Corona: పోయినోళ్ల బంగారం పోతోంది..!
close

తాజా వార్తలు

Published : 07/05/2021 07:49 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Corona: పోయినోళ్ల బంగారం పోతోంది..!

కొవిడ్‌ ఆస్పత్రుల్లో నమోదు కాని ఆభరణాలు

తిరుపతి(కపిలతీర్థం): పుంగనూరుకు చెందిన ఓ బాధితురాలు ఈ నెల 3వ తేదీన తిరుపతిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో వైద్యం కోసం చేరారు. మరుసటి రోజు మృతి చెందారు. మృతదేహాన్ని అప్పగించేటప్పుడు ఆమె మెడలోని 60 గ్రాముల బంగారం తాళిబొట్టు కనిపించలేదు. బాధితుల బంధువులు ఆస్పత్రి యాజమాన్యాన్ని ప్రశ్నించినా ఫలితం లేకపోవడంతో అలిపిరి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఇలా గతంలో తిరుపతిలోని స్విమ్స్‌, రుయాతో పాటు జిల్లాలోని పలు ప్రభుత్వ ఆస్పత్రుల్లో కొవిడ్‌ మృతుల శరీరాలపై ఉన్న ఆభరణాలు మాయం అయ్యాయి. పలు పోలీస్‌స్టేషన్లలో కేసులు సైతం నమోదయ్యాయి. రెండో కొవిడ్‌ అలలో మృతుల సంఖ్య పెరుగుతున్నందున ఇలాంటి ఘటనలు వెలుగులోకి వచ్చే అవకాశం లేకపోలేదు. ఇప్పటి వరకు ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో ఈ విషయంపై ఎలాంటి విధి విధానాలు పాటించడం లేదు. కొవిడ్‌ బారినపడ్డారని తెలియగానే బాధితులు భయాందోళనలకు గురవుతూ వెంటనే ఆస్పత్రికి వచ్చేస్తున్నారు. ఈ క్రమంలో తమ శరీరంపైౖ ఎలాంటి విలువైన ఆభరణాలు ఉన్నాయోనని గుర్తించే పరిస్థితి ఉండదు. ఆస్పత్రిలో చేరే వారికి కొంత దూరంగా బంధువులు ఉన్నప్పటికీ ఆభరణాలు గురించి ఆలోచన చేసే పరిస్థితి ఉండదు. తీరా మృతి చెందాక మృతదేహాన్ని పూర్తిగా కప్పి జిప్‌ బ్యాగ్‌లో పెట్టి దహన సంస్కారాలకు తరలిస్తారు.

రుయాలో లేని పర్యవేక్షణ

రుయా ప్రభుత్వ ఆస్పత్రిలో సుమారు 900 మంది కొవిడ్‌ బాధితులు వైద్యం పొందుతున్నారు. వారి పడకల వరకు వైద్యులు, నర్సులు, అటెండర్లు వెళ్తుంటారు. బాధితుల శరీరంపై ఎలాంటి ఆభరణాలు ఉన్నాయి, వాటికి ఎలాంటి రక్షణ ఇస్తున్నామనే వ్యవస్థ అక్కడ కన్పించడం లేదు. కనీసం ఆస్పత్రిలో చేరే సమయంలో అయినా విలువైన ఆభరణాలు బంధువులకు అప్పగించాలని చెప్పడం, ఒక వేళ ఇవ్వలేని పరిస్థితి ఉంటే ప్రత్యేకంగా నమోదు చేయడం వంటివి చేయడం లేదు. ఆభరణాలు మాయం అయితే అందుకు దోషులు ఎవరని నిర్ధరించేందుకు ఎలాంటి ఆధారాలు అక్కడ లభించని పరిస్థితి.

స్విమ్స్‌లో సీసీ కెమెరాలే దిక్కు

గతంలో మృతదేహాలపై బంగారు ఆభరణాలు మాయమైన ఘటనలు స్విమ్స్‌ కొవిడ్‌ ఆస్పత్రిలో చోటుచేసుకున్నాయి. చివరకు ముగ్గురు స్విమ్స్‌ సిబ్బందిపై కేసులు కూడా నమోదు చేశారు. ఇప్పటి వరకు అలాంటి ఫిర్యాదు అందలేదు. అన్ని వార్డుల్లో ఉన్న సీసీ కెమెరాలు దొంగలను పట్టిస్తాయనే నమ్మకంతో స్విమ్స్‌ యాజమాన్యం ఉంది. ఇదివరకటిలా బాధితులు చేరే సమయంలోనే ఆభరణాలు నమోదు చేసి.. డిశ్ఛార్జి సమయంలో అప్పగించే వ్యవస్థ ప్రస్తుతం కన్పించడం లేదు. ప్రస్తుతం ఆక్సిజన్‌ పడకల కోసం ఎప్పుడెప్పుడాని ఎదురు చూస్తూ శరీరంపై ఎలాంటి ఆభరణాలు ఉన్నాయనే విషయాన్ని గుర్తించకుండా చేరిపోతున్నారు.

ప్రైవేటును పట్టించుకునే వారేరి?

కొవిడ్‌ బాధితులు పడకల కోసం జిల్లా నుంచే కాకుండా కడప, నెల్లూరు జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో అంబులెన్స్‌లో తిరుపతికి వస్తున్నారు. ఆత్రుతలో పడకలు ఎక్కేస్తున్నారు. ఆ సమయంలో ఆస్పత్రి యాజమాన్యం బాధ్యతగా ఆభరణాలు కుటుంబ సభ్యులకు అప్పగించడమా.. లేక నమోదు చేయడం లేదనే విమర్శలు వస్తున్నాయి.

ఎలాంటి ఫిర్యాదులు రాలేదు

స్విమ్స్‌ కొవిడ్‌ ఆస్పత్రిలో బంగారు ఆభరణాలు కాజేశారనే ఫిర్యాదులు ఇప్పటి వరకు రాలేదు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని సీసీ కెమెరాల పర్యవేక్షణ కొనసాగుతోంది. గతంలో మాదిరిగా ఇప్పుడు మృతదేహాల వద్దకు రాలేని పరిస్థితి లేదు. చనిపోయిన పది నిమిషాలకే కుటుంబ సభ్యులకు తెలియజేసి రెండు గంటల్లోనే మృతదేహాలను అప్పగిస్తున్నాం. చేర్చుకునే సమయంలోనే కేసు షీటులో ఆభరణాల గురించి నమోదు చేస్తున్నాం. - డాక్టర్‌ భూమా వెంగమ్మ, స్విమ్స్‌ సంచాలకులు, తిరుపతి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని