రేపటి నుంచి మళ్లీ కరోనా పరీక్షలు: ఈటల

తాజా వార్తలు

Published : 30/06/2020 01:17 IST

రేపటి నుంచి మళ్లీ కరోనా పరీక్షలు: ఈటల

మిగతా నగరాలతో పోలిస్తే హైదరాబాద్‌లో తక్కువే


హైదరాబాద్‌: అన్ని రాష్ట్రాల్లోనూ కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతోందని తెలంగాణ వైద్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. దేశంలో కరోనా మరణాలు రేటు 3% ఉంటే తెలంగాణలో 1.7% ఉందని తెలిపారు. కరోనాతో నాలుగు నెలల క్రితం ఉన్న భయాందోళన ఇప్పుడు లేదన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘రాష్ట్రంలో కరోనాతో 240మంది చనిపోయారు. దిల్లీ, ముంబయి, కోల్‌కతాలో పెరిగినట్టే హైదరాబాద్‌లోనూ కేసులు పెరిగాయి. మిగతా నగరాల్లో ఉన్నంత విస్తృతి హైదరాబాద్‌లో లేదు’’ అన్నారు. 

నాలుగైదు రోజుల్లో కేబినెట్‌ భేటీ!

‘‘కరోనా పరీక్షల కోసం ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేశాం. రేపటి నుంచి పెద్ద మొత్తంలో స్వాబ్‌ సేకరణ చేపడతాం. ఐసీఎంఆర్‌ నిబంధనలకు అనుగుణంగా హోం క్వారంటైన్‌లో చికిత్స చేస్తాం. రేపటి నుంచి మళ్లీ కరోనా పరీక్షలు కొనసాగిస్తాం. హైదరాబాద్‌లో కరోనా కేసులు ఉన్నచోట కంటైన్‌మెంట్‌జోన్లు పెడతాం. అవసరమైతే హైదరాబాద్‌లో లాక్‌డౌన్‌పై ఆలోచన చేయాల్సి ఉంటుందని సీఎం చెప్పారు. నాలుగైదు రోజుల్లో మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేస్తాం. ప్రభుత్వ ఆస్పత్రుల్లో వేల మందికి చికిత్స అందిస్తున్నాం’’ అని పేర్కొన్నారు.

వారి ఆత్మస్థైర్యం దెబ్బతీయొద్దు

‘‘ఆరోగ్య శాఖలో 250మంది సిబ్బందికి కరోనా సోకింది. ఈ మహమ్మారితో హెడ్‌ నర్సు చనిపోయారు. వైద్యులు ప్రాణాలు పణంగా పెట్టి ఆస్పత్రుల్లో చికిత్స అందిస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లో వైద్యులపై దుష్ప్రచారం తగదు. 184మంది పోలీసులకు కరోనా పాజిటివ్‌ వచ్చింది. పోలీసులు కోలుకొని ప్రజలకు ధైర్యం ఇచ్చారు. ప్రభుత్వ ఆస్పత్రి వైద్య సిబ్బంది ఆత్మస్థైర్యం దెబ్బతీయొద్దు’’ అని కోరారు.

గాంధీలో వెంటిలేటర్లపై 10మంది!

‘‘కరోనా బాధితుల కోసం రాష్ట్రంలో 17,081 పడకలు అందుబాటులో ఉన్నాయి. ఇప్పటికే 3500 పడకలకు ఆక్సిజన్‌ సమకూర్చుకున్నాం. మరో నాలుగైదు రోజుల్లో 6500 పడకలకు ఆక్సిజన్‌ సమకూరుస్తాం. మొత్తం 10 వేల పడకలకు అవసరమైన ఆక్సిజన్‌ సమకూరుస్తాం. గాంధీ ఆస్పత్రిలో వెంటిలేటర్‌పై ఉన్న రోగులు 10మంది మాత్రమే. కరోనా లక్షణాలు లేనివారికి హోం క్వారంటైన్‌.. లక్షణాలు ఉన్నవాళ్లకే ఆస్పత్రుల్లో చికిత్స అందిస్తాం’’ అని ఈటల స్పష్టం చేశారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని