వాటినే తుది ఫలితాలుగా పరిగణిస్తాం: ఆళ్ల నాని

తాజా వార్తలు

Published : 29/04/2020 20:46 IST

వాటినే తుది ఫలితాలుగా పరిగణిస్తాం: ఆళ్ల నాని

అమరావతి: కరోనా నిర్ధారణ పరీక్షల సామర్థ్యం పెంచాలని సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి ఆదేశించారని మంత్రి ఆళ్ల నాని తెలిపారు. కరోనా సహాయక చర్యలపై ఏర్పాటైన మంత్రుల బృందం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో భేటీ అయింది. కరోనా వ్యాప్తి నివారణ చర్యలపై బృందం సమావేశంలో ప్రధానంగా చర్చించింది. అనంతరం ఆళ్ల నాని మీడియాతో మాట్లాడారు. ఇప్పటి వరకు 87,086 మంది అనుమానితుల నుంచి నమూనాలను సేకరించినట్లు ఆళ్ల నాని తెలిపారు. ఆర్టీపీసీఆర్‌ ద్వారా వచ్చే ఫలితాలే తుదిగా పరిగణిస్తామన్నారు. క్వారంటైన్‌ కేంద్రాల్లో సౌకర్యాలు పెంచాలని, అన్ని జిల్లాల్లో కొవిడ్‌ ఆస్పత్రులు పెంచాలని సీఎం సూచించినట్లు చెప్పారు. టెలీ మెడిసిన్‌ సదుపాయంపై మరింత ప్రచారం చేయాలని ఆదేశించినట్లు ఆళ్ల నాని వివరించారు.

ఇబ్బందులను అధిగమించాం

రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన కరోనా కేసుల్లో కర్నూలు, గుంటూరు, కృష్ణ జిల్లాల్లోనే అత్యధిక కేసులు నమోదయ్యాయని ఆళ్ల నాని తెలిపారు. ఈ మూడు జిల్లాల్లో కేసుల సంఖ్యను తగ్గించేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించనున్నట్లు చెప్పారు. దీనికి గాను త్వరలోనే స్పష్టమైన ఆదేశాలు జారీ చేస్తామని వెల్లడించారు. రాష్ట్రంలో కరోనా కట్టడికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని మంత్రి స్పష్టం చేశారు. వైరస్‌ వ్యాప్తి చెందిన మొదట్లో ఎదుర్కొన్న ఇబ్బందులను అధిగమించామని, ఆస్పత్రుల సంఖ్యను పెంచి సదుపాయాలు కల్పించామన్నారు. ప్రజల సహకారం లేకుండా ఈ వైరస్‌ మహమ్మారిని అరికట్టడం అసాధ్యమని మంత్రి అభిప్రాయపడ్డారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో ఓపీ సేవలు అందుబాటులో ఉండడం లేదని ఫిర్యాదులు వస్తున్నాయని మంత్రి తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించి ఓపీ సేవలను నిలిపివేసే ప్రైవేటు ఆస్పత్రులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు.

గ్రీన్‌జోన్‌ నుంచి గ్రీన్‌జోన్‌కు వెళ్లేందుకు వెసులుబాటు

ఇతర రాష్ట్రాల్లో ఉన్న ఏపీకి చెందినవారిని తీసుకొచ్చేలా చర్యలు ప్రారంభించాలని సీఎం జగన్‌ ఆదేశించినట్లు చెప్పారు. దీనికిగానూ ఆయా ప్రభుత్వాలతో మాట్లాడి త్వరలోనే కార్యాచరణ రూపొందిస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా ఇప్పటికే స్పష్టమైన మార్గదర్శకాలు జారీ అయ్యాయని తెలిపారు. గుజరాత్‌ నుంచి ఉత్తరాంధ్ర మత్స్యకారులు ఏపీకి బయలుదేరారని, వలస కార్మికులు గ్రీన్‌జోన్‌ నుంచి గ్రీన్‌ జోన్‌కు వెళ్లే అంశంలో వెసులుబాటు కల్పించినట్లు మంత్రి తెలిపారు. అనుకోకుండా వచ్చిన ఈ విపత్తును ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. లాక్‌డౌన్‌ తర్వాత కూడా ప్రజలు భౌతికదూరం పాటించాల్సిందేనని మంత్రి ఆళ్ల నాని సూచించారు.

లేఖలతో గందరగోళం సృష్టిస్తున్నారు

చంద్రబాబు లేనిపోని లేఖలు రాసి గందరగోళం సృష్టిస్తున్నారని మంత్రి కన్నబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు భరోసా విషయంలో 4 లక్షల మందిని తొలగించినట్లు ఆయన ఆరోపిస్తున్నారని.. రెండో విడతకు సంబంధించి అసలు జాబితానే ఖరారు చేయలేదని చెప్పారు. గ్రామ సచివాలయాల్లో ఈ జాబితాలు ప్రదర్శిస్తున్నట్లు తెలిపారు. మరోవైపు కరోనాపై మెరుగైన వైద్యం, క్వారంటైన్‌ కేంద్రాల్లో సదుపాయాలు కల్పిస్తుంటే తెదేపాకు కనిపించడం లేదా? అని కన్నబాబు ప్రశ్నించారు. దేశంలోనే అత్యధిక కరోనా నిర్ధారణ పరీక్షలు చేస్తుంది ఒక ఏపీనే అని రాష్ట్ర హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకే మే 3 తర్వాత లాక్‌డౌన్ సడలింపులు ఉంటాయని సుచరిత వివరించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని