మెప్పిస్తారా ఇస్రోను? 

తాజా వార్తలు

Published : 19/06/2020 01:21 IST

మెప్పిస్తారా ఇస్రోను? 

పాఠశాల, కళాశాల విద్యార్థులకు ఆన్‌లైన్‌ పోటీలు

కొవిడ్‌ కారణంగా స్కూల్‌, కాలేజ్‌ అన్నీ బంద్‌. ఇంట్లోనే ఉండి బోర్‌ కొట్టేస్తోంది కదా? మీలాంటి వారికోసమే ఇస్రో ఒక పోటీ నిర్వహిస్తోంది. ‘సైబర్‌ స్పేస్‌ కాంపిటిషన్స్‌-2020’ పేరిట వీటిని నిర్వహిస్తోంది. ఆసక్తి ఉన్నవారు పాల్గొనవచ్చు. పైగా ఆన్‌లైన్‌లో పాల్గొనే అవకాశం. అయితే ఈ పోటీ.. పాఠశాల, కళాశాలలో ఇంటర్‌ స్థాయి విద్యార్థులకు మాత్రమే!

పెద్దవారితోపాటు పిల్లలనూ ఇంటికే పరిమితం చేసింది కరోనా ఉపద్రవం. ఒకరినొకరు కలిసే అవకాశమే ఉండడం లేదు. ఈ సమయంలో పిల్లల మెదళ్లకు పదునుపెట్టేలా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) సైబర్‌ కాంపిటిషన్స్‌-2020 (ఐసీసీ-2020)ని నిర్వహించబోతోంది. అంతరిక్షం, దాని సాంకేతికతలపై పాఠశాల విద్యార్థులకు పరిజ్ఞానం కల్పించడమే దీని ఉద్దేశం.

ఐసీసీ- 2020ను ఆన్‌లైన్‌లో నిర్వహించనున్నారు. విద్యార్థుల్లో సృజనాత్మకత, ఊహాశక్తి, కొత్తవాటిని రూపొందించాలనే కోరిక లాంటివి వెలికి తీయడమే ఈ పోటీ లక్ష్యం. ఒకటో తరగతి నుంచి ఇంటర్‌ స్థాయి వరకు విద్యార్థులు దీనిలో పాల్గొనవచ్చు. ప్రస్తుత విద్యా సంవత్సరానికి సంబంధించి ఐడీ కార్డును సమర్పించాల్సి ఉంటుంది. గత విద్యాసంవత్సరం పరీక్షలు రాయనివారిని 2020-21లో చదవబోయే తరగతి విద్యార్థిగానే పరిగణిస్తారు.

అవార్డులు: పాల్గొన్న వారందరికీ పార్టిసిపేషన్‌ సర్టిఫికెట్లు అందజేస్తారు. మొదటి ఉత్తమ 500 మంది విద్యార్థుల పేర్లను వెబ్‌సైట్‌లో ప్రచురిస్తారు.

దరఖాస్తు: ఇస్రో అధికారిక వెబ్‌సైట్‌ (www.isro.gov.in/icc-2020)  లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు ఫీజేమీ లేదు. పేరు, ఈ-మెయిల్‌ వివరాలతో రిజిస్టర్‌ చేసుకోవాల్సి ఉంటుంది. తరువాత లాగిన్‌ అయ్యి పూర్తి వివరాలతో నింపాల్సి ఉంటుంది. అప్పుడు రిజిస్ట్రేషన్‌ నంబరు లభిస్తుంది. దాని ఆధారంగా పోటీలో పాల్గొనే వీలుంటుంది.

ఎన్ని రకాలు? 

మొత్తం నాలుగు రకాల పోటీలను నిర్వహిస్తున్నారు. దేనికదే ప్రత్యేకం. అన్నీ వ్యక్తిగత పోటీలే. భారతీయ విద్యార్థులెవరైనా దీనికి దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకున్నవారికి ఐడీ నంబరును ఇస్తారు. దరఖాస్తు చేసుకున్న మెయిల్‌కు పోటీ అంశానికి సంబంధించిన వివరాలను మెయిల్‌ చేస్తారు. దాన్ని విద్యార్థులు పూర్తిచేసి, వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది. సిలబస్‌ వివరాలను వెబ్‌సైట్‌లో ప్రచురిస్తారు.

1. డ్రాయింగ్‌: ఒకటి నుంచి మూడు తరగతులవారు అర్హులు

ఎ3 సైజ్‌ వైట్‌ పేపర్‌ లేదా చార్ట్‌ పేపర్‌ మీద వాటర్‌/ వాక్స్‌/ కలర్‌ పెన్సిల్‌తో ఇచ్చిన అంశానికి సంబంధించి బొమ్మ గీయాలి. దాని ఫొటో/ స్కాన్‌ చేసి వెబ్‌సైట్‌లో పోస్ట్‌ చేయాల్సి ఉంటుంది.

2. మోడల్‌ మేకింగ్‌/ సైన్స్‌ క్రాఫ్ట్‌: 4 నుంచి 8 తరగతులవారు అర్హులు

కార్డ్‌బోర్డ్‌, పేపర్లు, వస్త్రాలు, టేప్‌, కలర్స్‌, గమ్స్‌ను మాత్రమే ఉపయోగించి మోడల్‌ రూపొందించాలి. పూర్తి చేశాక దాన్ని ఫొటోలు తీసి వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేయాలి.

3. ఎస్సే రైటింగ్‌: 9, 10 తరగతుల వారికి 

4. ఎస్సే రైటింగ్‌ / స్పేస్‌ క్విజ్‌ కాంటెస్ట్‌: 11, 12 తరగతుల వారికి..
హిందీ, ఇంగ్లిష్‌ మాధ్యమాల్లో నచ్చిన భాషలో రాయొచ్చు. ఇచ్చిన అంశాన్ని 1000 పదాలు మించకుండా ఎ 4 పేపర్‌ మీద రాయాలి. ఇంటర్నెట్‌ నుంచి కాపీ చేసినట్లు కనిపిస్తే తిరస్కరణకు గురవుతుంది. రాసిన ఎస్సేను ఫొటో/ పీడీఎఫ్‌ రూపంలో వెబ్‌సైట్‌లో సమర్పించాలి.

దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ

జూన్‌ 24, 2020

సందేహాలను పంపాల్సిన ఈ-మెయిల్‌ ఐడీ

icc-2020@isro.gov.in


 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని