UNICEF: అందని ద్రాక్షలా పౌష్టికాహారం: యునిసెఫ్‌ నివేదిక వెల్లడి

తాజా వార్తలు

Updated : 23/09/2021 15:16 IST

UNICEF: అందని ద్రాక్షలా పౌష్టికాహారం: యునిసెఫ్‌ నివేదిక వెల్లడి

కొవిడ్‌తో చిన్నారుల పరిస్థితులు దారుణం

దిల్లీ: ‘అన్నార్తులు, అనాథలుండని ఆ నవయుగమదెంత దూరం?’.. అన్న దాశరథి నిలదీత నేటికీ జవాబు దొరకని ప్రశ్నే. ఆహార విధానాలపై ఈ వారం జరగనున్న ఐక్యరాజ్యసమితి సదస్సుకు ముందుగా ‘యునిసెఫ్‌’ విడుదల చేసిన తాజా నివేదిక కూడా ఇదే చాటుతోంది. గత దశాబ్దకాలంలో రెండేళ్లలోపు చిన్నారులకు తగినంత పౌష్టికాహారం అందించలేకపోయామని, కొవిడ్‌-19 మహమ్మారి ఈ దుస్థితిని మరింత దిగజారుస్తోందని నివేదిక హెచ్చరించింది. ఈ అధ్యయనంలో భాగంగా చాలామంది తల్లులను సర్వే చేశారు. ఆస్ట్రేలియా, ఇథియోపియా, ఘనా, భారత్, మెక్సికో, నైజీరియా, సైబీరియా, సూడాన్‌ దేశాల్లో ప్రతి ముగ్గురు శిశువుల్లో ఒకరికి ఆహారం గానీ, పానీయం గానీ ఒకపూటే అందుతోందని తేలింది. పేదరికం, అసమానతలు, వాతావరణ విపత్తులు, కొవిడ్‌ వంటి మహమ్మారుల విపరిణామాలే ఈ పౌష్టికాహార సంక్షోభానికి కారణమని నివేదిక స్పష్టం చేసింది. పౌష్టికాహారం పేరిట మార్కెట్లో పలు నాసిరకమైన ఉత్పత్తులు వస్తున్నా వాటిని అరికట్టడంలో పాలకులు విఫలమవుతున్నట్లు పేర్కొంది. అఫ్గానిస్థాన్, బంగ్లాదేశ్, భారతదేశాల్లో పటిష్ఠంగా ఉన్న సామాజిక కట్టుబాట్ల కారణంగానూ ఆయా దేశాలు తగినంత పౌష్టికాహారం పొందలేకపోతున్నట్లు వెల్లడించింది. 18 దేశాల తల్లులు, పౌష్టికాహార నిపుణులను తాము సంప్రదించినట్లు యునిసెఫ్‌ వివరించింది. శిశు ప్రాయంలో సరైన ఆహారం అందకపోతే భావి తరాలపై దాని ప్రభావం ఉంటుందని ఈ సంస్థ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ హెన్నీయెట్టా ఫోర్‌ చెప్పారు. 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని