చుక్క కొనుగోలు చేసిన వారికి చుక్కేస్తారు!

తాజా వార్తలు

Published : 08/05/2020 16:31 IST

చుక్క కొనుగోలు చేసిన వారికి చుక్కేస్తారు!

హోషంగాబాద్‌: కొవిడ్‌-19 లాక్‌డౌన్‌ కారణంగా ఒకటిన్నర నెలల పాటు మూతబడిన మద్యం దుకాణాలు ఇటీవల మళ్లీ తెరుచుకున్నాయి. మద్యం విక్రయాలు నిర్వహించడానికి కేంద్రం అనుమతించగా.. విక్రయాలకు సంబంధించి హోం శాఖ మార్గదర్శకాలను విడుదల చేసింది. అయితే ఈ దుకాణాల వద్ద రద్దీ ఎక్కువకావటంతో మద్యం కొనుగోలు చేయాలనే ఆత్రంలో తాగుబోతులు సామాజిక దూరం, మాస్కులు ధరించటం లాంటి నిబంధనలకు ‘మందొ’దులుతున్నారు. అంతేకాకుండా కొవిడ్‌-19 వ్యాప్తి భయాలతో విక్రేతలు కూడా దుకాణాలను తెరిచేందుకు అంతగా ఆసక్తి చూపటంలేదని తెలిసింది. ఇందుకు మధ్యప్రదేశ్‌ రాజధాని భోపాల్‌కు 80 కిలోమీటర్ల దూరంలో హోషంగాబాద్‌ జిల్లా ఎక్సైజ్‌ శాఖ అధికారులు ఓ వినూత్న పరిష్కారాన్ని కనుగొన్నారు.

మద్యం కొనుగోలు చేసిన వ్యక్తుల చూపుడు వేలికి చెరగని ఇంకుతో ముద్ర వేస్తున్నామని... భవిష్యత్తులో అవసరమైతే వారిని గుర్తించేందుకు ఈ విధానం పనికొస్తుందని ఎక్సైజ్‌ అధికారి అభిషేక్‌ తివారీ తెలిపారు. అంతేకాకుండా మద్యం దుకాణాల వద్ద రిజిస్టర్లను ఏర్పాటు చేశామని...  కొనుగోలుదార్లందరూ వారి పేరు, మొబైల్‌ నంబర్‌ తదితర వివరాలు ఇవ్వాల్సి ఉంటుందని కూడా ఆయన వివరించారు. ఈ మేరకు దుకాణదారులతో ప్రభుత్వం ఓ ఒప్పందానికి వచ్చినట్టు ఆయన తెలిపారు. తమ పరిధిలోని కంటైన్‌మెంట్‌ జోన్‌ కాని ప్రాంతాల్లో 50 మద్యం దుకాణాలను తెరిచామని.. ఈ నిబంధన వల్ల మద్యం దుకాణాల వద్ద ప్రజలు ఎగబడటం అదుపులోకి వచ్చిందని అధికారులు వివరించారు. ఈ విధానాన్ని దేశమంతా అమలు చేస్తే ఉపయోగకరంగా ఉంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని