Corona: ఇది ఊరటే.. మహమ్మారి ఊరొదిలి పోలే
close

తాజా వార్తలు

Published : 23/06/2021 07:02 IST

Corona: ఇది ఊరటే.. మహమ్మారి ఊరొదిలి పోలే

పెరిగిన జనం రద్దీతో మళ్లీ ఎప్పుడైనా ముప్పు

ఈనాడు, హైదరాబాద్‌

పంజాగుట్టలోని ఓ బంగారం దుకాణంలో గుమిగూడిన జనం

‘లాక్‌డౌన్‌ ఎత్తివేశారు.. ఇక కరోనా పోయినట్లే...’ ఎవరికైనా ఈ భావన ఉంటే ముప్పు పొంచి ఉన్నట్లేనని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. తాజాగా లాక్‌డౌన్‌ ఎత్తివేతతో వాణిజ్య, వ్యాపార కార్యకలాపాలు ఊపందుకున్నాయి. రోడ్లు, రెస్టారెంట్లు, షాషింగ్‌ మాళ్లు, బంగారు దుకాణాలు, బార్లు.. ఇలా ఒకటేమిటి అన్ని ప్రాంతాల్లో జనం రద్దీ భారీగా పెరిగింది. పెళ్లిళ్ల సీజన్‌ కావడంతో కొనుగోలుదారులతో వస్త్ర, బంగారు దుకాణాలు కిటకిటలాడుతున్నాయి. అమీర్‌పేట, పంజాగుట్ట, కూకట్‌పల్లి, సికింద్రాబాద్‌, బేగంపేట, దిల్‌సుఖ్‌నగర్‌ తదితర ప్రాంతాల్లో జనం రద్దీ ఎక్కువగా కనిపిస్తోంది. రెండో విడతలో కరోనా ఎంతటి విలయతాండవం చూపిందో...అందరికి తెలిసిందే. చికిత్సకు పడకలు దొరకడమే గగనమైంది. సకాలంలో పడక లభించక అంబులెన్సులోనే ప్రాణాలు వదిలిన సంఘటనలు కోకొల్లలు. అనంతరం లాక్‌డౌన్‌ ప్రకటించడంతో ప్రజలంతా ఇళ్లకే పరిమితం కావడంతో కేసులు క్రమేపీ తగ్గుముఖం పట్టాయి. ప్రస్తుతం జీహెచ్‌ఎంసీ పరిధిలో నిత్యం 150-170 కేసులు నమోదు అవుతున్నాయి. పాజిటివ్‌ రేటు గణనీయంగా తగ్గింది. ఈ నేపథ్యంలో లాక్‌డౌన్‌ను ప్రభుత్వం ఎత్తివేసింది. జాగ్రత్తలు తీసుకొని కార్యకలాపాలు కొనసాగించాలని సూచించింది. ఆంక్షలు తొలగించడంతో కరోనా కూడా తగ్గిపోయిందని భ్రమల్లో చాలామంది ఉన్నారని...తాజాగా రోడ్లపై పరిస్థితి అర్థమవుతోందని వైద్య నిపుణులు విశ్లేషిస్తున్నారు. రెండో దశ ఇంకా సమసిపోకముందే జనం రద్దీ పెరిగితే మళ్లీ 10-15 రోజుల్లో మళ్లీ ముప్పు తప్పదని హెచ్చరిస్తున్నారు.

ఆ పరిస్థితి మళ్లీ వద్ధు. జాగ్రత్తలు పాటించండి

- డాక్టర్‌ రాజారావు, సూపరింటెండెంట్‌, గాంధీ ఆసుపత్రి●

* లాక్‌డౌన్‌ ఎత్తివేసినంత మాత్రాన కరోనా పోయినట్లు కాదని భావించాలి. రెండో దశ ముప్పే ఇంకా పూర్తి స్థాయిలో తగ్గలేదు. ప్రస్తుతం గాంధీలో ఇంకా 400 మంది ఐసీయూలో చికిత్స పొందుతున్నరు. మరో 300 మంది బ్లాక్‌ఫంగస్‌ బాధితులు ఉన్నారు.

* నిత్యం 10-15 మంది కరోనాతో విషమ స్థితిలో చేరుతున్నారు. మరో 20 మంది బ్లాక్‌ఫంగస్‌ బాధితులు గాంధీని ఆశ్రయిస్తున్నారు. దీంతో లాక్‌డౌన్‌ తీసేసినా ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే మళ్లీ 10-15 రోజుల్లో కేసులు పెరిగినా ఆశ్చర్యపోనవసరం లేదు.

* నిర్లక్ష్యంతో ఉంటే మూడో దశ కాదు.. రెండో దశలోనే మళ్లీ కేసులు పెరిగే ముప్పు ఉంది. ఎక్కుమంది గుమిగూడే సామూహిక కార్యక్రమాలకు ఈ ఏడాది చివరి వరకు దూరంగా ఉండటం మేలు. అత్యవసరమైతే తప్ప దూర ప్రాంతాలకు ప్రయాణాలు పెట్టుకోవద్ధు

* రెండో దశలో ఘోరమైన పరిస్థితి చూశాం. పడకలు సర్దుబాటు చేయడం తలకు మించిన భారం అయింది. తాజాగా మళ్లీ గుమిగూడం వల్ల ఉత్పరివర్తనాలతో కొత్త రకం వైరస్‌లు(వేరియంట్లు) పెరిగి తిరిగి ప్రభావం చూపే ప్రమాదం ఉంది.

* వీలైనంత త్వరగా టీకాలు తీసుకోవాలి. ఏ టీకా అయినా తీసుకోవచ్ఛు

* సమతుల ఆహారం తీసుకోవడం, రోజుకు 7 గంటలపాటు నాణ్యమైన నిద్ర, నిత్యం ఒక 30-45 నిమిషాలు వ్యాయామాలు చేయడం వల్ల వ్యాధి నిరోధశక్తి పెరుగుతుంది.

* ఇప్పటికే కరోనా వచ్చిన తగ్గిన వారు తమలో యాంటీబాడీలు ఉన్నాయనే ధీమా పనికి రాదు. వేరియంట్లు మారితే చాలామంది రీ ఇన్‌ఫెక్షన్‌ బారిన పడే ప్రమాదం ఉంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని