Top Ten News @ 5 PM
close

తాజా వార్తలు

Published : 14/06/2021 16:56 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Top Ten News @ 5 PM

1. MansasTrust: హైకోర్టు తీర్పు హర్షణీయం: చంద్రబాబు

మాన్సాస్‌ ట్రస్టు కేసులో హైకోర్టు తీర్పు హర్షణీయమని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. కోర్టు తీర్పు వేలమంది ఉద్యోగులకు అండగా నిలిచిందన్నారు. అడ్డగోలు జీవోలు ఇస్తే చట్టం చూస్తూ ఊరుకోదని ఆయన వ్యాఖ్యానించారు. ట్రస్టును కాపాడుకున్న అశోక్‌ గజపతిరాజుకు అభినందనలు తెలిపారు. మాన్సాస్‌ ట్రస్టు కేసులో న్యాయమే గెలిచిందని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. చీకటి జీవోలు ఇచ్చిన జగన్‌ సర్కారుకు హైకోర్టు తీర్పు గుణపాఠమని చెప్పారు.న్యాయపోరాటం చేసిన అశోక్‌గజపతి రాజుకు అభినందనలు తెలిపారు.మాన్సాస్‌, సింహాచ‌లం ట్ర‌స్టుల ఛైర్‌పర్సన్‌ నియామక జీవోను ఏపీ హైకోర్టు కొట్టేసిన విషయం తెలిసిందే.

2. TS News: విప‌క్షాల వ్యాఖ్య‌లు విడ్డూరం: హ‌రీశ్‌రావు

తెలంగాణ రాష్ట్రంలో నిరుప‌యోగంగా ఉన్న ప్ర‌భుత్వ భూముల‌ను సర్కారు విక్ర‌యించాల‌ని నిర్ణ‌యించిన నేప‌థ్యంలో.. విప‌క్షాల వ్యాఖ్య‌లు విడ్డూరంగా ఉన్నాయ‌ని ఆర్థిక‌ మంత్రి హ‌రీశ్‌రావు అన్నారు. సంగారెడ్డి జిల్లాలోని సంగమేశ్వ‌ర, బ‌స‌వేశ్వ‌ర ఎత్తిపోతల ప్రాజెక్టు స‌ర్వే ప‌నుల‌ను ప్రారంభించిన అనంతరం ఆయ‌న మాట్లాడారు. ఎత్తిపోత‌ల ప్రాజెక్టుతో ఈ ప్రాంత‌మంతా స‌స్య‌శ్యామ‌లం అవుతుంద‌ని.. 60, 70 రోజుల్లో ప్రాజెక్టుకు సంబంధించిన డీపీఆర్ త‌యారు చేయాల‌ని అధికారుల‌ను కోరుతున్నాన‌న్నారు. రూ.16 కోట్లతో సంగ‌మేశ్వ‌ర‌, రూ.11 కోట్ల‌తో బ‌స‌వేశ్వ‌ర స‌ర్వే ప‌నులు చేపడుతున్నామన్నారు.

TS news: కావేటి మృతిపై కేసీఆర్‌ సంతాపం

3. ఇప్పటికైనా చట్టాలను గౌరవించాలి: అశోక్‌ గజపతి

ఏపీ ప్రభుత్వం ఇప్పటికైనా చట్టాలు, రాజ్యాంగాన్ని గౌరవించాలని కేంద్ర మాజీ మంత్రి, తెదేపా సీనియర్‌ నేత అశోక్‌ గజపతిరాజు సూచించారు. మాన్సాస్‌, సింహాచలం ట్రస్టు ఛైర్‌పర్సన్‌గా సంచయిత నియామక జీవోను కొట్టివేసి అశోక్‌ గజపతిని పునర్నియమించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని  రాష్ట్ర హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో విజయనగరంలో ఆయన మీడియాతో మాట్లాడారు. వివాదం జరిగి చాలా రోజులైందని.. ఎక్కడెక్కడ నష్టం జరిగిందో చూడాల్సిన అవసరముందన్నారు. సింహాచలం ట్రస్టు పరిధిలోని ఆలయాల్లో పరిస్థితులను పరిశీలించాల్సి ఉందని చెప్పారు. ఈ విషయంలో ప్రభుత్వం ఎంత వరకు సహకరిస్తుందనేది చూడాలన్నారు.

4. Disha: సినిమాను రెండు వారాలు ఆపండి

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన దిశ హత్యాచారం కేసు, వాస్తవ సంఘటనల ఆధారంగా దర్శకుడు రాంగోపాల్‌వర్మ ‘దిశ’ పేరుతో ఓ చిత్రాన్ని తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా విడుదల కాకుండా ఆపాలని దిశ కుటుంబ సభ్యులు హైకోర్టును ఆశ్రయించారు. సోమవారం ఈ అప్పీల్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సినిమకు తామే దర్శక-నిర్మాతలమని ఆనంద్‌ చంద్ర, అనురాగ్‌లు న్యాయస్థానానికి వివరించారు. సినిమా టైటిల్‌ను ‘ఆశ ఎన్‌కౌంటర్‌’గా మార్చినట్లు తెలిపారు. సెన్సార్‌ బోర్డు కూడా సినిమాను వీక్షించి ఏ-సర్టిఫికెట్‌ ఇచ్చినట్లు వివరించారు.

5. చారిత్రక ప్రదేశాల సందర్శకులకు కేంద్రం గుడ్‌న్యూస్

దేశంలో కరోనా సెకండ్‌ వేవ్‌ ఉద్ధృతి తగ్గుముఖం పట్టడంతో కేంద్ర పర్యాటక శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. దేశ వ్యాప్తంగా ఉన్న చారిత్రక కట్టడాలు, స్మారక స్థలాలు, మ్యూజియాలను ఈ నెల 16 నుంచి తెరవనున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు భారత పురావస్తుశాఖ సోమవారం ఓ ప్రకటన విడుదల చేసింది. కొవిడ్‌ రెండో దశ ప్రారంభమై భారీగా కేసులు పెరగడంతో అప్రమత్తమైన కేంద్రం.. స్మారక కట్టడాలు, స్థలాలు, మ్యూజియాలను ఏప్రిల్‌ 15నుంచి మూసివేస్తున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం దేశంలో వైరస్‌ కేసులు తగ్గుతున్నాయి. అనేక రాష్ట్రాల్లో విధించిన లాక్‌డౌన్‌లను సడలిస్తూ సాధారణ జీవనానికి అనుగుణంగా చర్యలు చేపడుతున్నాయి. 

6. Indian railway: రైలు టికెట్లపై రాయితీ పొడిగింపు

టికెట్లు బుక్‌ చేసుకొనేందుకు యూపీఐ ద్వారా పేమెంట్లు చేసే ప్రయాణికులకు భారత రైల్వే ఇప్పటికే రాయితీని కల్పిస్తోంది. తాజాగా ఈ పథకాన్ని మరో ఏడాది పాటు పొడిగించినట్లు అధికారులు వెల్లడించారు.  డిజిటల్‌ ఇండియా కార్యక్రమంలో భాగంగా 2017 డిసెంబరు నుంచి టికెట్ల బుకింగ్‌కు యూపీఐ పేమెంట్లను అందుబాటులోకి తెచ్చారు. ఆన్‌లైన్‌లో బుకింగ్‌ చేసుకొనే వారితో పాటు రైల్వే స్టేషన్లలోని కౌంటర్లలో కూడా యూపీఐ చెల్లింపులు చేసుకొనే సౌకర్యం అందుబాటులో ఉంది. యూనిఫైడ్‌ పేమెంట్‌ ఇంటర్‌ఫేస్‌ (యూపీఐ), భారత్‌ ఇంటర్‌ఫేస్‌ ఫర్‌ మనీ ( బీహెచ్‌ఐఎం) ద్వారా చెల్లింపులు చేసుకొనే అవకాశం ఉంది.

7. G-7: మోదీజీ..అక్కడ చెప్పేవి ఇక్కడ చేయండి

G-7 సమావేశాల్లో భాగంగా ప్రధాని మోదీ ఇచ్చిన ప్రసంగంపై కాంగ్రెస్‌ నేత చిదంబరం విమర్శలు గుప్పించారు. ప్రపంచానికి బోధించే విషయాలను భారత్‌లో పాటించాలని సోమవారం వ్యంగ్యంగా ట్వీట్ చేశారు. బ్రిటన్‌లోని కార్బిస్‌ బేలో ఆదివారం జరిగిన జి-7 సమావేశంలో భాగంగా ‘స్వేచ్ఛాయుత సమాజాలు, ఆర్థిక వ్యవస్థలు’ పేరిట జరిగిన కార్యక్రమంలో మోదీ ప్రసంగిస్తూ.. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా భారత్ ప్రజాస్వామ్యానికి, భావ స్వాతంత్ర్యానికి, స్వేచ్ఛకు కట్టుబడి ఉంటుందని ఉద్ఘాటించారు. ఆధిపత్యం, ఉగ్రవాదం, హింసాత్మక తీవ్రవాదం, అసత్య సమాచారం, ఆర్థిక దౌర్జన్యాలతో ఎదురయ్యే ముప్పుల నుంచి భాగస్వామ్య విలువలను పరిరక్షించడంలో జి-7 కూటమికి, మిత్ర దేశాలకు భారత్ అండదండలు అందిస్తుందని ప్రధాని భరోసా ఇచ్చారు. దీనిపై చిదంబరం ట్విటర్ వేదికగా స్పందించారు.

8. Corona: మహమ్మారి వేళ..మాడ్యులర్ ఆస్పత్రులు

కరోనా వేళ దేశంలో వైద్య సౌకర్యాల లేమి కొట్టొచ్చినట్టుగా కనిపించింది. ఆ లోపాలను సరిదిద్దేందుకు కేంద్రం ఆరోగ్య వ్యవస్థను బలోపేతం చేసేపనిలో పడినట్లు తెలుస్తోంది. దానిలో భాగంగా రానున్న రెండుమూడు నెలల్లో 50 వినూత్న మాడ్యులర్ ఆస్పత్రులను నిర్మించేందుకు ప్రణాళికను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. వీటి ప్రత్యేకత ఏంటంటే.. ఎక్కడికక్కడ విడదీసి, వేరేప్రాంతానికి తరలించి, అక్కడ తిరిగి అమర్చుకునే సౌలభ్యం ఉండటం. ఈ మేరకు ఓ ఆంగ్ల మీడియా కథనం పేర్కొంది. ఇప్పటికే ఉన్న ఆస్పత్రులకు అనుబంధంగా ఈ మాడ్యులర్ ఆస్పత్రులను ఏర్పాటు చేయనున్నారు. సుమారు రూ.3 కోట్ల అంచనాతో 100 పడకలతో నిర్మించ తలపెట్టిన ఒక్కో ఆస్పత్రిలో ఐసీయూ సౌకర్యం కూడా ఉండనుంది.

9. Wuhan lab: ల్యాబ్‌లో గబ్బిలాల పెంపకం..!

వుహాన్‌ ల్యాబ్‌పై అనుమానపు మేఘాలు మరింతగా అలముకొంటున్నాయి. కొవిడ్‌కు సంబంధించిన మరో ఆసక్తికర అంశం వెలుగులోకి వచ్చింది. ఈ ల్యాబ్‌ ప్రారంభ సమయంలోని ఒక వీడియోను స్కైన్యూస్‌ ఛానల్‌ ప్రసారం చేసింది. దీంతో ఇక్కడి నుంచే కరోనా వైరస్‌ లీకయ్యిందన్న వాదనకు మరింత బలం చేకూరింది. తాజాగా స్కైన్యూస్‌ ఛానల్‌ 2017లో వుహాన్‌ ల్యాబ్‌ ప్రారంభం సందర్భంగా చైనీస్‌ అకాడమీ ఆఫ్‌ సైన్సెస్‌ చిత్రీకరించిన వీడియోను సంపాదించింది. దీనిలో శాస్త్రవేత్తలు బోన్లలో గబ్బిలాలను పెంచుతున్న దృశ్యాలు ఉన్నాయి. అంతేకాదు వారు గబ్బిలాలను పట్టుకొని వాటికి పురుగులను ఆహారంగా ఇస్తున్నట్లు కూడా  ఆ వీడియోలో కనిపిస్తోంది.

10. Stock Market: నష్టాల నుంచి కొత్త రికార్డుల్లోకి..

తీవ్ర ఊగిసలాట నడుమ దేశీయ మార్కెట్లు సోమవారం స్వల్ప లాభాలను దక్కించుకున్నాయి. అయినప్పటికీ సరికొత్త రికార్డులను నెలకొల్పాయి.  52,492 పాయింట్ల వద్ద మొదలైన బాంబే స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ సెన్సెక్స్‌ ఒక దశలో 51,936 పాయింట్ల వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. అయితే మధ్యాహ్నం తర్వాత కోలుకున్న సూచీ మళ్లీ 52,591 పాయింట్ల గరిష్ఠాన్ని చేరింది. చివరకు 76.77 పాయింట్ల స్వల్ప లాభంతో 52,551.53 వద్ద కొత్త రికార్డులో ముగిసింది. జాతీయ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ నిఫ్టీ 15,600 - 15,830 పాయింట్ల మధ్య కదలాడింది. మార్కెట్‌ ముగిసే సమయానికి 12.50 పాయింట్ల అత్యల్ప లాభంతో 15,811.85 వద్ద తాజా జీవనకాల గరిష్ఠ స్థాయిలో స్థిరపడింది. 

ఇ-ఫైలింగ్ పోర్టల్‌.. వారమైనా తప్పని తంటాల్‌!


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని