యాదాద్రి, భద్రాద్రిలో దర్శనాలకు అనుమతి

తాజా వార్తలు

Published : 08/06/2020 01:31 IST

యాదాద్రి, భద్రాద్రిలో దర్శనాలకు అనుమతి

హైదరాబాద్‌: దాదాపు రెండు నెలలకుపైగా అమల్లో ఉన్న లాక్‌డౌన్‌ తర్వాత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలు సడలింపులు ఇచ్చిన నేపథ్యంలో రాష్ట్రంలోని ఆలయాలు తెరుచుకోనున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలోని ప్రధాన ఆలయాల వద్ద ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా భక్తులు దర్శించుకుకేందుకు కావాల్సిన ఏర్పాట్లను అధికారులు చేస్తున్నారు. తెలంగాణలో ప్రధాన ఆలయాలైన భద్రాద్రి సీతారామచంద్ర స్వామి ఆలయం, యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి ఆలయాల్లో రేపటి నుంచి దర్శనాలు ప్రారంభమవుతాయని ఆలయాల ఈవోలు వెల్లడించారు. కరోనా వ్యాప్తి కట్టడిలో భాగంగా ఆలయాల్లో తీర్థాలు, శఠగోపాలు ఉండవని వారు స్పష్టం చేశారు. తప్పకుండా మాస్కులు ధరించాలని.. భౌతిక దూరం పాటించాలని భక్తులకు సూచించారు. ప్రస్తుతానికి ఆలయాల వద్ద ఎలాంటి వసతి సదుపాయం కల్పించడం లేదని అధికారులు వెల్లడించారు.

భక్తులకు థర్మల్‌ స్క్రీనింగ్‌..
‘‘ఉదయం 6.30 గంటల నుంచి 11.30 గంటల వరకు భక్తులను రాములోరి దర్శనానికి అనుమతిస్తాం. తిరిగి మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6.30 గంటల వరకు దర్శించుకునేందుకు అనుమతిస్తాం. ఆలయాలకు వచ్చే భక్తులకు థర్మల్‌ స్క్రీనింగ్‌ చేస్తాం. ఎంత మంది భక్తులు వచ్చినా అందరికీ దర్శనం చేయిస్తాం. ప్రసాదాలు నేరుగా ప్యాకెట్ల రూపంలో భక్తులకు అందిస్తాం’’ అని భద్రాద్రి ఆలయ ఈవో నర్సింహులు తెలిపారు.

ఆధార్‌ తప్పనిసరి

‘‘దర్శనాల్లో భాగంగా తొలిరోజు ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులు, స్థానికులు దర్శించుకునేలా ఏర్పాట్లు చేశాం. ప్రతి రోజు ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు బ్రేక్‌ దర్శనాలుంటాయి. దర్శనానికి వచ్చే స్థానికులు తప్పనిసరిగా వారి ఆధార్‌ తీసుకురావాలి. ఎల్లుండి నుంచి భక్తులందరికీ స్వామి వారి దర్శనానికి అనుమతిస్తాం. ఉచిత, లఘు దర్శనాలకు అనుమతిస్తాం. ఆన్‌లైన్‌లో టికెట్లు బుక్‌ చేసుకున్న భక్తులకు గోత్రనామాలతో పూజలు చేయిస్తాం. తలనీలాల కల్యాణకట్టను తాత్కాలికంగా మూసివేశాం. కౌంటర్ల ద్వారా ప్రసాదాలు విక్రయిస్తాం. కొండపైకి పరిమిత సంఖ్యలో వాహనాలకు అనుమతిస్తాం. ఆర్టీసీ బస్సులు, ఆటోలు, ద్విచక్ర వాహనాలకు అనుమతి ఉంటుంది. నిబంధనల ప్రకారం ఆటోలో ఇద్దరు మాత్రమే ప్రయాణించాలి. కొండపైకి నాలుగు చక్రాల వాహనాలకు అనుమతి లేదు’’ అని యాదాద్రి ఆలయ ఈవో గీత వివరించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని