Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లోని టాప్ 10 వార్తలు

తాజా వార్తలు

Published : 18/09/2021 16:55 IST

Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లోని టాప్ 10 వార్తలు

1. నాకూ డ్రగ్స్‌కీ ఏం సంబంధం? ఏ పరీక్షకైనా నేను సిద్ధమే!

రాష్ట్రంలో ప్రతిపక్షాలకు ఏ పనిలేకే తమపై బురదజల్లుతున్నాయని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి, తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ అన్నారు. తెలంగాణ భవన్‌లో మీడియా ప్రతినిధులతో చిట్‌చాట్‌లో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. హుజూరాబాద్‌ ఉప ఎన్నికకు అంత ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం లేదన్న ఆయన.. అక్కడ తెరాస ఎలాగూ గెలుస్తుందని విశ్వాసం వ్యక్తంచేశారు. నాగార్జున సాగర్‌లో కాంగ్రెస్‌ సర్వశక్తులూ ఒడ్డినా.. సీనియర్‌ నేత జానారెడ్డి ఓడిపోయిన విషయాన్ని గుర్తుచేశారు. నాకూ డ్రగ్స్‌కీ ఏం సంబంధం.. ఏ పరీక్షకైనా నేను సిద్ధం. ఎవరో ఏదో చేస్తే నాకేం సబంధం? అని ప్రశ్నించారు. 

2. నా రాజీనామా కోరడానికి అయ్యన్నపాత్రుడు ఎవరు?: సుచరిత

ప్రజల తీర్పును తెదేపా నేతలు గౌరవించట్లేదని ఏపీ హోం మంత్రి సుచరిత అన్నారు. సీఎం జగన్‌పై అయ్యన్న పాత్రుడు వ్యాఖ్యలు సరిగా లేవని తెలిపారు. తాడేపల్లిలో ఆమె మీడియాతో మాట్లాడారు. ‘‘అయ్యన్న పాత్రుడు మాట్లాడుతున్న భాష ఏంటి. తెదేపా హయాంలోనే వంగవీటి రంగాను హత్య చేశారు. రంగాను హత్య చేసినప్పుడు శాంతిభద్రతలు గుర్తుకు రాలేదా?జగన్‌పై కోడి కత్తితో హత్యాయత్నం చేస్తే ఎగతాళి చేశారు. నా రాజీనామా కోరడానికి అయ్యన్న పాత్రుడు ఎవరు?సీఎం జగన్‌ ఆదేశిస్తే ఏ క్షణమైనా రాజీనామా చేస్తా’ అని వ్యాఖ్యానించారు. 

నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడు ఇంటి ముట్టడికి యత్నం

3. నగరంలో రేపు ట్రాఫిక్‌ ఆంక్షలు.. మద్యం దుకాణాలు బంద్‌

గణేష్‌ నిమజ్జనం దృష్ట్యా హైదరాబాద్‌లో పోలీసులు రేపు ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు.  ఆదివారం ఉదయం 6 గంటల నుంచి సోమవారం ఉదయం వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని పోలీసులు స్పష్టంచేశారు. శనివారం అర్ధరాత్రి నుంచే అంతరాష్ట్ర, జిల్లాల నుంచి లారీల ప్రవేశాలపై నిషేధం విధిస్తున్నట్టు వెల్లడించారు. నిమజ్జనం దృష్ట్యా నగరంలో తిరిగే ఆర్టీసీ బస్సులను సైతం పలుచోట్ల దారి మళ్లిస్తున్నామన్నారు. విమానాశ్రయం, రైల్వే స్టేషన్లకు వెళ్లే ప్రయాణికులకు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు.

4. నిన్న ఆ పార్టీకి జ్వరం వచ్చింది.. లాజిక్ ఏంటో ?: మోదీ

ఒక్కరోజులో రికార్డు స్థాయిలో 2.5 కోట్ల టీకా డోసులు వేయడంపై ప్రధాని నరేంద్రమోదీ సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో భాగమైన వైద్యసిబ్బంది, ప్రజలకు ఆయన అభినందనలు తెలియజేశారు. అదే సమయంలో విమర్శలు చేస్తోన్న రాజకీయ పార్టీలకు చురకలు అంటించారు. శనివారం గోవాకు చెందిన వైద్య సిబ్బంది, టీకా లబ్ధిదారులతో ప్రధాని మాట్లాడారు. ‘నేను శాస్త్రవేత్తను కాదు..వైద్యుడిని కాదు. కానీ టీకా వేయించుకున్న వారిలో కొన్ని లక్షణాలు కనిపిస్తాయని విన్నాను. నిన్న భారత్ రికార్డు స్థాయిలో టీకా డోసుల్ని పంపిణీ చేసిన తర్వాత ఒక రాజకీయ పార్టీకి జ్వరం రావడం నేను చూశాను. ఇందులో ఏదైనా లాజిక్ ఉందా..?’ అంటూ టీకా కార్యక్రమంపై వస్తోన్న విమర్శలను మోదీ తిప్పికొట్టారు.

5. Padmanabhaswamy Temple: ఆర్థిక సంక్షోభంలో పద్మనాభుడు

తిరువనంతపురంలోని శ్రీపద్మనాభ స్వామి ఆలయం ఆర్థిక సంక్షోభంలో ఉందని పరిపాలన కమిటీ శుక్రవారం సుప్రీంకోర్టు దృష్టికి తీసుకువచ్చింది. తగినంత ఆదాయం రాకపోవడం వల్ల నెలవారీ ఖర్చులకు ఇబ్బందిగా ఉందని తెలిపింది. ప్రతి నెలా ఖర్చులకు రూ.1.25 కోట్లు అవసరం ఉండగా, రూ.60-70 లక్షల ఆదాయం మాత్రమే వస్తోందని పేర్కొంది. అందువల్ల ట్రావెంకోర్‌ రాజకుటుంబికులు నిర్వహిస్తున్న ట్రస్టు నుంచి నిధులు అందేలా చూడాలని కోరింది. రాజకుటుంబీకుల ఆధీనంలోని శ్రీపద్మనాభ స్వామి దేవాలయ ట్రస్టు వ్యవహారాలపై ఆడిట్‌ జరిపించాలని కోరుతూ దాఖలైన వ్యాజ్యం విచారణ సందర్భంగా ఆలయ పరిపాలన కమిటీ తరఫున సీనియర్‌ న్యాయవాది ఆర్‌.బసంత్‌ పై విషయాలు చెప్పారు. 

6. రూ.20కోట్లకు పైగా పన్ను ఎగవేశారు: ఐటీ శాఖ

ప్రముఖ నటుడు సోనూసూద్ రూ.20 కోట్లకు పైగా పన్ను ఎగవేసినట్లు శనివారం ఆదాయపన్ను(ఐటీ) విభాగం వెల్లడించింది. ఇటీవల ఐటీ విభాగం సోనూసూద్ ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. నిన్నటి వరకు మూడురోజులు పాటు ఈ సోదాలు చేపట్టింది. పన్ను ఎగవేత ఆరోపణలతో.. అధికారులు ఆయన ఆర్థిక లావాదేవీలను పరిశీలించారు. ఈ క్రమంలోనే ఐటీ విభాగం నుంచి ప్రకటన వెలువడింది. అలాగే సోనూసూద్ ఫారిన్ కంట్రిబ్యూషన్( రెగ్యులేషన్) యాక్ట్‌ను ఉల్లంఘించారని ఐటీ అధికారులు పేర్కొన్నారు. 

7. అందుకు భారతీయులు అదృష్టవంతులు.. ఇప్పుడే బూస్టర్ డోసు అనైతికం..!

ఇప్పటికీ పలు దేశాల్లో పూర్తి వ్యాక్సినేషన్‌కు కరోనా టీకాలు అందుబాటులో లేవని.. ఈ సమయంలో బూస్టర్ డోసును ప్రారంభించడం అనైతికమని సీరమ్ ఇనిస్టిట్యూట్ సీఈఓ అదర్ పూనావాలా అన్నారు. ఇప్పటికే కొన్ని సంపన్న దేశాలు బూస్టర్ డోసు పంపిణీని మొదలు పెట్టగా.. మరికొన్ని దేశాలు ఆ దిశగా ప్రణాళికలు రచిస్తోన్న సంగతి తెలిసిందే. ‘అభివృద్ధి చెందుతున్న దేశాలు కేవలం 2 నుంచి 3 శాతం మాత్రమే టీకాలు పొందాయి. అభివృద్ధి చెందిన దేశాల్లో వ్యాక్సినేషన్ రేటు 40 నుంచి 50 శాతంగా ఉంది. ఈ సమయంలో బూస్టర్‌ డోసు సరికాదు. ప్రపంచదేశాలు గణనీయమైన స్థాయిలో రెండుడోసులు పొందిన తర్వాత.. అప్పుడు బూస్టర్‌ డోసు ఇవ్వడం గురించి ఆలోచించాలి’ అని పూనావాలా అన్నారు.

8. బెంగాల్‌లో భాజపాకు షాక్‌.. తృణమూల్‌ గూటికి బాబుల్‌ సుప్రియో

పశ్చిమ బెంగాల్‌లో భారతీయ జనతా పార్టీకి మరో షాక్‌ తగలింది. ఆ పార్టీ సిట్టింగ్‌ ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి, బాబుల్‌ సుప్రియో పార్టీని వీడి తృణమూల్‌ కాంగ్రెస్‌ గూటికి చేరారు. టీఎంసీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్‌ బెనర్జీ సమక్షంలో శనివారం పార్టీ కండువా కప్పుకున్నారు. పార్టీలోకి బాబుల్‌ను సాదరంగా ఆహ్వానిస్తున్నట్లు పేర్కొంటూ పార్టీలో చేరిన చిత్రాలను తృణమూల్‌ కాంగ్రెస్‌ ట్వీట్‌ చేసింది. అసన్‌సోల్‌ ఎంపీ అయిన బాబుల్‌ సుప్రియో గతంలో కేంద్ర పర్యావరణ శాఖ మంత్రిగా పనిచేశారు. ఇటీవల మంత్రివర్గ విస్తరణ నేపథ్యంలో ఆయనను పదవి నుంచి తప్పించారు.

9. ధోనీ బౌలర్ల కెప్టెన్‌.. కోహ్లీ ఒక్కసారైనా కప్పు గెలవాలి..!

టీమ్‌ఇండియా మాజీ సారథి మహేంద్రసింగ్‌ ధోనీని టీ20 ప్రపంచకప్‌ టోర్నీకి మెంటార్‌గా నియమించడం మంచి నిర్ణయమని, అది బౌలింగ్‌ బృందానికి ఎంతో ఉపయోగపడుతుందని మాజీ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ అభిప్రాయపడ్డాడు. తాజాగా పీటీఐతో మాట్లాడిన వీరూ అనేక విషయాలపై స్పందించాడు. ‘టీ20 ప్రపంచకప్‌ కోసం టీమ్ మెంటార్‌గా ఉండాలనే ప్రతిపాదనను మహీ అంగీకరించినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అతడు మళ్లీ భారత క్రికెట్‌లోకి రావాలని చాలా మంది కోరుకుంటున్నారు. అలాగే జట్టు మెంటార్‌గా ఎంపికవ్వడం గొప్ప విషయం’ అని పేర్కొన్నారు.

10. అక్టోబరు 10న ‘మా’ ఎన్నికలు.. నిబంధనలివే!

తెలుగు సినీ నటుల సంఘం(MAA) ఎన్నికలకు రంగం సిద్ధమైంది. అక్టోబరు 10వ తేదీన ఎన్నికలు నిర్వహించాలని గతంలో జరిగిన సమావేశంలో నిర్ణయించిన సంగతి తెలిసిందే. కాగా, తాజాగా ‘మా’ ఎన్నికలకు సంబంధించిన తేదీ, నియమ నిబంధనలు, ఇతర విషయాలను అధికారికంగా ప్రకటించారు. అక్టోబర్ 10న ఆదివారం ఉదయం 8గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకూ హైదరాబాద్‌ జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్‌లో పోలింగ్‌ నిర్వహించనున్నట్లు ఎన్నికల అధికారి కృష్ణమోహన్ తెలిపారు. అదే రోజు ఎన్నికల ఫలితాలను వెల్లడించనున్నారు. ఎనిమిది మంది ఆఫీస్ బేరర్స్ 18 మంది ఎగ్జిక్యూటివ్ మెంబర్స్‌తో కూడిన కమిటీకి ఈ ఎన్నికలు జరగనున్నాయి.

పూరి జగన్నాథ్‌, తరుణ్‌ నమూనాల్లో డ్రగ్స్‌ ఆనవాళ్లు లేవు: ఎఫ్ఎస్‌ఎల్‌


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని