Top Ten News @ 5 PM
close

తాజా వార్తలు

Published : 15/05/2021 16:56 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Top Ten News @ 5 PM

1. ప్రశ్నిస్తే అరెస్టులు చేస్తారా?: అయ్యన్న

ప్రభుత్వమన్నాక రాజకీయ నాయకులు, ప్రజలు అంతా ప్రశ్నిస్తారని, అంతమాత్రం చేత అరెస్టు చేస్తారా? అని మాజీ మంత్రి, తెదేపా నేత అయ్యన్నపాత్రుడు ప్రశ్నించారు. నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు అరెస్టును ఆయన ఖండించారు. సీఎం జగన్‌ వ్యవస్థలను తన గుప్పెట్లో పెట్టుకొని వాటిని నాశనం చేస్తున్నారంటూ ధ్వజమెత్తారు. రాష్ట్రంలో జరుగుతున్న ఘటనలపై ప్రతి ఒక్కరూ స్పందించాల్సిన అవసరం ఉందని, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలని అయ్యన్న పిలుపునిచ్చారు. 

అక్ర‌మ అరెస్టులు ప్ర‌జాస్వామ్యానికి విఘాతం

2. గర్భిణి మృతిపై విచారణకు కలెక్టర్‌ ఆదేశం

హైదరాబాద్‌లో పలు కార్పొరేట్‌ ఆస్పత్రుల తీరుతో మల్లాపూర్‌కు చెందిన నిండు గర్భిణి అంబులెన్స్‌లోనే మృతిచెందిన ఘటన అందరినీ కలిచివేసిన విషయం తెలిసిందే. నగరంలోని ఐదు ఆస్పత్రులకు తిరిగి ఐదు గంటలుగా అంబులెన్స్‌లోనే కొట్టుమిట్టాడినా కార్పొరేట్‌ ఆస్పత్రులు స్పందించకపోవడంతో రెండు ప్రాణాలూ గాల్లో కలిసిపోయాయి. ఈ హృదయవిదారక ఘటనపై మేడ్చల్‌ జిల్లా ఇన్‌ఛార్జి కలెక్టర్‌ శ్వేతా మహంతి విచారణకు ఆదేశించారు.

3. ర‌ఘురామ బెయిల్ పిటిష‌న్‌ను కొట్టేసిన హైకోర్టు

ఎంపీ రఘురామ‌కృష్ణరాజు వేసిన బెయిల్ పిటిష‌న్‌ను ఏపీ హైకోర్టు కొట్టేసింది. దీనిపై విచార‌ణ జ‌రిపిన‌ ఉన్న‌త న్యాయ‌స్థానం వాద‌న‌లు పూర్తి అవ‌డంతో.. బెయిల్ కోసం సెష‌న్స్ కోర్టుకు వెళ్లాల‌ని ర‌ఘురామ‌కు సూచించింది. ఎంపీని సీఐడీ కోర్టులో హాజ‌రు ప‌ర‌చాల‌ని సీఐడీ అధికారుల‌ను ఆదేశించింది. నేరుగా హైకోర్టుకు రాకుండా కింది కోర్టుకు వెళ్లాల‌ని తెలిపింది. ఈ క్ర‌మంలో ఎంపీని సీఐడీ కోర్టులో ప్ర‌వేశ‌పెట్టే అవ‌కాశం ఉంది.గుంటూరు జిల్లా కోర్టు ప్రాంగణంలోని ఆరో అద‌న‌పు కోర్టులో ర‌ఘురామ‌ను హాజ‌రు ప‌ర‌చ‌నున్నారు.

4. IND-AUS మధ్య విమాన సేవలు పునఃప్రారంభం

భారత్‌- ఆస్ట్రేలియా మధ్య విమాన సర్వీసులు పునఃప్రారంభమయ్యాయి.  కరోనా సెకండ్‌ వేవ్‌ నేపథ్యంలో భారత్‌ నుంచి వచ్చిన విమానాలపై ఆస్ట్రేలియా నిషేధం విధించిన విషయం తెలిసిందే. ఈ నిషేధం గడువు మే 14 అర్ధరాత్రితో ముగియడంతో ఇరు దేశాల మధ్య విమానాల రాకపోకలు ప్రారంభమయ్యాయి. దీంతో 80మంది ప్రయాణికులతో భారత్‌ నుంచి బయల్దేరిన విమానం ఆస్ట్రేలియాకు చేరుకుంది. విమానాల నిషేధం ఎత్తివేస్తున్నట్టు ప్రకటించిన ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్‌ మోరిసన్‌ మాట్లాడుతూ.. క్వారంటైన్‌ కేంద్రాలను దాటి ప్రజల్లోకి కరోనా వ్యాపించకుండా అడ్డుకునేందుకు ఈ నిషేధం సహకరించిందని తెలిపారు.

5. కోవిడ్ చికిత్స‌లో.. ఎంత వ‌రకు న‌గ‌దు రూపంలో చెల్లించ‌వ‌చ్చు..

కోవిడ్‌-19 చికిత్సకు అయ్యే ఖ‌ర్చు విష‌యంలో.. న‌గ‌దు రూపంలో చేసే చెల్లింపుల‌కు కొంత వెసులు బాటను ఇస్తూ ఆదాయపు ప‌న్ను శాఖ ఇటీవ‌లే నిర్ణ‌యం తీసుకుంది. ఆదాయ‌పు ప‌న్ను చ‌ట్టం 1961లోని సెక్షన్ 269 ఎస్టీ ప్రకారం రూ.2 ల‌క్ష‌లకు మించి న‌గ‌దు రూపంలో చెల్లింపులు చేసే వీలులేదు. ఈ కార‌ణంగా ఆసుప‌త్రిలో బిల్లు చెల్లింపుల‌కు పేషెంట్ల బంధ‌వులు ఇబ్బంది ప‌డుతున్నారు. అందువ‌ల్ల ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు స‌దరు శాఖ తెలిపింది. నోటిఫికేష‌న్ ప్ర‌కారం కోవిడ్ చికిత్స నిమిత్తం రూ.2 ల‌క్ష‌లు, అంత‌కు మించి అయిన ఆసుప‌త్రి బిల్లును న‌గ‌దు రూపంలో చెల్లించ‌వ‌చ్చ‌ని తెలిపింది. ఇది ఏప్రిల్ 1 నుంచి మే 30 వ‌ర‌కు నిర్వ‌హించే కోవిడ్ చికిత్స  లావాదేవీల‌కు మాత్ర‌మే ఇది వ‌ర్తిస్తుంద‌ని స్ప‌ష్టం చేసింది. 

6. Vaccine: ఏ వయసు వారికి ఎన్ని వేశారంటే?

దేశంలోని 10 రాష్ట్రాల్లో 67శాతం మందికి టీకాలు ఇచ్చినట్టు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఈ మేరకు దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్‌కు సంబంధించిన గణాంకాలను వెలువరించింది. 60ఏళ్లు పైబడిన వారిలో 39.9శాతం మందికి టీకాలు ఇచ్చినట్టు తెలిపింది. 45 నుంచి 60 ఏళ్ల మధ్య వయసువారిలో 45.5శాతం మందికి; 30 నుంచి 45 ఏళ్ల వారిలో 9.4శాతం; 18 నుంచి 30 ఏళ్ల మధ్య వయస్కుల్లో 5.2శాతం మందికి టీకాలు ఇచ్చినట్టు పేర్కొంది. 18 నుంచి 44 ఏళ్ల వారిలో 42లక్షల మందికి పైగా టీకాలు వేసినట్టు తెలిపింది. ఇందులో అత్యధికంగా దిల్లీలో 5.26లక్షల మందికి టీకాలు ఇచ్చినట్టు వెల్లడించింది. 

7. Oxygen Concentrator:దిల్లీలో హోం డెలివరీ

కరోనా మహమ్మారిపై జరుపుతున్న పోరాటంలో భాగంగా శనివారం దిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆక్సిజన్ కొరతను తట్టుకొని నిలిచేందుకు కేంద్ర పాలిత ప్రాంతంలోని ప్రతిజిల్లాలో ఆక్సిజన్ కాన్సంట్రేటర్ బ్యాంకులను ఏర్పాటు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వెల్లడించారు. హోం ఐసోలేషన్‌లో ఉన్న బాధితులు ఈ ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను ఇంటివద్దకే డెలివరీ చేయించుకునే వెసులుబాటును ప్రభుత్వం కల్పించింది. ‘దిల్లీ వాసులకు ఈ రోజు నుంచి ఒక ముఖ్యమైన సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకువస్తున్నాం. ప్రతి జిల్లాలో ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్ బ్యాంకులను ఏర్పాటు చేస్తున్నాం. ఒక్కోబ్యాంకులో 200 కాన్సంట్రేటర్లు ఉంటాయి.

8. H-1B visa: గూగుల్‌ కీలక నిర్ణయం

విదేశాల నుంచి అమెరికాకు వచ్చే అధిక నైపుణ్యం కలిగిన వలసదారులైన హెచ్‌-1బీ వీసాదారుల భాగస్వాములకు వర్క్‌ వీసాలు అందించేందుకు గూగుల్‌ మద్దతు ఇచ్చింది. ఇప్పటికే పలు సంస్థలు సానుకూలంగా అభిప్రాయాలు వ్యక్తం చేయగా, గూగుల్‌ సైతం ఈ జాబితాలో చేరింది. అమెరికాకు వచ్చే వలసదారులకు గూగుల్‌ మద్దతుగా ఉంటుందని సంస్థ సీఈవో సుందర్‌ పిచాయ్ ట్వీట్‌ చేశారు. ఈ మేరకు హెచ్‌-4ఈఏడీ(ఎంప్లాయ్‌మెంట్‌ ఆథరైజేషన్‌ డాక్యుమెంట్‌) కార్యక్రమానికి మద్దతు ఇస్తున్నట్లు పేర్కొన్నారు. తద్వారా ఆవిష్కరణలు పెరిగి ఉద్యోగ సృష్టి జరుగుతుందన్నారు. 

9. Ball Tampering ఉదంతం వాళ్లకూ తెలుసు 

2018లో దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌ సందర్భంగా ఆస్ట్రేలియా ఆటగాళ్లు కామెరూన్‌ బాన్‌క్రాఫ్ట్‌, స్టీవ్‌స్మిత్‌, డేవిడ్‌ వార్నర్ బాల్‌ టాంపరింగ్‌కు పాల్పడిన సంగతి అందరికీ తెలిసిందే. ఆ ఉదంతం క్రికెట్‌ ప్రపంచంలో పెను దుమారం లేపింది. దాంతో బాన్‌క్రాఫ్ట్‌ తొమ్మిది నెలలు ఆటకు దూరమవ్వగా.. స్మిత్‌, వార్నర్‌ ఏడాది పాటు నిషేధానికి గురయ్యారు. కాగా, నాటి వివాదాస్పద సంఘటనపై ప్రధాన సూత్రధారి బాన్‌క్రాఫ్ట్‌ తాజాగా నోరు విప్పాడు. అది జరిగినప్పుడు తమ కెప్టెన్‌ స్టీవ్‌స్మిత్‌, వైస్‌ కెప్టెన్‌ డేవిడ్‌ వార్నర్‌తో పాటు ఇతర బౌలర్లకు కూడా తెలుసని అన్నాడు. 

10. గంగానదిలో మళ్లీ శవాల కలకలం.. రాహుల్‌ విమర్శలు

ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఘాజీపూర్‌లోని గంగానదిలో మరోసారి పెద్ద సంఖ్యలో మృతదేహాలు కనిపించాయి. అయితే, ఇవి కొవిడ్‌ మృతదేహాలా? కాదా? అనే విషయాన్ని మాత్రం అధికారులు ఇంకా నిర్ధారించలేదు. ఈ ఉదయం మృతదేహాలు నదిలో కొట్టుకు రాగా.. దూరంగా ఉన్న ఇసుక దిబ్బల్లో స్థానికులు వీటిని గుర్తించారు. ఇటీవల గంగా నదిలో కొవిడ్‌ మృతదేహాలను ఖననం చేస్తున్నట్టు వార్తలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో భౌతికకాయాలు కనిపించడంతో స్థానికులు తీవ్ర ఆందోళన చెందుతున్న విషయం తెలిసిందే. అయితే, ప్రధాని నరేంద్ర మోదీపై కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ పరోక్ష విమర్శలు చేశారు. గంగా నది పిలస్తోందని వ్యాఖ్యలు చేసిన వారే ఇప్పుడు నదిని విలపించేలా చేస్తున్నారంటూ పేర్కొన్నారు. 

ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని