అచ్చెన్నాయుడుకి 14 రోజుల రిమాండ్‌

తాజా వార్తలు

Updated : 13/06/2020 10:53 IST

అచ్చెన్నాయుడుకి 14 రోజుల రిమాండ్‌

విజయవాడ:ఈఎస్ఐ మందుల కొనుగోళ్ల కేసులో అరెస్టయిన టీడీఎల్పీ ఉపనేత అచ్చెన్నాయుడికి విజయవాడ అనిశా కోర్టు న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్‌ విధించారు. అనారోగ్యం దృష్ట్యా ఆయనకు ఆస్పత్రిలో చికిత్స అందించాలని ఆదేశించారు. ఈ మేరకు వివరాలను న్యాయవాది వెంకటేశ్వర్లు వెల్లడించారు.‘‘ అచ్చెన్నాయుడు శస్త్రచికిత్స చేసుకున్న విషయం న్యాయమూర్తికి తెలిపాం. ఆస్పత్రిలో ఉంచాలని వైద్యులు సూచించారని ఆయన దృష్టికి తీసుకెళ్లాం. గుంటూరు ఆస్పత్రిలో చికిత్స చేయాలని న్యాయమూర్తి ఆదేశించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి, అందించే వైద్యం గురించి కోర్టుకు నివేదిక ఇవ్వాలని జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ను ఆదేశించారు. ఇదే కేసులో ఏ1 నిందితుడిగా ఉన్న రమేశ్‌కుమార్‌ను రాజమండ్రి సబ్‌జైలుకు తరలించారు.’’ అని మీడియాతో చెప్పారు.

గుంటూరు జీజీహెచ్‌కు తరలింపు

తొలుత అనిశా అధికారులు తెల్లవారుజామున 3.30 గంటలకు అచ్చెన్నాయుడిని విజయవాడ సబ్‌ జైలుకు తీసుకువచ్చారు. సుమారు గంటపాటు సబ్‌జైలు బయట ఎస్కార్ట్ ‌వాహనంలోనే అచ్చెన్నాయుడు నిరీక్షించారు. అనంతరం సబ్‌జైలుకు తరలించారు. ఆ తర్వాత ఆయన్ను సబ్‌జైలు నుంచి గుంటూరు జీజీహెచ్‌కు తరలించినట్లు అధికారులు తెలిపారు. 

అచ్చెన్నాయుడిని అవినీతి నిరోధక శాఖ అధికారులు అరెస్టు చేయడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. శుక్రవారం ఉదయం శ్రీకాకుళం జిల్లాలోని ఆయన స్వగ్రామమైన నిమ్మాడ మొత్తాన్ని భారీ సంఖ్యలో భద్రతబలగాలు చుట్టుముట్టాయి.  ఇంటి ప్రహరీ, ప్రధాన గేటు దూకి మరీ ఏసీబీ సిబ్బంది లోపలికి ప్రవేశించారు. అలా 7.10 గంటలకు అచ్చెన్నాయుడు ఇంట్లోకి వెళ్లిన ఏసీబీ బృందాలు.. 7.20 గంటలకల్లా ఆయన్ను అరెస్టు చేయడం.. పది నిమిషాల్లోనే ఊరు దాటించడం చకచకా జరిగిపోయాయి. అత్యంత నాటకీయంగా ఆరంభమైన ఈ అరెస్టు వ్యవహారం శుక్రవారం అర్ధరాత్రి వరకూ ఉత్కంఠభరితంగా కొనసాగింది. ఈఎస్‌ఐ ఆసుపత్రుల్లో మందుల కొనుగోళ్లలో అవకతవకలకు సంబంధించిన కేసులో అప్పటి కార్మికశాఖ మంత్రి అయిన అచ్చెన్నాయుణ్ని అరెస్టు చేసినట్లు అనిశా అధికారులు ప్రకటించారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని