ఐస్‌క్రీమ్‌ తింటే కరోనా వస్తుందా?

తాజా వార్తలు

Published : 30/04/2020 13:57 IST

ఐస్‌క్రీమ్‌ తింటే కరోనా వస్తుందా?

కొవిడ్‌-19 అపోహలపై వివరణ ఇదిగో...

దిల్లీ: భారత్‌లో కరోనా కేసుల సంఖ్య 33,050కి చేరుకుంది. అగ్రరాజ్యం అమెరికాతో సహా పలు దేశాలలో కరోనా వైరస్‌ విజృంభిస్తోంది. ఆయా దేశాల్లో కొవిడ్‌-19 బాధితుల సంఖ్య మిలియన్లలో, మృతుల సంఖ్య వేలల్లోనూ ఉంది. వాటితో పోలిస్తే భారత గణాంకాలు ఊరట కలిగిస్తున్నప్పటికీ... దేశంలో ఈ మహమ్మారి గురించి పలు అపోహలు ప్రచారంలోకి వస్తున్నాయి. కొన్ని సందర్భాల్లో వీటిని పాటించటం ప్రమాదకరంగా మారే అవకాశం కూడా ఉంది. ఈ విధమైన అపోహల్లో ఐస్‌క్రీమ్‌, ఇతర చల్లని పదార్థాలు తినటం వల్ల కరోనా వైరస్‌ సోకుతుందనే భావన ఒకటి. చల్లని పదార్థాలను తినటం లేదా తాగటం వల్ల కొవిడ్‌ సోకుతుంది అనేందుకు ఏ ఆధారము లేదని ప్రభుత్వ సంస్థ ప్రెస్‌ ఇన్ఫర్మేషన్‌ బ్యూరో (పీఐబీ) ప్రకటించింది. కరోనా వైరస్‌ వ్యాధి గురించి ప్రచారంలో ఉన్న అనేక అసత్యాలలో ఇది కూడా ఒకటి అని సంస్థ తెలిపింది. ప్రమాదకరమైన కరోనా వ్యాధికి సంబంధించిన పుకార్లలోని నిజానిజాలను ప్రపంచ ఆరోగ్య సంస్థ వెబ్‌సైట్‌ ద్వారా నిర్ధారించుకోవచ్చని పీఐబీ వెల్లడించింది.

వెల్లుల్లిని ఆహారంలో తీసుకున్నా, సూప్‌లో మిరియాల పొడిని కలుపుకొన్నా కరోనా తగ్గిపోతుందనే భావన కూడా నిజం కాదని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్‌ఓ) వివరించింది. ఆ రెండు పదార్థాలూ ఆరోగ్యానికి మంచివని, అయితే వాటివల్ల కరోనా నివారించవచ్చు అనేందుకు ఏ ఆధారాలు లేవని ఈ సంస్థ స్పష్టం చేసింది. అంతేకాకుండా క్రిమి సంహారక ద్రవాన్ని శరీరంపై జల్లుకోవటం, వేడినీటితో స్నానం చేయటం, శరీర ఉష్ణోగ్రత అధికమయ్యేలా చేసుకోవటం, సూర్యరశ్మి సోకేవిధంగా బయట నిలబడటం వల్ల కరోనా నశిస్తుందనటం సరికాదని డబ్ల్యుహెచ్‌ఓ తెలిపింది. ఇక ఈగలు, దోమల వల్ల కొవిడ్‌-19 వ్యాప్తిస్తుందనేది కూడా నిజం కాదని సంస్థ వెల్లడించింది. పుకార్లను నమ్మటం మాని... సామాజిక దూరాన్ని పాటించటం, వీలయినంత వరకూ ఇంటికే పరిమితం కావటం, ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవటం వంటి చర్యల ద్వారా కరోనా వైరస్‌ను దూరంగా ఉంచవచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ  సూచించింది.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని