ఆగస్టు 14న ‘చిన్నమ్మ’ విడుదల!
close

తాజా వార్తలు

Updated : 27/06/2020 16:47 IST

ఆగస్టు 14న ‘చిన్నమ్మ’ విడుదల!

భాజపా ప్రముఖుడి ట్వీట్‌తో రాజకీయ కలకలం

చెన్నై, న్యూస్‌టుడే: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో బెంగళూరు జైలులో ఉన్న శశికళ ఆగస్టు 14న విడుదల కానున్నట్టు భాజపా దిల్లీ ప్రముఖుడు చేసిన ఓ ట్వీట్‌ ప్రస్తుతం తమిళనాడు రాజకీయాలు, అన్నాడీఎంకేలో కలకలం రేపింది. దివంగత ముఖ్యమంత్రి జయలలితపై ఉన్న ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఆమె నెచ్చెలి శశికళ, ఇళవరసి, సుధాకరన్‌లు 2017 ఫిబ్రవరి 15న బెంగళూరులోని పరప్పణ అగ్రహార జైలుకెళ్లిన విషయం తెలిసిందే. శశికళను శిక్షాకాలానికి ముందే సత్ప్రవర్తన నిబంధనల కింద విడుదల చేయించడానికి ఆమె అక్క కుమారుడు, ఏఎంఎంకే ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్‌ ముమ్మరంగా ప్రయత్నాలు చేశారు. శిక్షాకాలనికి ముందే విడుదలవుతారని ఆమె బంధుమిత్రులు, సన్నిహితులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బెంగళూరుకు చెందిన సామాజిక కార్యకర్త నరసిమ్మమూర్తి కొన్ని రోజుల కిందట శశికళ విడుదలపై సహ చట్టం కింద వివరాలు తెలుసుకోవడానికి ప్రయత్నించారు. ఆమె విడుదలపై కచ్చితంగా తేదీని వెల్లడించలేమని కర్ణాటక జైళ్లశాఖ సమాధానం ఇచ్చింది.

ఈ నేపథ్యంలో ‘శశికళ నటరాజన్‌ పరప్పణ బెంగళూరులోని అగ్రహార కేంద్ర కారాగారం నుంచి ఆగస్టు 14న విడుదలయ్యే అవకాశాలు’ అంటూ భాజపా దిల్లీ ప్రముఖుడు, విశ్లేషకుడు డాక్టర్‌ ఆశీర్వాదం ఆచారి తన గురువారం రాత్రి ఓ ట్వీట్‌ చేశారు. ఆప్డేట్ల కోసం నిరీక్షించాలని తెలిపారు. శశికళ విడుదల వ్యవహారంలో ఆయన ట్వీట్‌ ప్రాధాన్యం సంతరించుకుంది. గతంలో శశికళను జైలులో భాజపా సీనియర్‌ నేత సుబ్రహ్మణ్యస్వామి మిత్రురాలు, మాజీ ఐఏఎస్‌ అధికారిణి ఒకరు కలవడం, ప్రస్తుతం ఆశీర్వాదం ఆచారి ట్వీట్‌ చేయడం వంటి పరిణామాలు ఒకదానితో ఒకటి సంబంధం ఉన్నట్టు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. శశికళ విడుదలకు భాజపా చర్యలు చేపట్టిందనే వార్తలూ ఊపందుకున్నాయి. కర్ణాటకలో భాజపా సర్కార్‌ నడుస్తుండటంతో అక్కడి నుంచి డాక్టర్‌ ఆశీర్వాదం ఆచారికి ఏదైనా సమాచారం వచ్చి ఉండొచ్చనే ప్రచారం ఉంది. దీంతో ఆగస్టు 14న ‘చిన్నమ్మ’ విడుదలవుతున్నట్టు సామాజిక మాధ్యమాల్లో ప్రచారం మొదలైంది. శశికళ ముందస్తు విడుదల వార్తలను కర్ణాటక జైళ్ల శాఖ కొట్టిపారేసిందని, దానికి సంబంధించి ఎలాంటి చర్చలు, ప్రక్రియ జరగలేదని తేల్చి చెప్పిందని సమాచారం. కోర్టు విధించిన జరిమానా రూ.10 కోట్లను ఇంకా శశికళ, ఇళవరసి, సుధాకరన్‌లు చెల్లించలేదని, ఆ మొత్తం చెల్లిస్తేకాని వారి విడుదలకు మార్గం సుగమం కాదని వెల్లడించారని తెలిసింది. శశికళ జైలు నుంచి బయటకు వెళ్లొచ్చినట్టు విడుదలైన వీడియోలు గతంలో కలకలం రేపిన నేపథ్యంలో సత్ప్రవర్తన కింద ఆమె విడుదల ప్రశ్నార్థకమేనని కొందరు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ శశికళ ముందస్తుగా విడుదలైతే తమిళనాడు రాజకీయాల్లో, ముఖ్యంగా అణ్ణాడీఎంకే పెను ప్రకంపనలు సృష్టించే అవకాశాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే ఎడప్పాడి పళనిస్వామి సహా ఆయన వర్గంలోని పలువురు ‘చిన్నమ్మ’ నమ్మిన బంటులుగా ఉన్నారని, ఆమె విడుదలైతే మళ్లీ అణ్ణాడీఎంకేలో చీలికలు ఖాయమనే ప్రచారమూ ఉంది.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని