Top Ten News @ 5 PM
close

తాజా వార్తలు

Updated : 07/05/2021 17:13 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Top Ten News @ 5 PM

1. N440K: తీవ్రత లేకుంటే ఏపీపై ఆంక్షలెందుకు?

ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం N440K అనే కొత్త రకం కొవిడ్‌-19 వైరస్‌ వ్యాప్తి తీవ్రత లేకపోతే పొరుగు రాష్ట్రాలు ఏపీ నుంచి వచ్చేవారిపై ఎందుకు ఆంక్షలు విధిస్తున్నాయని తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు నిలదీశారు. ఏపీ నుంచి వచ్చేవారు 14 రోజులు క్వారంటైన్‌లో ఉండాలని దిల్లీ సహా వివిధ రాష్ట్రాలు ఆంక్షలు పెట్టాయన్నారు. ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని.. ప్రజల ప్రాణాల కంటే జగన్‌మోహన్‌ రెడ్డి ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చేందుకే ప్రాధాన్యం ఇస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో కరోనా తీవ్రతపై హైకోర్టు అడిగిన ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం చెప్పగలదా? అని అచ్చెన్న ప్రశ్నించారు. 

2. BJP: ఏపీ నేతతో సిద్ధార్థ్‌ ట్విటర్‌ వార్‌

భారతీయ జనతా పార్టీకి, సిద్ధార్థ్‌కు మధ్య జరుగుతున్న మాటల యుద్ధం రోజురోజుకీ ముదిరిపోతోంది. కేంద్రంలో ఉన్న భాజపా ప్రభుత్వం ప్రజలకు సాయం చేసే విషయంలో ఎన్నో సందర్భాల్లో విఫలమైందని పేర్కొంటూ గత కొన్నిరోజుల నుంచి సిద్ధార్థ్‌ వరుస ట్వీట్లు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే భాజపాపై ఆయన విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. కాగా, తమ పార్టీని తప్పుబడుతున్న సిద్ధార్థ్‌కు సరైన సమాధానం చెప్పాలనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్‌ భాజపా నేత విష్ణువర్ధన్‌ రెడ్డి తాజాగా ఓ ట్వీట్‌ పెట్టారు. 

3. Corona: ప్రధానికి అండగా ఉండాలి: జగన్‌

కరోనాపై పోరాటంలో ప్రధాని మోదీకి అందరూ అండగా ఉండాలని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ అన్నారు. రాష్ట్రాల ముఖ్యమంత్రులు చెప్పేది ప్రధాని వినడం లేదంటూ ఝార్ఖండ్‌ సీఎం హేమంత్‌సోరెన్‌ చేసిన ట్వీట్‌పై జగన్‌ స్పందించారు. ఇది కొవిడ్‌పై యుద్ధంలో వేలెత్తి చూపే సమయం కాదని.. ప్రధానికి అండగా నిలవాల్సిన సమయమని హేమంత్‌సోరెన్‌కు జగన్‌ సూచించారు. కరోనా విజృంభిస్తోన్న వేళ తగినంత ఆక్సిజన్‌తో పాటు టీకాలు సరఫరా చేయడం లేదంటూ చాలా మంది ముఖ్యమంత్రులు బహిరంగంగానే కేంద్రాన్ని తప్పుబడుతున్న విషయం తెలిసిందే. 

4. Vaccine : ఇకపై ఆ నంబర్‌ చెప్తేనే ఇస్తారు!

దేశవ్యాప్తంగా కరోనా విలయతాండవం సృష్టిస్తోంది. మహమ్మారి నుంచి తప్పించుకునేందుకు టీకా ఒక్కటే మార్గంగా కనిపిస్తోంది. దీంతో దేశంలో అందుబాటులో ఉన్న టీకాల కోసం ప్రజలు పెద్ద ఎత్తున పోటీపడుతున్నారు. టీకాల పంపిణీ కార్యక్రమాన్ని పారదర్శకంగా నిర్వహించేందుకు కేంద్రం కొవిన్‌ పోర్టల్‌ను అందుబాటులోకి తెచ్చిన విషయం తెలిసిందే. వ్యాక్సిన్‌ కావాలనుకునేవారు తప్పనిసరిగా ఇందులో రిజిస్టర్‌ చేసుకోవాలి. అయితే, అసలు సమస్య ఇక్కడే ఎదురవుతోంది. సరైన పరిజ్ఞానం లేకపోవడంతో చాలా మంది రిజిస్టర్‌ చేసుకోలేకపోతున్నారు. ఇంకొందరు ఆన్‌లైన్‌లో రిజిస్టర్‌ చేసుకున్నా...స్లాట్‌ బుక్‌ చేసుకున్న సమయానికి వ్యాక్సినేషన్‌ కేంద్రానికి వెళ్లడం లేదు. 

Covid వేళ.. ఫోనెత్తకుంటే గుబులే!

5. భారత్‌లో వైరస్‌ ఉద్ధృతి ప్రపంచానికే ప్రమాదం

దేశంలో కరోనా వైరస్‌ విజృంభణ కేవలం భారత్‌కే కాకుండా ప్రపంచం మొత్తానికీ ప్రమాదం అని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ అన్నారు. కొవిడ్‌-19 వ్యాప్తి, వ్యాక్సినేషన్‌పై కేంద్ర ప్రభుత్వానికి సరైన వ్యూహం లేకపోవడం వల్లే మహమ్మారి సునామీలా విరుచుకుపడుతోందని ఆరోపించారు. ఈ మేరకు కొవిడ్‌ కట్టడికి పలు సూచనలు చేస్తూ ప్రధాని మోదీకి లేఖ రాశారు. కరోనా వ్యాప్తి భయానకంగా ఉన్న నేపథ్యంలో ప్రజల్ని కాపాడేందుకు చేయాల్సిన ప్రతి చర్య అమలు చేయాలని రాహుల్‌ ప్రధానిని విజ్ఞప్తి చేశారు. 

6. Covid విజేతలపై ‘బ్లాక్‌ ఫంగస్‌’ పంజా..!

కొవిడ్‌ నుంచి కోలుకొన్న వారిని బ్లాక్‌ ఫంగల్‌ ఇన్ఫెక్షన్‌ భయపెడుతోంది. ఇటీవల కాలంలో బ్లాక్‌ ఫంగల్‌ కేసులు పెరిగిపోతున్నట్లు దిల్లీ, పుణె, అహ్మదాబాద్‌ల్లోని వైద్యులు గుర్తించారు. గతంలో కొవిడ్‌ ఫస్ట్‌వేవ్‌ సమయంలో కూడా కోలుకొన్న వారిలో కొందరిని ఈ ఇన్ఫెక్షన్‌ సోకింది. తాజా మళ్లీ ఈ రకమైన కేసులు పెరుగుతున్నాయి. తాజాగా దిల్లీలోని గంగారామ్‌ ఆసుపత్రిలో గత రెండు రోజుల్లో ఇటువంటివి ఆరు కేసులను గుర్తించినట్లు ఈఎన్‌టీ సర్జన్‌ మనీష్‌ ముంజల్‌ తెలిపారు. గుజరాత్‌లోని కొన్ని ఆసుపత్రుల్లో ఈ కేసులను గుర్తించారు. 

7. Oxygen ఇంట్లో ఉన్నవారికి కూడా..

దిల్లీలో ఆక్సిజన్‌కు విపరీతంగా డిమాండ్‌ ఏర్పడిన నేపథ్యంలో ఇంట్లో (హోం ఐసొలేషన్‌) ఉన్న కరోనా బాధితులకు ఆన్‌లైన్‌ ద్వారా ఆక్సిజన్‌ను పంపిణీ చేస్తామని ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అంబులెన్స్‌లు, నర్సింగ్‌ హోమ్‌లు, ఇతర కొవిడ్‌ ఆసుపత్రులకు కూడా పంపిణీ చేస్తామని గురువారం విడుదల చేసిన ఓ ప్రకటనలో పేర్కొంది. ఇందుకోసం ప్రజలు దిల్లీ అధికారిక వెబ్‌సైట్లో ఫొటో ఐడీ, ఆధార్, కొవిడ్‌ పాజిటివ్‌ నివేదిక సహా సంబంధిత వివరాలను నమోదు చేసి దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. 

8. T20WC: భారత్‌లో ఆడకపోవడమే మంచిది

కరోనా మహమ్మారి విజృంభిస్తున్న పరిస్థితుల్లో ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ను యూఏఈకి తరలించడం మంచిదని ఆస్ట్రేలియా పేసర్‌ పాట్ కమిన్స్ అభిప్రాయపడ్డాడు. ఇటీవల ఐపీఎల్‌ 14వ సీజన్‌లో పలువురు ఆటగాళ్లు కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. దీంతో ఆ టోర్నీ నిరవధికంగా వాయిదా పడింది. మరోవైపు ఏడాది చివర్లో కరోనా మూడో దశ విజృంభించే ప్రమాదం ఉన్నందున పొట్టి ప్రపంచకప్‌పైనా నీలినీడలు కమ్ముకున్నాయి. ఈ నేపథ్యంలోనే కమిన్స్‌ ఇలా వ్యాఖ్యానించాడు. 

9. Stock Market: వరుసగా మూడో రోజూ లాభాలే

దేశీయ స్టాక్ మార్కెట్లలో లాభాల జోరు వరుసగా మూడో రోజూ కొనసాగింది. శుక్రవారం సూచీలు లాభాల్లో ముగిశాయి. ఉదయమే సానుకూలంగా ప్రారంభమైన సూచీలు రోజంతా లాభాల బాటలోనే పయనించాయి. ఉదయం 49,169 వద్ద లాభాలతో ప్రారంభమైన సెన్సెక్స్‌ చివరకు 256 పాయింట్లు లాభపడి 49,206 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో 49,036 వద్ద కనిష్ఠాన్ని.. 49,417 వద్ద గరిష్ఠాన్ని చవిచూసింది. ఇదే ట్రెండ్‌ కొనసాగించిన నిఫ్టీ రోజులో 14,863-14,765 మధ్య కదలాడి చివరకు 98 పాయింట్లు ఎగబాకి 14,823 వద్ద స్థిరపడింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ.73.91 వద్ద నిలిచింది. 

10. Chhota Rajan: చనిపోలేదు: దిల్లీ పోలీస్‌

ఒకప్పటి అండర్‌వరల్డ్‌ డాన్‌గా పేరొందిన ఛోటా రాజన్‌(62) కొవిడ్‌తో మృతిచెందాడంటూ వస్తున్న వార్తలను దిల్లీ పోలీసులు ఖండించారు. తిహాడ్‌ జైలులో శిక్ష అనుభవిస్తున్న ఛోటా రాజన్‌కు గతనెల 27న వైద్య పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌గా తేలింది. దీంతో ఆయనను తిహాడ్‌ జైలు అధికారులు ఎయిమ్స్‌ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. కొవిడ్‌ ప్రత్యేక వార్డులో చికిత్స పొందుతున్న ఛోటా రాజన్‌ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో శుక్రవారం కన్నుమూసినట్లు ఎయిమ్స్‌ వైద్యులు వెల్లడించారంటూ వార్తలు ప్రసారమయ్యాయి.

ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని