నిండా ముంచుతున్న నిర్లక్ష్యం

తాజా వార్తలు

Updated : 27/04/2021 12:12 IST

నిండా ముంచుతున్న నిర్లక్ష్యం

సొంత వైద్యం వద్దంటున్న నిపుణులు

గ్రేటర్‌లో ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితుల అనుభవాలివి. సాధారణ పరిస్థితులు నెలకొన్నాయనే ధైర్యంతో స్వేచ్ఛగా విహరించటమే తమ పరిస్థితికి కారణమంటూ వాపోయారు. ఓ ప్రముఖ ప్రైవేటు ఆసుపత్రి కార్డియాలజిస్టు తాను వైద్యం అందిస్తున్న బాధితులు చేస్తున్న తప్పిదాలను వివరించారు. తమకు వైరస్‌ సోకినట్టు గుర్తించటంలో జరుగుతున్న జాప్యం.. కొన్నిసార్లు వెంటిలేటర్‌ వరకూ తీసుకెళ్తోందని ఆందోళన వెలిబుచ్చారు. విహారయాత్రలు, విందువినోదాలు ఆస్వాదిస్తూ.. గుంపులో గడిపి తమకేమీ కాదనే అతివిశ్వాసం ఉన్న వారి వల్లే ప్రమాదం ముంచుకొస్తోందని వైద్యనిపుణులు చెబుతున్నారు. వయోధికులు, దీర్ఘకాల వ్యాధులున్న వారికి మహమ్మారి సోకేందుకు ఆయా కుటుంబాల్లోని యువతే కారణమని తమ ఆసుపత్రిలో చికిత్స పొందిన 100 మంది బాధితుల్లో 60-70 మంది చెప్పటమే ఇందుకు నిదర్శనమంటూ గచ్చిబౌలికి చెందిన వైద్యనిపుణుడొకరు తెలిపారు.

ఓ పెద్దాయన పది రోజులుగా ఇంట్లో నుంచి బయటకు రాలేదు. అయినా పరీక్షల్లో కొవిడ్‌ పాజిటివ్‌గా తేలింది. రెండ్రోజులు సొంత వైద్యంతో నెట్టుకొచ్చారు. మూడోరోజు ఉదయాన్నే శ్వాస తీసుకోవటంలో ఇబ్బంది తలెత్తటంతో ఆసుపత్రిలో చేర్చారు. 72 ఏళ్ల వయోధికుడికి ఎదురైన అనుభవం ఇది. కుటుంబ సభ్యుల్లో మరో ఇద్దరికి వైరస్‌ సోకినా వారికి ఉన్న వ్యాధి నిరోధకశక్తితో లక్షణాలు కనిపించలేదు. మధుమేహంతో బాధపడుతున్న వృద్ధునిపై వెంటనే ప్రభావం చూపింది.

రోజూ జిమ్‌కెళ్తాను. పోషకాహారం తీసుకుంటాను. ఏ వైరస్‌ తననేం చేయలేదనే ధీమా. ఈ ధైర్యం మొదటి దశలో పనిచేసినా రెండో దశలో మాత్రం పనిచేయలేదు. స్నేహితులతో కలిసి వారాంతపు వినోదంలో పాల్గొన్న ఓ ఐటీ నిపుణుడు మహమ్మారికి బారిన పడినా.. సులువుగానే బయటపడ్డాడు. అయితే అతడి కారణంగా తల్లీ, తండ్రి, అన్నావదినలు ప్రస్తుతం ఆసుపత్రిలో ఉన్నారు. రెండేళ్లపాటు పొదుపు చేసిన సొమ్మంతా వారం రోజులకే ఖర్చయింది.

వదంతులు నమ్మొద్దు

సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టే వదంతలు నమ్మొద్దు.  టీకా వేసుకున్న వాళ్లకు వైరస్‌ సోకిందంటే మాస్క్‌ తీయటం, గుంపులో చేరటం వంటి నిర్లక్ష్యమే కారణం. తప్పకుండా అందరూ టీకా వేసుకోండి. పాజిటివ్‌ అని తేలగానే సామాజిక మాధ్యమాల్లో వచ్చే సమాచారంపై ఎక్కువ మంది ఆధారపడుతున్నారు. ఆ సూచనలు వైద్యులు చేసినా అప్రమత్తత అవసరం.  సొంత ప్రయోగాలతో ప్రాణం మీదకు తెచ్చుకోవద్దు.  హోం ఐసోలేషన్‌లో ఉన్న ప్రతి ఒక్కరూ రోజూకు 4 సార్లు ఆక్సిజన్‌ స్థాయిలు పరిశీలించుకోవాలి. 94 కంటే తగ్గితే వీలైనంత తొందరగా బెడ్‌ కోసం వెతుక్కోవాలి. ఆక్సిజన్‌ స్థాయిలు తగ్గే దశలో ఉన్నపుడు ఆసుపత్రిలో చేరగలిగితే ప్రమాదం నుంచి బయటపడే అవకాశం ఉంది. - డాక్టర్‌ విజయ్‌కుమార్‌ చెన్నంశెట్టి, సీనియర్‌ పల్మనాలజిస్టు

తింటే చాలనుకుంటే కుదరదు

వేడినీళ్లు, కషాయాలు తాగుతున్నాం మాకేం కాదు. మమ్మల్ని వైరస్‌ సోకదనేది అపోహ.  సమపాళ్లలో పోషకాహారం తీసుకుంటూ, వ్యాయామం చేయటం వల్ల శరీరం, మనసు దృఢంగా ఉంటాయి. వేగంగా వ్యాపిస్తున్న వైరస్‌ను అడ్డుకోవాలంటే ముఖానికి మాస్క్‌ ధరించాలి. దూరం తప్పనిసరిగా పాటించాలి. వృద్ధులు, చిన్నపిల్లలు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారు ఉన్నపుడు మరింత జాగ్రత్తగా ఉండాలి. సామాజిక మాధ్యమాలు, స్నేహితులు చెప్పే సూచనలు కొవిడ్‌ నుంచి బయట పడేయవనేది గుర్తుంచుకోండి. ఇంటి చిట్కాలు పాటిస్తూ తాము బాగున్నామని కాలయాపన చేస్తున్నారు. ఆక్సిజన్‌ స్థాయిలు పూర్తిగా పడిపోయే సమయంలో ఆసుపత్రికి చేరుతున్నవారి సంఖ్య పెరుగుతోంది.- డాక్టర్‌ ఎన్‌.శ్రీనివాస్, యూరాలజిస్టు 

 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని