సామాజిక వ్యాప్తి లేదు:ఆళ్ల నాని

తాజా వార్తలు

Updated : 22/04/2020 18:15 IST

ఏపీలో కరోనా సామాజిక వ్యాప్తి లేదు:ఆళ్ల నాని

గుంటూరు: కరోనా వ్యాప్తి విషయంలో మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో పరిస్థితి అదుపులోనే ఉందని రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని చెప్పారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 813 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని.. 24 మంది మృతిచెందారన్నారు. ప్రస్తుతం 669 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారని, 120 మందిని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్‌ చేశామని మంత్రి వివరించారు. గుంటూరు కలెక్టరేట్‌లో మరో ఇద్దరు మంత్రులు సుచరిత, మోపిదేవితో కలిసి జిల్లాలోని పరిస్థితులపై ఆళ్ల నాని సమీక్ష నిర్వహించారు. అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 

రాష్ట్రంలో కరోనా సామాజిక వ్యాప్తి దశకు చేరలేదన్నారు. కరోనా ఎలా సోకిందో తెలియని కేసులు రాష్ట్రంలో 52 ఉన్నాయని.. వాటి మూలాలు కనిపెట్టేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. ఐసోలేషన్‌, క్వారంటైన్‌ కేంద్రాల్లో అన్ని సదుపాయాలూ కల్పిస్తున్నామన్నారు. అత్యధిక కేసులు నమోదైన గుంటూరు జిల్లాపై ప్రత్యేక దృష్టి సారించామని చెప్పారు. పాజిటివ్‌ కేసులు నమోదైన ప్రాంతాల్లో వైద్యాధికారితో కూడిన బృందంతో సర్వే నిర్వహిస్తున్నామని.. ఆయా చోట్ల ప్రత్యేకాధికారుల సంఖ్యను కూడా పెంచాలని నిర్ణయించామన్నారు.

ర్యాపిడ్‌ కిట్ల వినియోగాన్ని తాత్కాలికంగా నిలిపివేయాలని ఐసీఎంఆర్‌ ఆదేశించినందున ప్రత్యేక యంత్రాలు తెప్పించినట్లు మంత్రి చెప్పారు. ఈ ప్రత్యేక యంత్రాల సాయంతో గంటకు సుమారు వంద పరీక్షలు చేయొచ్చన్నారు. గుంటూరులో పదేసి కేసులున్న కుటుంబాలు కూడా ఐదు వరకు ఉన్నాయని చెప్పారు. గుంటూరు మొత్తం కాకుండా నగరంలోని కొన్ని ప్రాంతాల్లోనే అధికంగా కేసులు నమోదవుతున్నాయన్నారు.

రెడ్‌ జోన్లలో ఫీవర్‌ ఆస్పత్రులను కూడా ఏర్పాటు చేయనున్నామని.. 2, 3 రోజుల్లో ఈ ఆస్పత్రులు ప్రారంభం కానున్నాయని చెప్పారు. రాష్ట్రంలో వైద్య పరికరాల కొరతను అధిగమించామని, వెంటిలేటర్ల కొరతను కూడా అధిగమిస్తామని చెప్పారు. హైడ్రాక్సీ క్లోరోక్విన్‌, అజిత్రో మైసిన్‌ వంటి మందులకు కొరత లేదని మంత్రి నాని వివరించారు.

ఇదీ చదవండి..

ఏపీలో 813కు చేరిన కరోనా కేసులు

 Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని