Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లోని టాప్ 10 వార్తలు

తాజా వార్తలు

Published : 15/10/2021 16:58 IST

Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లోని టాప్ 10 వార్తలు

1. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సీజేఐ

తిరుమల శ్రీవారిని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న ఆయనకు తితిదే ఈవో జవహర్‌ రెడ్డి, అదనపు ఈవో ధర్మారెడ్డి స్వాగతం పలికారు. స్వామివారి సన్నిధికి చేరుకున్న సీజేఐ తొలుత మూలమూర్తిని దర్శించుకుని... రంగనాయకుల మండపం వద్దకు చేరుకున్నారు. అక్కడ జస్టిస్‌ ఎన్వీ రమణకు వేద పండితులు వేదాశీర్వచనం పలికి శేషవస్త్రంతో సత్కరించారు. స్వామివారి తీర్ధప్రసాదాలను, చిత్ర పటాలను అందజేశారు. సీజేఐతో పాటు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ హిమా కోహ్లి, జస్టిస్ జె.కె.మహేశ్వరి స్వామివారిని దర్శించుకున్నారు.

2. యాదాద్రీశుడిని దర్శించుకున్న సినీదర్శకుడు రాఘవేంద్రరావు

తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహస్వామి సన్నిధిలో విజయదశమి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎస్పీఎఫ్‌ సిబ్బంది ఆయుధ పూజ నిర్వహించారు. కొండ కింద వాహన పూజల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ప్రముఖ సినీ దర్శకుడు రాఘవేంద్రరావు ఉదయం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు ఆశీర్వచనం చేసి స్వామివారి లడ్డూ ప్రసాదం అందజేశారు.

3. సంగం డెయిరీ నూతన ఉత్పత్తులను ఆవిష్కరించిన ధూళిపాళ్ల

మధ్యతరగతి వినియోగదారులను దృష్టిలో పెట్టుకొని వారికి అవసరమైన ఉత్పత్తులను తయారుచేస్తున్నామని సంఘం డెయిరీ ఛైర్మన్‌ ధూళిపాళ్ల నరేంద్ర కుమార్‌ తెలిపారు. గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం వడ్లమూడిలోని సంగం డెయిరీ ఆవరణలో దసరా పండుగను పురస్కరించుకొని ఉస్మానియా సాల్టెడ్‌ బిస్కట్లు, ఫ్లమ్‌ కేక్‌, ఎగ్‌లెస్‌ కేక్‌,  హాయ్‌ అరోమా నెయ్యి 30, 50 గ్రాముల ప్యాకింగ్‌, 5 లీటర్ల ఆవునెయ్యి, గేదె నెయ్యి విడుదల చేశారు.

4. Pelli SandaD Review: రివ్యూ: పెళ్లి సందD

5. పిజ్జా, చిప్స్‌ తింటున్నారా.. తస్మాత్‌ జాగ్రత్త!

పిజ్జా, చిప్స్‌, పేస్ట్రీ వంటి ఫాస్ట్‌ఫుడ్స్‌ను చూడగానే తినేయాలనేపిస్తుంది కదూ! అయితే.. ఈసారి మాత్రం అవి తినాలంటే ఆలోచించాల్సిందే. ఎందుకంటే.... ఇప్పటి వరకూ ఈ హైలీ ప్రాసెస్ట్‌ ఫుడ్స్‌ తింటే బరువు పెరగడం, మధుమేహం, రక్తపోటు వంటి ఆరోగ్య సమస్యలు వస్తాయనే తెలుసు. ఇప్పుడా జాబితాలోకి జ్ఞాపకశక్తి తగ్గే అవకాశం ఉన్నట్లు తాజా పరిశోధనలో తేలింది. బ్రెయిన్‌, బిహేవియర్‌, ఇమ్యూనిటీ జర్నల్‌ ప్రచురించిన అధ్యయనంలో.. హైలీ ప్రాసెస్ట్‌ ఫుడ్స్‌ (నిల్వపదార్థాలు, కొవ్వు శాతం, ఆర్టిఫిషియల్‌ రంగు, ఫ్లేవర్‌ ఉండేవి) తీసుకున్నట్లే అవి మెమొరీ లాస్‌ వచ్చే ప్రమాదం ఉందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. 

6. మన్మోహన్‌ జీ ఆరోగ్య పరిస్థితి మెరుగుపడింది: కాంగ్రెస్‌

మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్ ఆరోగ్యంగా ఉన్నారని, గురువారం కంటే ఆయన ఆరోగ్య పరిస్థితి మెరుగుపడిందని కాంగ్రెస్‌ వెల్లడించింది. ఈ మేరకు శుక్రవారం ఆ పార్టీ సెక్రటరీ ప్రణవ్ ఝా ట్వీట్ చేశారు. ‘మన్మోహన్‌ సింగ్‌జీ ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నారు. నిన్నటికంటే ఆయన ఆరోగ్యం మెరుగుపడింది. ఆయన వేగంగా కోలుకోవాలని మనమంతా కోరుకుందాం. అనవసరమైన ఊహాగానాలకు తావివ్వొద్దు. మాజీ ప్రధాని గోప్యతను మనమంతా గౌరవిద్దాం’ అంటూ ప్రణవ్‌ ఝా వెల్లడించారు.

7. ఆలయాలపై దాడి చేసిన వారిని వదిలేది లేదు: బంగ్లా ప్రధాని

దుర్గా పూజల వేళ బంగ్లాదేశ్‌లో మత ఘర్షణలకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆ దేశ ప్రధాని షేక్‌ హసీనా హామీ ఇచ్చారు. దుండగులు ఏ వర్గానికి చెందినవారైనా వదిలిపెట్టేది లేదన్నారు. ‘‘కుమిల్లాలో జరిగిన ఘటనపై క్షుణ్నంగా దర్యాప్తు చేస్తాం. కారకులను వదిలిపెట్టేది లేదు. వారు ఏ మతానికి చెందినవారైనా కఠిన చర్యలు తప్పవు. వారిని పట్టుకొని కఠినంగా శిక్షిస్తాం. ఈ ఘటనపై ఇప్పటికే చాలా సమాచారం అందింది. ఇది సాంకేతికయుగం. ఈ ఘటనకు కారణమైన ప్రతిఒక్కరినీ సాంకేతికత సాయంతో వీలైనంత త్వరగా పట్టుకొని తీరతాం’’ అని ఢాకాలోని ఢాకేశ్వరీ జాతీయ ఆలయంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతూ హసీనా ఈ వ్యాఖ్యలు చేశారు. 

8. ఖైదీ నెం. 956 షారుక్‌ తనయుడు ఆర్యన్‌ ఖాన్‌

బాలీవుడ్‌ నటుడు షారుక్‌ ఖాన్‌ కుమారుడు ఆర్యన్‌ ఖాన్‌ తరచూ డ్రగ్స్‌ తీసుకుంటుంటారని మాదకద్రవ్యాల నియంత్రణ సంస్థ (ఎన్‌సీబీ) కోర్టుకు తెలిపిన సంగతి తెలిసిందే. ఇక బెయిల్‌ ఇవ్వొద్దని వాదించింది. దీంతో బెయిల్‌ పిటిషన్‌పై తీర్పును ఈ నెల 20కి కోర్టు వాయిదా వేసింది. అప్పటివరకూ ఆర్యన్‌ జైల్లోనే ఉండనున్నాడు. ఇక జైల్లో  ఖైదీగా ఉన్న ఆర్యన్‌కు అధికారులు నెం.956ని కేటాయించారు. ఇంటి నుంచి తండ్రి షారుక్‌ పంపిన రూ.4500 మనీ ఆర్డర్‌ను అందుకున్నాడు. ముంబయిలోని ఆర్థర్ రోడ్ జైలులోని క్యాంటీన్ ఖర్చులు (ఆహారంతో పాటు ఇతరత్రా అవసరాలు) కోసం ఈ మొత్తాన్ని వినియోగించనున్నాడు.

9. రాజకీయ నేపథ్యం లేకున్నా.. 20ఏళ్లుగా ప్రభుత్వాధినేతగా!

ఎలాంటి రాజకీయ నేపథ్యం, వంశపారంపర్య మద్దతు లేకున్నా దేశానికి సేవ చేసే అవకాశం ప్రజలు కల్పించారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఓ సామాన్య కుటుంబం నుంచి వచ్చిన తనకు గుజరాత్‌ సీఎం నుంచి నేడు ప్రధానమంత్రిగా సేవలందించే భాగ్యం కల్పించారన్నారు. సూరత్‌లో ఓ బాలుర వసతి గృహం శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న మోదీ.. కేవలం ప్రజల ఆశీస్సులతోనే గడిచిన 20ఏళ్లుగా ప్రభుత్వాధినేతగా కొనసాగుతున్నానని అన్నారు.

10. చూడు పంత్‌.. నాకింకా చాలా మంది కీపర్లు ఉన్నారు: కోహ్లీ

రాబోయే టీ20 ప్రపంచకప్‌లో సిక్సర్లతో చెలరేగాలని టీమ్‌ఇండియా సారథి విరాట్‌ కోహ్లీ యువ కీపర్‌ రిషభ్‌ పంత్‌కు సూచించాడు. ధనాధన్‌ బ్యాటింగ్‌తో జట్టుకు విజయాలందించాలని కోరాడు. లేదంటే తనకు చాలా మంది కీపర్లు ఉన్నారని హెచ్చరించాడు. దీనికి స్పందించిన యువ బ్యాట్స్‌మన్‌, కీపర్‌.. అందుకు తగ్గట్టే తాను సన్నద్ధమవుతున్నానని చెప్పాడు. రెండు రోజుల్లో టీ20 ప్రపంచకప్‌ ప్రారంభమవుతున్న నేపథ్యంలో టోర్నీ ప్రసార హక్కుదారులు తాజాగా ఓ సరదా యాడ్‌ రూపొందించారు. అందులో కోహ్లీ, పంత్‌ మధ్య ఇలాంటి సరదా సంభాషణ చోటుచేసుకుంది.

తొమ్మిదేళ్ల క్రితం షాక్‌ ఇచ్చారు... ఇప్పుడు ఏం చేస్తారో?


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని