Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లోని టాప్ 10 వార్తలు

తాజా వార్తలు

Updated : 06/08/2021 09:12 IST

Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లోని టాప్ 10 వార్తలు

1. నిండు కుండకు చిల్లు

పులిచింతల సాగునీటి ప్రాజెక్టులో గురువారం తెల్లవారు జామున అసాధారణ రీతిలో గేటు విరిగిపోయి ప్రవాహంలో పడిపోయింది. ట్రునియన్‌ గడ్డర్‌కు అనుసంధానిస్తూ ఏర్పాటు చేసిన దాదాపు 250 టన్నుల బరువున్న 16వ నంబరు గేటు ఒక్కసారిగా ప్రవాహ ధాటికి విరిగిపోయింది. ఆ గేటును అనుసంధానించే యాంకర్‌ తెగిపోయి ఉన్నట్లు కనిపిస్తోంది. నీటిని దిగువకు వదిలే క్రమంలో గేటును నాలుగు అడుగుల మేర పైకి లేపినప్పుడు ఈ ఘటన చోటుచేసుకుంది.  పులిచింతల ప్రాజెక్టు వినియోగంలోకి వచ్చిన ఏడేళ్లకే గేటు విరిగిపోవడం గమనార్హం.

నీటి వృథా.. పెద్ద వ్యథే!

2. తప్పు మంత్రివర్గానిది.. శిక్ష ఉద్యోగులకా?

మంత్రివర్గం చేసిన తప్పిదాలకు ఉద్యోగులను బాధ్యులను చేసి శిక్ష వేయడాన్ని తెదేపా తీవ్రంగా ఖండిస్తున్నట్లు శాసన మండలిలో ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు తెలిపారు. వైకాపా నేతల అవినీతి నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే సెక్రటేరియేట్‌ ఉద్యోగులపై చర్యలు తీసుకున్నారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వ నిధులకు మంత్రివర్గం ట్రస్టీనే తప్ప యజమాని కాదనే విషయం గుర్తించాలని గురువారం ఒక ప్రకటనలో ఆయన సూచించారు. ప్రభుత్వ నిధులంటే ప్రజాధనమని, దాన్ని ఖర్చు చేసేందుకు నిబంధనలుంటాయని పేర్కొన్నారు.

3. ‘కొవాగ్జిన్‌’కు హంగేరీ నుంచి జీఎంపీ గుర్తింపు

భారత్‌ బయోటెక్‌కు చెందిన ‘కొవాగ్జిన్‌’ టీకాకు హంగేరీ నుంచి జీఎంపీ (గుడ్‌ మానుఫ్యాక్చరింగ్‌ ప్రాక్టీసెస్‌) గుర్తింపు పత్రం లభించింది. ‘‘హంగేరీ లోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫార్మసీ అండ్‌ న్యూట్రిషన్‌ నుంచి ఈ గుర్తింపు లభించింది’’ అని భారత్‌ బయోటెక్‌ ట్వీట్‌ చేసింది. ఈ పత్రం యూడ్రోజీఎండీపీ డేటాబేస్‌లో కనిపిస్తుందని పేర్కొంది. ఈ నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో ‘కొవాగ్జిన్‌’కు అత్యవసర అనుమతి (ఈయూఏ) కోసం దరఖాస్తు చేయనున్నట్లు వివరించింది.

4. పోలవరం నిర్వాసిత కుటుంబాలు లక్షకు పైనే

పోలవరం ప్రాజెక్టు కింద నిర్వాసిత కుటుంబాలు 1,06,006 ఉండగా ఇప్పటివరకూ 4,283 కుటుంబాలకే పునరావాసం కల్పించినట్లు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తమకు సమాచారం అందించిందని కేంద్ర జల్‌శక్తి మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ తెలిపారు. ఈ ప్రాజెక్టు నిర్మాణం, నిర్వాసితుల పునరావాసం, పరిహారం అందించే అంశంపై తెదేపా ఎంపీ కె.రామ్మోహన్‌ నాయుడు గురువారం లోక్‌సభలో అడిగిన లిఖితపూర్వక ప్రశ్నకు ఆయన సమాధానం ఇచ్చారు. ప్రాజెక్టు సాగునీటి విభాగ నిర్మాణం, భూసేకరణ, సహాయ, పునరావాసాల కోసం చేసే ఖర్చును 2014 ఏప్రిల్‌ 1 నుంచి తిరిగి చెల్లిస్తున్నట్లు చెప్పారు.

5. పార్లమెంట్‌లో తెలంగాణ సమాచారం

దేశంలోని 736 జలవనరులను రూ.10,211 కోట్లతో పునరుద్ధరించనున్నట్లు కేంద్ర జల్‌శక్తి శాఖ సహాయమంత్రి ప్రహ్లాద్‌సింగ్‌ పటేల్‌ గురువారం లోక్‌సభలో వెల్లడించారు. జలవనరుల పునరుద్ధరణ, అభివృద్ధి పథకం (డ్రిప్‌) కింద ఈ పనులు చేపట్టనున్నామని, వీటిలో 227 ప్రాజెక్టులు 100 ఏళ్లకుపైబడినవి కూడా ఉన్నాయని వివరించారు. రూ.545 కోట్లతో 29 ప్రాజెక్టులకు మరమ్మతులు చేపట్టాలని నిర్ణయించామని చెప్పారు. పునరుద్ధరిస్తున్న వాటిలో తెలంగాణలో 18, ఏపీలో 5 ప్రాజెక్టులు 100 ఏళ్లకు పైబడినవి ఉన్నట్లు తెలిపారు.

6. హాకీ హిట్టు..దేశం ఊగేట్టు

భారత పురుషుల హాకీ జట్టు చరిత్ర సృష్టించింది. గత వైభవపు మధుర స్మృతులను గుర్తు చేస్తూ టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకాన్ని గెలుచుకుంది. గురువారం ఆఖరి క్షణం వరకు హోరాహోరీగా సాగిన కాంస్య పతక పోరులో భారత్‌.. ఒత్తిడిని తట్టుకుంటూ 5-4తో జర్మనీని ఓడించింది. గోల్‌కీపర్‌ శ్రీజేశ్‌ తన అసమాన పోరాటంతో భారత్‌కు హీరోగా నిలిచాడు. ముఖ్యంగా చివరి సెకన్లలో అతడి పట్టుదల అందరినీ ఆకట్టుకుంది.

కాంస్యం మిస్‌.. హాకీ అమ్మాయిల ఓటమి.. ఆటైతే బంగారమే!

7. పన్నుల కన్నా నోట్ల ముద్రణే మేలు: అభిజిత్‌

ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలపై పన్నుల భారం వేయకుండా, నోట్లను ముద్రించడమే సరైన మార్గమని ప్రముఖ ఆర్థికవేత్త, నోబెల్‌ గ్రహీత అభిజిత్‌ బెనర్జీ అభిప్రాయపడ్డారు. ఇంధనం, ఇతర వస్తువులపై కేంద్రం పదేపదే సెస్సులు పెంచడంపై గురువారం ఆయనను ప్రశ్నించినప్పుడు అది సరైన విధానం కాదని అన్నారు. బడ్జెట్‌ లోటును తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తోందని, కానీ ఆర్థిక రంగ పురోగతి మందగించినందున ప్రభుత్వమే విరివిగా నిధులు ఖర్చు చేయాల్సి ఉంటుందని చెప్పారు.

8. వెనకటి తేదీ నుంచి పన్నుండదు!

వొడాఫోన్‌, కెయిర్న్‌ ఎనర్జీల విషయంలో ఎదురుదెబ్బలు తగలడంతో కేంద్ర ప్రభుత్వం ‘వెనకటి తేదీ నుంచి పన్ను చెల్లించాలనే నోటీసులకు’ స్వస్తి పలకాలని భావించింది. అందుకోసం ఆదాయపు పన్ను చట్టానికి సవరణలు చేయనుంది. ఇందు కోసమే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ గురువారం లోక్‌సభలో ‘ద టాక్సేషన్‌ లాస్‌(అమెండ్‌మెంట్‌) బిల్‌, 2021’ను ప్రవేశపెట్టారు. దీని ద్వారా 2012 మే 28 కి ముందు జరిగిన భారత ఆస్తుల పరోక్ష బదిలీ లావాదేవీలపై జారీ చేసిన పన్ను నోటీసులను వెనక్కి తీసుకోవచ్చు. ఈ కేసుల్లో ఏవైనా రిఫండ్‌ మొత్తాలున్నా, వాటిని వడ్డీలేకుండా చెల్లించడానికి సైతం ప్రభుత్వం ప్రతిపాదించింది. 

9. పెగాసస్‌ తీవ్రమైన విషయమే..

ఇజ్రాయెల్‌కు చెందిన పెగాసస్‌ స్పైవేర్‌ ద్వారా గూఢచర్యానికి పాల్పడుతున్నారన్న వార్తలు నిజమే అయితే అది తీవ్రమైన విషయమేనని సుప్రీంకోర్టు గురువారం అభిప్రాయపడింది. దీనిపై దాఖలైన తొమ్మిది వ్యాజ్యాలపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ, జస్టిస్‌ సూర్యకాంత్‌లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ విషయమై ఇంకా స్పష్టత రావాల్సి ఉన్నందున కేంద్రానికి ఎలాంటి నోటీసులూ ఇవ్వలేదు. ఒక పిటిషనర్‌ ఈ కేసులో ప్రధాని నరేంద్రమోదీని వ్యక్తిగతంగా కక్షిదారునిగా పేర్కొనడంపై అభ్యంతరం తెలిపింది. దావాల పత్రాలను కేంద్ర ప్రభుత్వానికి పంపించాలని పిటిషనర్లకు సూచించింది. తదుపరి విచారణను ఈ నెల పదో తేదీకి వాయిదా వేసింది.

10. టీకా నూనె పేరిట రూ.11.68 కోట్లు దోచేశారు

ఆగ్రో మెటాజైన్‌ అనే నూనె రాయగఢ్‌లో ఉందని దాన్ని పంపితే రూ.కోట్లలో లాభం వస్తుందంటూ సైబర్‌ నేరస్థులు హైదరాబాద్‌కు చెందిన వైద్యుడిని మోసం చేశారు. హైదరాబాద్‌కు చెందిన డాక్టర్‌ చంద్రశేఖర్‌ రావు(82) అమెరికాలో స్థిరపడ్డారు. అమీర్‌పేటలోని తన ఇంటికి ఏటా వచ్చి కొద్ది రోజులు గడిపి వెళ్తున్నారు. ఈ క్రమంలోనే ఈ ఏడాది మార్చిలో అమెరికా నుంచి వచ్చారు. ఆయనకు బెంజిమెన్‌ పేరుతో నేరస్థుడు ఈ-మెయిల్‌ పంపించాడు.  నూనెను కొనేందుకు లక్ష్మి సూచించిన ఖాతాల్లో మార్చినుంచి మేవరకు దశల వారీగా 16.25 లక్షల డాలర్లు(రూ.11.68 కోట్లు) నగదు బదిలీ చేశారు. ఇంకా నగదు బదిలీ చేయాలని డిమాండ్‌ చేస్తుండడంతో బాధితుడు గురువారం సైబర్‌క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని