Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లోని టాప్ 10 వార్తలు

తాజా వార్తలు

Published : 05/08/2021 12:55 IST

Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లోని టాప్ 10 వార్తలు

1. చిత్తశుద్ధి ఉంటే నోటిఫికేషన్‌కు ముందే హామీలు అమలు చేయాలి: ఈటల

రాష్ట్రంలో ఉద్యమకారులంతా కనుమరుగవుతూ తెలంగాణ ద్రోహులంతా తెరపైకి వచ్చారని మాజీ మంత్రి, భాజపా నేత ఈటల రాజేందర్‌ అన్నారు. మానుకోటలో ఓదార్పు యాత్ర సమయంలో ఉద్యమకారులపై రాళ్లదాడి చేసిన వ్యక్తికి ప్రాధాన్యం కల్పించారని ఆక్షేపించారు. రాళ్లదాడి చేసిన కౌశిక్‌రెడ్డిని ఎమ్మెల్సీగా నియమించారన్నారు. ఈ విషయంపై తనతో కలసి పనిచేసిన ప్రతి ఉద్యమకారులు ఆలోచించాలని కోరారు. గత ఎన్నికల్లో తనను ఓడించేందుకు ప్రయత్నించారని ఈటల పునరుద్ఘాటించారు. త్వరలో జరగనున్న హుజూరాబాద్‌ ఉప ఎన్నికలో గెలిచేందుకు సీఎం కేసీఆర్‌ వేల కోట్ల రూపాయలను నమ్ముకున్నారని ఆరోపించారు. ఒక్కో నాయకుడికి ఖరీదు కట్టి కొనుగోళ్ల పర్వానికి తెరలేపారన్నారు.

2. జగనన్న పచ్చతోరణం.. మొక్క నాటిన ఏపీ సీఎం

ఏపీ వ్యాప్తంగా ‘జగనన్న పచ్చతోరణం- వనమహోత్సవం’ కార్యక్రమం ప్రారంభమైంది. గుంటూరు జిల్లా మంగళగిరి ఎయిమ్స్‌ ఆవరణలో సీఎం జగన్‌ మొక్క నాటి వనమహోత్సవం-2021 కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం అటవీశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాళ్లను సీఎం పరిశీలించారు. వాతావరణ సమతుల్యత, పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా రాష్ట్రంలో విరివిగా మొక్కలు నాటేందుకు వనమహోత్సవం కార్యక్రమాన్ని ఏపీ ప్రభుత్వం నిర్వహిస్తోంది.

3. పాత నోట్ల ప్రకటనలతో జాగ్రత్త: ఆర్బీఐ

పాత కరెన్సీ నోట్లు, నాణేలు కమీషనుతో విక్రయిస్తామని..కొంటామని అనధికారికంగా చేసే మోసపూరిత ప్రకటనలను నమ్మవద్దంటూ రిజర్వు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా బుధవారం ఓ ప్రకటనలో ప్రజలను హెచ్చరించింది. కొంతమంది వ్యక్తులు/ సంస్థలు రిజర్వుబ్యాంక్‌ పేరు, లోగోలను సైతం వాడుకొని ఇటువంటి మోసాలకు పాల్పడుతున్నట్టు తమదృష్టికి వచ్చిందని అధికారులు తెలిపారు. ఆన్‌లైన్‌/ఆఫ్‌లైన్‌ మార్గాల ద్వారా పాత నోట్ల చలామణీ చేస్తూ ప్రజల నుంచి ఛార్జీలు, కమీషన్లు, పన్నులు వసూలు చేస్తున్నట్లు తెలిసిందన్నారు.

4. కరోనా టీకా బూస్టర్‌ డోసు ఇప్పుడే వద్దు.. డబ్ల్యూహెచ్‌వో సూచన

కొవిడ్‌ టీకా రెండు డోసులు తీసుకున్నవారికి బూస్టర్‌ డోసును అందించే ప్రణాళికలను కనీసం సెప్టెంబరు ముగిసే వరకు వాయిదా వేసుకోవాలని సంపన్న దేశాలకు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) డైరెక్టర్‌ జనరల్‌ టెడ్రోస్‌ అధనోమ్‌ పిలుపునిచ్చారు. ముందుగా అన్ని దేశాల్లో కనీసం 10% ప్రజలకు రెండు డోసులు అందేలా చూడాలని కోరారు. కరోనాపై పోరులో భాగంగా తమ పౌరులకు బూస్టర్‌ డోసు అందించే ప్రక్రియను ఇజ్రాయెల్, ఫ్రాన్స్, జర్మనీతో పాటు పశ్చిమాసియాలోని పలు దేశాలు ఇప్పటికే ప్రారంభించాయి.

5. కేంద్రం పరిశీలనలో జమిలి ఎన్నికలు

దేశంలో 2014-19 మధ్యకాలంలో జరిగిన 38 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ప్రభుత్వం రూ.5,814 కోట్ల నిధులు విడుదల చేసిందని న్యాయశాఖ మంత్రి కిరణ్‌ రిజిజు తెలిపారు. లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు వేర్వేరుగా జరిగితే వ్యయం పెరుగుతుందన్న ఉద్దేశంతో అన్ని ఎన్నికలనూ ఏకకాలంలో నిర్వహించాలని పార్లమెంటరీ స్థాయీ సంఘం సిఫార్సు చేసినట్లు చెప్పారు. బుధవారం లోక్‌సభలో ప్రదీప్‌కుమార్‌ సింగ్‌ అనే సభ్యుడు అడిగిన లిఖితపూర్వక ప్రశ్నకు ఆయన సమాధానం ఇచ్చారు.

6. పులిచింతల ప్రాజెక్టులో ఊడిపోయిన గేటు

పులిచింతల ప్రాజెక్టులో ప్రమాదవశాత్తు గేటు ఊడిపోయింది. నీటిని విడుదల చేసే క్రమంలో 16వ నంబర్‌ గేటు ఊడిపోవడంతో ప్రకాశం బ్యారేజీకి నీరు వెళ్తోంది. 1,65,763 క్యూసెక్కుల మేర నీరు దిగువకు వెళ్తున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే పులిచింతల ప్రాజెక్టులో గరిష్ఠస్థాయిలో నీరు నిల్వ ఉంది. నీరు ఎక్కువగా ఉండటంతో కొత్త గేటు అమర్చడం సాధ్యంకాదు. అయితే దానికి ప్రత్యామ్నాయంగా స్టాప్‌లాక్‌ పరిజ్ఞానంతో తాత్కాలికంగా నీటిని అడ్డుకట్ట వేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. మరోవైపు ఏపీ జలవనరుల శాఖ మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌ పులిచింతల ప్రాజెక్టు వద్దకు వచ్చి పరిశీలించారు.

7. కరోనా.. అదే ఉద్ధృతి.. అంతే కేసులు..! 

దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. తాజాగా 16,64,030 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 41,982 మందికి పాజిటివ్‌గా తేలింది. నిన్న మరో 533 మంది ప్రాణాలు కోల్పోయారు. దాంతో మొత్తం కేసులు 3.18 కోట్లకు చేరగా.. 4,26,290 మంది మృత్యుఒడికి చేరుకున్నారని గురువారం కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. క్రియాశీల కేసులు మళ్లీ నాలుగు లక్షల మార్కును దాటి కలవరపెడుతున్నాయి. ప్రస్తుతం 4,11,076 మంది కొవిడ్‌తో బాధపడుతున్నారు.

8. పంజాబ్‌ సీఎం సలహాదారుగా పీకే రాజీనామా.. కాంగ్రెస్‌లో చేరిక ఖాయమేనా?

పంజాబ్‌లో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌కు ప్రధాన సలహాదారుగా ఉన్న ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్‌ ఆ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. ప్రజాజీవితంలో క్రియాశీల పాత్ర నుంచి కొంత విరామం తీసుకోవాలనే ఉద్దేశంతోనే ప్రధాన సలహాదారు పదవికి రాజీనామా చేస్తున్నట్లు పీకే చెప్పారు. ఈ మేరకు సీఎంకు లేఖ రాశారు.

9. కరోనా ఉద్ధృతి.. చైనాలో ఓ నగరం మూసివేత!

చైనాలో గత కొద్ది రోజులుగా కొవిడ్‌ మహమ్మారి తిరిగి విజృంభిస్తోంది. మొత్తం 17 ప్రావిన్సుల్లో అనూహ్యంగా కొత్త కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. వైరస్‌ వ్యాప్తికి కేంద్రంగా మారిన, ప్రముఖ పర్యాటక ప్రాంతం ఝాంగ్‌జియాజీ నగరాన్ని పూర్తిగా మూసివేసింది. ప్రజలెవరినీ ఇళ్లు దాటి బయటకు రావద్దని.. నగరంలో ఉన్నవారెవరూ (పర్యాటకులు సహా) బయటకు వెళ్లరాదని ఆంక్షలు విధించింది. వైరస్‌ కట్టడిలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన స్థానిక అధికారులకు శిక్షలు విధించేందుకు సిద్ధమవుతోంది.

10. 41 ఏళ్లకు పతకం.. కొవిడ్‌ యోధులకు అంకితం

ఒలింపిక్స్‌లో సాధించిన కాంస్య పతకాన్ని కొవిడ్‌ యోధులైన వైద్యులు, ఆరోగ్య సిబ్బందికి అంకితం ఇస్తున్నామని హాకీ జట్టు కెప్టెన్‌ మన్‌ప్రీత్‌ సింగ్‌ అన్నాడు. 41 ఏళ్ల కల నెరవేరడంతో మాటలు రావడం లేదని చెప్పాడు. ఆనందంతో భావోద్వేగానికి గురయ్యానని వెల్లడించాడు. జర్మనీతో గురువారం జరిగిన కాంస్య పోరులో టీమ్‌ఇండియా ఘన విజయం సాధించింది. హోరాహోరీగా జరిగిన మ్యాచులో 5-4 తేడాతో ప్రత్యర్థిని ఓడించింది.

అబ్బాయిలూ.. చీర్స్!  భారత్ పండుగ మూడ్‌లో ఉంది..!


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని