వీర్యకణాల సంఖ్య పెరగాలంటే?

తాజా వార్తలు

Published : 25/10/2021 01:27 IST

వీర్యకణాల సంఖ్య పెరగాలంటే?

వీర్యకణాల సంఖ్య పెరగాలంటే?

సమస్య: నాకు పెళ్లయి 5 సంవత్సరాలు అయ్యింది. ఒక బాబు (3 సంవత్సరాలు) ఉన్నాడు. ఇప్పుడు మళ్లీ గర్భధారణ కోసం ప్రయత్నిస్తున్నాం. కానీ ఫలితం కనబడటం లేదు. ఒక డాక్టర్‌ను కలిస్తే వీర్యకణాల సంఖ్య తక్కువగా ఉందని చెప్పారు. వీర్యకణాలు పెరగాలంటే ఏం చెయ్యాలి? 

 -కె. గంగాధర్‌రెడ్డి (ఈమెయిల్‌ ద్వారా)

 వీర్యకణాల సంఖ్య పెరగాలంటే?సలహా: మీరు ఎన్నిసార్లు వీర్యకణాల సంఖ్యను పరీక్షించుకున్నారో తెలియజేయలేదు. ఒకసారి పరీక్షతోనే వీర్యకణాల సంఖ్యను నిర్ధరించటం సాధ్యం కాదు. వీర్య పరీక్షను చేయటానికీ ఒక పద్ధతుందని గుర్తించాలి. మామూలుగా 3 రోజుల పాటు సంభోగానికి దూరంగా ఉండి.. నాలుగో రోజు వీర్యం నమూనాను తీసుకోవాల్సి ఉంటుంది. వచ్చిన మొత్తం వీర్యాన్ని పట్టి.. పరీక్షించాల్సి ఉంటుంది. ఇలా రెండు మూడు సార్లు పరీక్ష చేస్తే గానీ వీర్యకణాల సంఖ్య కచ్చితంగా తేలదు. వీర్యకణాల సంఖ్య బాగానే ఉంటే మామూలుగానే గర్భధారణ జరుగుతుంది. ఆందోళన అవసరం లేదు. ఒకవేళ వీర్యకణాల సంఖ్య తక్కువగా ఉంటే వృషణాల్లో ఏవైనా సమస్యలున్నాయేమో చూడాల్సిన అవసరముంటుంది. డాప్లర్‌ అల్ట్రాసౌండ్‌ పరీక్ష చేస్తే వృషణాల్లో సిరలు ఉబ్బటం (వెరికోసీల్‌), వృషణాల్లో మార్పుల వంటివేవైనా ఉంటే బయటపడుతుంది. వెరికోసీల్‌ సమస్య ఉండి.. వీర్యకణాల సంఖ్య తక్కువుంటే మైక్రో సర్జరీ చేయాల్సి ఉంటుంది. దీంతో వీర్యకణాల సంఖ్య మెరుగవుతుంది. వృషణాల్లో సమస్యలేవీ లేకపోయినా వీర్యకణాల సంఖ్య తక్కువగా ఉంటే 2, 3 నెలల పాటు మందులు వాడుకోవాల్సి ఉంటుంది. కాబట్టి మీరు ముందుగా నిపుణులైన యూరాలజిస్ట్‌ను గానీ ఆండ్రాలజిస్ట్‌ను గానీ సంప్రతించటం మంచిది. ఒకవేళ మందులు వేసుకున్నా ఫలితం కనబడకపోతే, వీర్యకణాల సంఖ్య 10 మిలియన్ల కన్నా తక్కువుంటే ఒకసారి గైనకాలజిస్టుకు చూపించుకోవటం మంచిది. అవసరమైతే ఇంట్రాయూటరైన్‌ ఇన్‌సెమినేషన్‌ పద్ధతితో గర్భధారణ జరగటానికి ప్రయత్నిస్తారు. ఇందులో ఒక గొట్టం సాయంతో వీర్యాన్ని నేరుగా మహిళ గర్భాశయంలోకి ప్రవేశపెడతారు. దీన్ని అండం విడుదలయ్యే సమయంలోనే చేస్తారు. ఇక వీర్యకణాల సంఖ్య మరీ తక్కువగా ఉంటే కృత్రిమ గర్భధారణ పద్ధతులను (ఐవీఎఫ్‌) ప్రయత్నించొచ్చు. అలాగే మీకు పొగతాగే అలవాటుంటే వెంటనే మానెయ్యాలి. ఎందుకంటే ఇది వీర్యకణాల సంఖ్య తగ్గుముఖం పట్టేలా చేస్తుంది. జంక్‌ఫుడ్‌, మద్యం వంటి వాటికీ దూరంగా ఉండాలి. తాజా కూరగాయలు, పండ్లు, గుడ్లు, పాలు ఎక్కువగా తీసుకోవాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయటం మంచిది.

మీ ఆరోగ్య సమస్యలను సందేహాలను పంపాల్సిన చిరునామా సమస్య - సలహా సుఖీభవ ఈనాడు ప్రధాన కార్యాలయం, రామోజీ ఫిలింసిటీ, హైదరాబాద్‌ - 501 512 email: sukhi@eenadu.in


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని