రాత్రిపూట నదీమార్గంలో వలసజీవులు!

తాజా వార్తలు

Published : 23/05/2020 11:48 IST

రాత్రిపూట నదీమార్గంలో వలసజీవులు!

దిల్లీ: లాక్‌డౌన్‌ నేపథ్యంలో సొంతూళ్లకు వెళ్లేందుకు వలస కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పగటిపూట ఎండను భరించలేక, ఇతర కారణాల వల్ల వలస కార్మికులు రాత్రి సమయంలో నదులను దాటుతూ ప్రమాదకరంగా ప్రయాణిస్తున్నారు. హరియాణా నుంచి బిహార్‌లోని తమ సొంత గ్రామాలకు కాలినడకన వెళ్లేందుకు... సుమారు రెండువేల మందికి పైగా యమునా నదిని దాటినట్లు సమాచారం. వీరు మొదట ఉత్తర్‌ ప్రదేశ్‌లోని షహరన్‌పూర్‌కు, అక్కడినుంచి బిహార్‌ వెళ్లేందుకు కాలిమార్గంలో ప్రయాణమయ్యారు. మార్గమధ్యంలో యమునా నదిని దాటి సొంతూళ్లకు వెళ్తున్నారు.

ఇలాంటి వారికోసం ప్రభుత్వం ప్రత్యేక శ్రామిక్‌ రైళ్లను నడుపుతున్నప్పటికీ అందులో ప్రయాణించే అవకాశం లభించని వందలాది మంది కాలినడకనే బయలుదేరుతున్నారు. ఎండాకాలం కారణంగా నదిలో నీరు తక్కువగా ఉండటంతో తాము నదిని దాటి వెళ్తున్నామని వలస కార్మికులు చెబుతున్నారు. ‘‘మా వద్ద డబ్బు లేదు. రోడ్డుపై వెళ్తుంటే మమల్ని పోలీసులు అడ్డుకుని కొడుతున్నారు. అందుకే మేము రాత్రి పూట నదిని దాటుతున్నాం. బిహార్‌ వరకు మేము నడిచే వెళ్తాం’’ అని యమునానగర్‌లోని ఓ ప్లైవుడ్‌ కర్మాగారంలో పనిచేస్తున్న కార్మికుడు చెప్పారు.  

కరోనా వైరస్‌ లాక్‌డౌన్‌ కారణంగా తమను యజమానులు పనుల నుంచి తొలగించారని... ఉన్న డబ్బు కాస్త అయిపోవటంతో తాము యమునానగర్‌లోని ఆశ్రయ కేంద్రంలో ఉన్నామని.. అయితే తమకు ఆహారం లభించటం లేదని వలస కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో తాము సొంతూళ్లకు కాలినడకన వెళ్తున్నామని చెబుతున్నారు.  తమలో ఎక్కువ మంది అర్ధాకలితోనే నడక సాగిస్తున్నారని వారు వాపోయారు. సమీప గ్రామాల ప్రజలు కొందరు దయతలచి ఆహారం, నీరు ఇస్తున్నారని తెలిపారు. మరోవైపు వలస కార్మికులందరినీ వారి గ్రామాలకు చేర్చేందుకు రవాణా సౌకర్యాలు కల్పిస్తామని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పోలీసులు హామీ ఇస్తున్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని