మిడతలను తరిమేందుకు.. వినూత్న ఆలోచన

తాజా వార్తలు

Published : 03/06/2020 01:55 IST

మిడతలను తరిమేందుకు.. వినూత్న ఆలోచన

ఇంటర్నెట్‌డెస్క్‌: ఒకపక్క దేశం మొత్తం కరోనాతో పోరాడుతుంటే పశ్చిమ భారతంలోని రాష్ట్రాలు ఎడారి మిడతలతోనూ పోరాటం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. గత 27ఏళ్లలో ఎప్పుడూలేని పరిస్థితిని భారత్‌ ఎదుర్కొంటోంది. భారీ స్థాయిలో ఎడారి మిడతల దండు పశ్చిమ భారతాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. మిడతల దండును అంతం చేయడానికి ప్రభుత్వం అన్ని రకాలుగా ప్రయత్నాలు మొదలు పెట్టింది. వేల ఎకరాల్లో పంట నాశనం కాకుండా, మిడతలను మట్టుపెట్టడానికి అత్యాధునిక స్ర్పేయర్లు, డ్రోన్‌లను సిద్ధం చేస్తోంది. ఈ నేపథ్యంలో ప్రజలు కూడా వినూత్నంగా ఆలోచించడం మొదలు పెట్టారు. పెద్ద పెద్ద శబ్దాలకు మిడతలు పారిపోతాయని వ్యవసాయశాఖ అధికారులు చెప్పడంతో పొలాల్లో టపాసులు పేలుస్తూ, డీజేలు ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి. 

తాజాగా మిడతలను తరిమికొట్టేందుకు ఓ వ్యక్తి వినూత్నంగా ఆలోచించాడు. గాలి వీచినప్పుడల్లా శబ్దం చేసేలా ఓ పరికరాన్ని తయారు చేశాడు. పొడవాటి కర్రకు ఇనుప చువ్వ గుచ్చి దానికి ఒక ఖాళీ కూల్‌ డ్రింక్‌ బాటిల్‌ అమర్చాడు. ఆ బాటిల్‌కు ముందువైపు ఫ్యాన్‌ రెక్కలు, వెనుక వైపు ఇనుప డబ్బాను ఉంచాడు. ఈ రెండింటిని ఒక ఇనుప చువ్వ ద్వారా కలిపాడు. డబ్బా ఉన్న వైపు పైభాగాన డ్రమ్‌ స్టిక్స్‌లాంటివి అమర్చాడు. దాన్ని తీసుకెళ్లి పోలంలో నిలబెట్టడంతో గాలి వీచినప్పుడల్లా ఫ్యాన్‌ రెక్కలు వాటికున్న చువ్వతో పాటు తిరిగి డ్రమ్‌ స్టిక్స్‌లాంటివి డబ్బాపై శబ్దం చేయడం అందరినీ ఆకట్టుకుంటోంది. దీని వల్ల ఎప్పుడూ పొలంలో ఉండాల్సిన అవసరం లేదు. గాలి గమనాన్ని బట్టి వచ్చే మిడతలు ఈ శబ్దానికి భయపడి పారిపోతాయని అక్కడి రైతులు భావిస్తున్నారు. ఈ వీడియోను ఐఎఫ్‌ఎస్‌ అధికారి ప్రవీణ్‌ కస్వాన్‌ తన ట్విటర్‌లో పంచుకున్నారు. ‘ఆధునిక సమస్యకు ఆధునిక పరిష్కారం. మిడతలను ఎదుర్కొనడానికి స్థానిక ఆవిష్కరణలు ఉత్తమమైనవి. అద్భుతమైన ఆలోచన’అని ట్వీట్ చేశారు. ఈ వీడియోకు నెటిజన్ల నుంచి ప్రశంసలు వస్తున్నాయి. ఈ పరికరాన్ని తయారు చేసిన వ్యక్తిని అందరూ మెచ్చుకుంటున్నారు.


 
Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని