Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లోని టాప్ 10 వార్తలు

తాజా వార్తలు

Published : 31/07/2021 16:56 IST

Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లోని టాప్ 10 వార్తలు

1. కేటాయించినవే ఖర్చు చేయలేదు.. లక్షల కోట్లంటే ఎలా నమ్మాలి?

దళితబంధు పేరుపెట్టి ముఖ్యమంత్రి కేసీఆర్ దళితుల్ని మోసం చేస్తున్నారని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ మంత్రి గీతారెడ్డి ఆరోపించారు. దళితులకు కేసీఆర్‌ ఇచ్చిన హామీలు ఏవీ నెరవేరలేదని అన్నారు. ‘ఎస్సీ-ఎస్టీ సబ్ ప్లాన్ మారుస్తా అని చెప్పి మార్చలేదు.ఏడేళ్లుగా రూ.85వేల కోట్లు కేటాయించి.. రూ.47వేల కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. రూ.38వేల కోట్ల సబ్ ప్లాన్ నిధులు ఎక్కడికి పోయాయో ఎవ్వరికీ తెలియదు. దళితులకు బడ్జెట్‌లో కేటాయించిన నిధులే పూర్తిగా ఖర్చు చేయని కేసీఆర్.. లక్షల కోట్లు పెడుతా అంటే ఎలా నమ్మాలి?’ అని ప్రశ్నించారు.

2. ఆగస్టు 9 నుంచి పాక్షికంగా ప్రత్యక్ష విచారణ

ఆగస్టు 9వ తేదీ నుంచి పాక్షికంగా ప్రత్యక్ష విచారణ ప్రారంభించాలని హైకోర్టు నిర్ణయించింది. ఆగస్టు 9 నుంచి సెప్టెంబరు 9వ తేదీ వరకు పాక్షికంగా కేసుల ప్రత్యక్ష విచారణ చేపట్టాలని ఉన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. ప్రతి రోజూ ఒక ధర్మాసనం, ఒక సింగిల్ బెంచ్ ప్రత్యక్ష విచారణ చేపట్టాలని సూచించింది. వ్యాక్సిన్ వేసుకున్న న్యాయవాదులనే విచారణకు అనుమతించాలని పేర్కొంది. వాదించాల్సిన కేసులు ఉన్న న్యాయవాదులు మాత్రమే విచారణకు హాజరుకావాలని ఉన్నత న్యాయస్థానం తెలిపింది.

3. కొంతమంది పాజిటివ్‌ వచ్చినా బయట తిరుగుతున్నారు: డీహెచ్ శ్రీనివాస్‌

తెలంగాణలో కరోనా అదుపులోనే ఉందని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ సంచాలకులు డా. శ్రీనివాస్‌ తెలిపారు. కోఠిలోని వైద్యారోగ్య శాఖ కార్యాలయంలో డీహెచ్‌ మీడియాతో మాట్లాడారు. సేకండ్ వేవ్ ప్రభావం ఇంకా తగ్గలేదని.. ఖమ్మం, నల్గొండ, కరీంనగర్ జిల్లా్ల్లో కేసులు అధికంగా ఉన్నాయన్నారు. ఖమ్మం జిల్లా కూసుమంచి గ్రామంలో ఒకేసారి భారీగా కేసులు నమోదయ్యాయని పేర్కొన్నారు. పాజిటివ్ వచ్చిన వారు ఐసోలేషన్‌లో ఉండకుండా ఇష్టారీతిన బయట తిరుగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 9 జిల్లాల్లో కేసులు ఎక్కువగా ఉన్నాయన్నారు.

4. ‘సీరమ్‌’ ఛైర్మన్‌కు లోక్‌మాన్య తిలక్‌ జాతీయ పురస్కారం

దేశంలో ప్రముఖ వ్యాక్సిన్‌ తయారీ సంస్థ సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా ఛైర్మన్‌ డాక్టర్‌ సైరస్‌ పూనావాలా ప్రతిష్ఠాత్మక పురస్కారానికి ఎంపికయ్యారు. ఈ ఏడాది లోకమాన్య తిలక్‌ జాతీయ పురస్కారాన్ని ఆయనకు ప్రదానం చేయనున్నట్టు లోక్‌మాన్య తిలక్‌ ట్రస్టు అధ్యక్షుడు దీపక్‌ తిలక్‌ ప్రకటించారు. కరోనా మహమ్మారి సమయంలో ఎంతోమంది ప్రాణాల్ని కాపాడేందుకు కొవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ ఉత్పత్తిలో ఆయన చేసిన కృషికి గుర్తింపుగా సన్మానించనున్నట్టు పేర్కొన్నారు.

5. స్త్రీ, పురుషుల్లో వేర్వేరుగా ఉంటాయా?

కరోనా వైరస్‌ను నిర్ధారించడంలో లక్షణాలను పసిగట్టడమే అత్యంత కీలకం. ఇవి ఒక్కో వ్యక్తిలో ఒక్కో విధంగా కనిపిస్తున్నాయని నిపుణులు పేర్కొంటున్న విషయం తెలిసిందే. తాజాగా ఇవి వయసుతో పాటు స్త్రీ, పురుషుల్లోనూ వేర్వేరుగా ప్రభావం చూపిస్తున్నట్లు బ్రిటన్ పరిశోధకుల అధ్యయనంలో వెల్లడైంది. తాజా పరిశోధన పత్రం ప్రముఖ అంతర్జాతీయ జర్నల్‌ ది లాన్సెట్‌ డిజిటల్‌ హెల్త్‌లో ప్రచురితమైంది. వివిధ వయసుల వారితో పాటు స్త్రీ, పురుషుల్లో కరోనా వైరస్‌ ఏవిధమైన లక్షణాలు చూపిస్తుందని తెలుసుకునేందుకు కింగ్స్‌ కాలేజీ లండన్‌ పరిశోధకులు ఓ అధ్యయనం చేపట్టారు.

కొవిడ్‌ రోగి ముఖం వాచిపోయేలా కుట్టిన చీమలు
2లక్షల మందికిపైగా గర్భిణీలకు టీకా

6. సెమీస్‌ పోరులో సింధు ఓటమి..

ఒలింపిక్స్‌ బ్యాడ్మింటన్‌ మహిళల సింగిల్స్‌ విభాగంలో జరిగిన సెమీఫైనల్స్‌లో భారత స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు ఓటమిపాలైంది. చైనీస్‌ తైపీ క్రీడాకారిణి తై జు యింగ్‌ చేతిలో 18-21, 12-21 తేడాతో ఓటమిపాలైంది. మ్యాచ్‌ ప్రారంభంలో కాస్త ఆధిపత్యం చెలాయించిన సింధు తొలి విరామం తర్వాత వెనుకంజలో పడింది. ఈ క్రమంలోనే అనూహ్యంగా పుంజుకున్న తై జు తర్వాత సింధూకూ గట్టి పోటీ ఇచ్చింది. చివరికి తొలి గేమ్‌ను 21-18తో కైవసం చేసుకుంది. అపై మరింత పట్టుదలగా ఆడిన ఆమె రెండో గేమ్‌లోనూ ఏ అవకాశం ఇవ్వలేదు. చివరికి సింధు ఓటమిపాలవ్వక తప్పలేదు.

7. ఇన్వెస్ట‌ర్ల‌కు రెట్టింపు లాభాలు పండించిన `ఐపీఓ`లు

ఇటీవ‌ల ఐపీఓల‌కు వ‌చ్చిన 5 కంపెనీల షేర్లు లిస్టింగ్ తేదీలోనే పెట్టుబ‌డిదారుల పెట్టుబ‌డిని దాదాపు రెట్టింపు చేశాయి. స్టాక్ మార్కెట్ నిపుణుల‌ ప్రకారం.. ఐపీఓల‌లో మాత్ర‌మే పెట్టుబ‌డి పెట్టే పెట్టుబ‌డిదారులు చాలా మందినే ఉన్నారు. ఐపీఓ లిస్ట్ చేయ‌బ‌డిన త‌ర్వాత వారు త‌మ‌కు అందుబాటులో ఉన్న లిస్టింగ్ లాభాల‌తో బ‌య‌ట‌కు వ‌చ్చేస్తారు. వీరికి ప‌బ్లిక్ ఇష్యూ లిస్ట్ అయిన త‌ర్వాత పెట్టిన పెట్టుబ‌డికి  రెట్టింపు లాభాలు అందుబాటులో ఉంటున్నాయి. స్టాక్ మార్కెట్ నిపుణుల అభిప్రాయం ప్ర‌కారం, కంపెనీ ప్ర‌మోట‌ర్లు కోవిడ్‌-19 త‌ర్వాత స్టాక్స్ సూచీలలో లాభాల ప్ర‌యోజ‌నాన్ని పొంద‌డానికి ప్ర‌య‌త్నిస్తున్నారు.

8. ‘సర్కారువారి పాట’ ఫస్ట్‌ నోటీస్‌ వచ్చేసింది!

ఎంతోకాలంగా ఆశగా ఎదురు చూస్తున్న మహేశ్‌బాబు అభిమానులకు సర్‌ప్రైజ్‌ వచ్చేసింది. ఆయన కథానాయకుడిగా పరశురామ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘సర్కారువారి పాట’. కీర్తి సురేశ్‌ కథానాయిక. శనివారం ఈ చిత్రానికి సంబంధించి ‘ఫస్ట్‌ నోటీస్‌’ అంటూ ఈ సినిమాలోని మహేశ్‌లుక్‌ను పంచుకుంది. ఇంతకుముందెన్నడూ లేని విధంగా మహేశ్‌లుక్ అలరిస్తోంది. పొడవాటి జుట్టు, మెడపై రూపాయి కాయిన్‌ టాటూతో ఎరుపు రంగు కారులోని నుంచి మహేశ్‌ స్టైల్‌గా దిగుతున్న ఈ ఫొటో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల వేదికగా ట్రెండ్‌ అవుతోంది.

9. పోలీసు వ్యవస్థపై ఉన్న వ్యతిరేక భావనను తొలగించండి..!

పోలీసు వ్యవస్థపై ప్రజల్లో నెలకొన్న వ్యతిరేక భావనను తొలగించాల్సిన బాధ్యత ప్రొబెషనరీ ఐపీఎస్‌లపై ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఉన్నతాధికారులుగా మీరు చేసే ప్రతిపనిలో ‘దేశమే ముందు, ఎప్పటికీ ముందు (Nation First, Always First)’ అనే భావన ప్రతిబింబించాలని అన్నారు. హైదరాబాద్‌లోని సర్ధార్‌ వల్లభాయ్‌ పటేల్ నేషనల్‌ పోలీస్‌ అకాడమీలో శిక్షణ పూర్తి చేసుకున్న ప్రొబెషనరీ ఐపీఎస్‌లను ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాని మోదీ.. వారికి పలు సూచనలు చేశారు.

10. ప్రపంచ నంబర్‌వన్‌కు పతకం దక్కలేదు..!

ప్రపంచ నంబర్‌వన్‌ టెన్నిస్‌ స్టార్‌, సెర్బియా ఆటగాడు నొవాక్‌ జకోవిచ్‌కు టోక్యో ఒలింపిక్స్‌లో మరోసారి నిరాశే ఎదురైంది. నిన్న పురుషుల సింగిల్స్‌ సెమీస్‌లో జర్మనీ క్రీడాకారుడు అలెగ్జాండర్‌ జ్వెరెవ్‌ చేతిలో పరాజయం చవిచూసిన జకో.. కాంస్యం పోరులోనూ ఓటమిపాలయ్యాడు. శనివారం కారెన్‌ బుస్టా(స్పెయిన్‌)తో జరిగిన మ్యాచ్‌లో 4-6, 7-6(6), 3-6 తేడాతో ఓడి.. పతకం కోల్పోయాడు. అయితే మిక్స్‌డ్‌ డబుల్స్‌లో కాంస్యం కోసం నీనా స్టొజనోవిచ్‌తో కలిసి ఈ సాయంత్రం ఆస్ట్రేలియా జోడీపై పోరాడనున్నాడు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని