ధవళేశ్వరం వద్ద కొనసాగుతున్న వరద ఉద్ధృతి
close

తాజా వార్తలు

Updated : 17/08/2020 11:13 IST

ధవళేశ్వరం వద్ద కొనసాగుతున్న వరద ఉద్ధృతి

మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం

తూర్పుగోదావరి: గత మూడు రోజులుగా ఎడతెరపిలేని వర్షాలు, ఎగువ నుంచి వస్తున్న వరదతో గోదావరిలో వరద ఉద్ధృతి కొనసాగుతోంది. దీంతో ముంపు గ్రామాలు చిగురుటాకుల్లా వణికిపోతున్నాయి. ఆదివారం సాయంత్రానికి ధవళేశ్వరం కాటన్‌ బ్యారేజి వద్ద నీటి మట్టం 15.30 అడుగులు కాగా.. సోమవారం ఉదయం 9 గంటలకు 17.10 అడుగులకు చేరింది. దీంతో 17.90 లక్షల క్యూసెక్కుల వరద నీటిని అధికారులు సముద్రంలోకి వదులుతున్నారు. ప్రస్తుతం గోదావరి వద్ద రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. రాజమహేంద్రవరం పుష్కర్ ఘాట్ వద్ద గోదావరి ఉద్ధృతంగా ప్రవహిస్తోంది.

మరికొద్ది గంటల్లో ధవళేశ్వరం కాటన్ బ్యారేజి వద్ద మూడో ప్రమాద హెచ్చరిక జారీకి అవకాశం ఉంది. మరోవైపు భద్రాచలం వద్ద కూడా గోదావరి పరవళ్లు తొక్కుతోంది. ఉదయం 6 గంటలకు వరద ప్రవాహం 59 అడుగులకు పైగా చేరింది.

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్‌

వరద ఉద్ధృతికి తూర్పుగోదావరి జిల్లాలోని 13 మండలాల పరిధిలోని 106 గ్రామాలకు ముంపు ముప్పు ఉన్నట్లు జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి తెలిపారు. వరదల కారణంగా జిల్లాలో 63 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి 5,819 మందిని తరలించినట్లు చెప్పారు. 

ముందస్తు చర్యగా 86 మర బోట్లు, 9 లాంచీలు సిద్ధం చేసినట్లు పేర్కొన్నారు. ఎటపాక డివిజన్‌లో 57 గ్రామాలు, రంపచోడవరం డివిజన్‌లో 31 గ్రామాలు, అమలాపురం డివిజన్‌లో 12 గ్రామాలు, రామచంద్రాపురం డివిజన్‌లో నాలుగు, రాజమహేంద్రవరం డివిజన్‌లో రెండు ప్రాంతాలకు ముంపు ముప్పు ఉన్నట్లు కలెక్టర్‌ వివరించారు. వరద కారణంగా జిల్లాలో 432 హెక్టార్లలో ఉద్యాన పంటలు నీట మునిగినట్లు చెప్పారు. వరద ప్రవాహం ఎక్కువగా ఉన్నందున లోతట్టు ప్రాంత ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని.. అదేవిధంగా మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని కలెక్టర్‌ హెచ్చరించారు.

భయం గుప్పిట్లో బిక్కుబిక్కుమంటూ...

గోదావరి ఉగ్రరూపంతో పశ్చిమ గోదావరి జిల్లాలోని 55 ముంపు గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. పలు గ్రామాల్లోకి వరద నీరు చేరుతోంది. వేలేరుపాడు మండలంలో 30 గ్రామాలు జలదిగ్బంధంలో ఉన్నాయి. రుద్రం కోట, వేలేరుపాడు, నార్ల వరం, తిరుమల పురం, గ్రామాల్లోకి వరద నీరు చేరడంతో ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్తున్నారు. పోలవరం మండలంలో 19 గ్రామాలు, కుక్కునూరు మండలంలో 5 గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. యలమంచిలి, ఆచంట మండలాల్లో 7 లంక గ్రామాల చుట్టూ భారీగా వరదనీరు వచ్చి చేరింది. జల దిగ్బంధంలో చిక్కుకొన్న గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. వరద కారణంగా ముంపు గ్రామాలకు అధికారులు విద్యుత్ సరఫరా కూడా నిలిపివేశారు. దీంతో ప్రజలు భయం గుప్పిట్లో బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు.


 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని