‘కొడుకులు వస్తారనుకుంటే.. మరణవార్త విన్నా’

తాజా వార్తలు

Updated : 09/05/2020 19:44 IST

‘కొడుకులు వస్తారనుకుంటే.. మరణవార్త విన్నా’

కొడుకుల్ని పోగొట్టుకున్న తండ్రి కన్నీటి పర్యంతం

షహడోల్‌ (మధ్యప్రదేశ్‌): ‘‘నాన్నా.. నేనూ తమ్ముడూ వచ్చేస్తున్నాం. ఇప్పుడే చేతికి బ్యాగులు తగిలించుకున్నాం. ఇదిగో నడుస్తున్నాం. రేపే ప్రభుత్వం వేసిన ప్రత్యేక రైల్లో ఇంటికొచ్చేస్తాం’’ అంటూ తండ్రికి పెద్ద కుమారుడి ఫోన్‌. ఉపాధి పోతే పోయింది.. కొడుకులు ఇంటికొచ్చేస్తున్నారు.. అదే చాలనుకున్నాడు ఆ తండ్రి. కానీ కొద్ది గంటల్లో ఓ దుర్వార్త. ఇంటికొస్తారన్న కొడుకులు ఇక రారని! అసలే వారు ఈ లోకంలోనే లేరని!! దీంతో ఇద్దరు కొడుకుల్ని పోగొట్టుకున్న ఆ తండ్రి గుండెలవిసేలా రోదించాడు. ఇదీ ఔరంగాబాద్‌ రైలు దుర్ఘటనలో కొడుకుల్ని కోల్పోయిన గిరిరాజ్‌ సింగ్‌ కథ.

మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో శుక్రవారం ఉదయం గూడ్సు రైలు చక్రాల కింద నలిగి 16 మంది చనిపోయిన సంగతి తెలిసిందే. ఓ నలుగురు మాత్రం ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ఘటనలో షహడోల్‌ జిల్లా అంటోలి గ్రామానికి చెందిన గిరిరాజ్‌ సింగ్‌ తన ఇద్దరు కొడుకుల్ని కోల్పోయాడు. తమ్ముడు శివదయాల్‌ (25)తో కలిసి రైలు ఎక్కుతున్నానంటూ పెద్ద కొడుకు బ్రజేశ్‌ సింగ్‌ (28) ఫోన్‌ చేసి చెప్పాడని కొడుకు చివరి మాటల్ని గుర్తుచేసుకుంటూ కన్నీటి పర్యంతమయ్యాడు. ‘‘ప్రమాదానికి ఒక్కరోజు ముందే నా కుమారులు ఫోన్‌చేశారు. రైలు ఎక్కేందుకు నడక ప్రారంభించామని చెప్పారు. శుక్రవారం రైలు ఎక్కేస్తామన్నారు. షహడోల్‌ చేరుకుంటామన్నారు. కానీ నా కొడుకులు వస్తారనుకుంటే వారి మరణవార్త వినాల్సి వచ్చింది’’ అంటూ కంటతడి పెట్టాడు.

తనకు అండగా నిలుస్తారని అనుకున్న కుమారులు తనను విడిచి వెళ్లిపోయారంటూ తన ఇద్దరు కుమారులను కోల్పోయిన మరో తండ్రి ఆవేదన వ్యక్తంచేశాడు. రైలు ప్రమాద ఘటనలో ప్రాణాలు కోల్పోయిన నిర్వేశ్‌ సింగ్‌ (20), రవీంద్ర సింగ్‌ (18) తండ్రి రామ్‌ నిరంజన్‌ తండ్రి ఈయన. ఇప్పుడు తాను ఎలా బతికేది అని బాధను వెలిబుచ్చాడు.

మహారాష్ట్ర నుంచి మధ్యప్రదేశ్‌కు తిరిగి వెళుతున్న 16 మంది వలస కార్మికులు ఔరంగాబాద్‌ జిల్లాలో దుర్మరణం పాలయ్యారు. మహారాష్ట్రలోని జల్నాకు వలస వచ్చి, ఒక ఉక్కు కర్మాగారంలో పనిచేస్తున్న  వీరంతా తమ స్వరాష్ట్రం మధ్యప్రదేశ్‌కు బయల్దేరారు. తమ సొంతూళ్లకు వెళ్లిపోవాలని ఈ 20 మంది నిర్ణయించుకున్నారు. గురువారం రాత్రి పోలీసుల కంట పడకుండా ఉండేందుకు రైలు పట్టాల వెంబడి నడుచుకుంటూ వెళ్లాలని నిర్ణయించుకున్న వీరంతా రైలు కింద పడి మరణించారు. మరోవైపు మృతదేహాలు శనివారం ఆయా గ్రామాలకు చేరుకున్నాయి.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని