Top Ten News @ 9 PM
close

తాజా వార్తలు

Published : 06/05/2021 20:56 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Top Ten News @ 9 PM

1. చంద్రబాబుకు బాధ్యత అప్పగించండి: పట్టాభి

సీఎం పదవి నుంచి జగన్‌ వారం రోజులు తప్పుకుని ప్రతిపక్ష నేత చంద్రబాబుకు బాధ్యత అప్పగిస్తే కరోనా నుంచి రాష్ట్రాన్ని ఎలా గట్టెక్కించాలో చేసి చూపిస్తారని తెదేపా నేత పట్టాభి ప్రభుత్వానికి సవాల్‌ విసిరారు. చంద్రబాబు అధికారంలో ఉంటే పరిస్థితులు మరింత దిగజారేవంటూ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన విమర్శలను ఆయన తిప్పికొట్టారు. వారంపాటు అధికారం అప్పగిస్తే చంద్రబాబు సెట్‌రైట్‌ చేస్తారన్నారు. హుద్‌హుద్‌ తుపాను, ఉత్తరాఖండ్‌ వరదల సమయంలో చంద్రబాబు ఏవిధంగా సేవలందించారో ప్రజలు చూశారన్నారు. 

10 రోజుల్లో 14మంది ఉద్యోగులు మృతి

ఏపీకి చేరిన కొవిషీల్డ్‌ టీకా డోసులు

2. బఫర్ స్టాక్ తగ్గకుండా చూసుకోవాలి: నిరంజన్‌రెడ్డి

ఈ ఏడాది రాబోయే వానాకాలం సీజన్‌ కోసం 25.50 లక్షల మెట్రిక్ టన్నుల రసాయన ఎరువులను కేంద్ర ప్రభుత్వం కేటాయించిందని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో జూన్ 1 నుంచి ప్రారంభం కానున్న ఖరీఫ్‌కు సంబంధించి దక్షిణ మధ్య రైల్వే, ఎరువుల కంపెనీల ప్రతినిధులు, టీఎస్‌ మార్క్‌ఫెడ్‌ సంస్థ అధికారులతో ఎరువుల సరఫరా, నిల్వపై మంత్రి ఆన్‌లైన్‌లో సమీక్షించారు. కేంద్రం కేటాయించిన నిల్వలు, వానాకాలం పంట సాగు విస్తీర్ణం, డిమాండ్ వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు. 

3. AP: కరోనాతో 72మంది మృతి

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. రాష్ట్రంలో సెకండ్‌ వేవ్‌ మొదలైన తర్వాత వరుసగా నాలుగో రోజు 20వేలకు పైగా కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. గడిచిన 24 గంటల వ్యవధిలో రాష్ట్ర వ్యాప్తంగా 1,10,147 పరీక్షలు నిర్వహించగా.. 21,954 కేసులు పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యాయి. 72 మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం 13,353 మంది ప్రస్తుతం కొవిడ్‌ సెంటర్‌లో చికిత్స పొందుతున్నట్లు ఆరోగ్యశాఖ కార్యదర్శి అనిల్‌ సింఘాల్‌ తెలిపారు. 

4. 34 మందితో తమిళనాడు మంత్రివర్గం

తమిళనాడు తాజా అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన డీఎంకే పార్టీ  నూతన ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు వడివడిగా అడుగులు వేస్తోంది. మొత్తం 234 స్థానాలకు గానూ 133 చోట్ల  విజయం సాధించిన డీఎంకే స్టాలిన్‌ నేతృత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది.  తాజాగా 34 మంది మంత్రులతో ప్రభుత్వం ఏర్పాటు చేయనున్నట్లు డీఎంకే గురువారం ప్రకటన విడుదల చేసింది.  వీరంతా శుక్రవారం ప్రమాణస్వీకారం చేయనున్నారు. అయితే కీలక శాఖలను మాత్రం స్టాలిన్‌ తనవద్దే ఉంచుకున్నట్లు సమాచారం. 

5. అబ్బాయి మెడలో తాళి.. విచిత్రంగా ఉంది కదూ..!

వివాహం జరిగేటప్పుడు అమ్మాయి మెడలో అబ్బాయి తాళికట్టడం సంప్రదాయం. కానీ మహారాష్ట్రలో ఓ జంట మాత్రం వినూత్నంగా పెళ్లి చేసుకొని వార్తల్లో నిలిచింది. తరతరాలుగా వస్తున్న సంప్రదాయానికి భిన్నంగా తనూజ, శార్దూల్‌ కదం ఒకరికొకరు మంగళసూత్రాలను మార్చుకున్న ఈ వింత ఘటన పుణెలో వెలుగులోకి వచ్చింది. స్త్రీ, పురుషులిద్దరూ సమానమేనని, లింగ సమానత్వాన్ని చాటేందుకే తానీ నిర్ణయం తీసుకున్నానంటున్న ఆ యువకుడిని సామాజిక మాధ్యమాల్లో కొందరు ట్రోల్‌ చేస్తుండగా.. మరికొందరు శెభాష్‌ అంటూ మెచ్చుకొంటున్నారు. 

6. రూ.5.5లక్షల కోట్లతో భారీ ఉద్దీపన అవసరం!

కరోనా మహమ్మారి విజృంభణతో నెలకొన్న సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు భారత ఆర్థిక ప్రతిస్పందన నామమాత్రంగానే ఉందని తాజా నివేదిక వెల్లడించింది. ఈ సంక్షోభాన్ని పూర్తిస్థాయిలో ఎదుర్కోవాలంటే రూ.5.5లక్షల కోట్ల ఉద్దీపన ప్యాకేజీ అవసరమని సూచించింది. ఇలాంటి విపత్కర పరిస్థితుల నుంచి బయటపడాలంటే సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవాలని ‘స్టేట్‌ ఆఫ్‌ వర్కింగ్‌ ఇండియా 2021: వన్‌ ఇయర్‌ ఆఫ్‌ కొవిడ్‌-19’ పేరుతో అజీమ్‌ ప్రేమ్‌జీ యూనివర్సిటీ రూపొందించిన నివేదిక అభిప్రాయపడింది. 

7. థర్డ్‌ వేవ్‌ను ఎదుర్కోవడానికి సిద్ధంకండి: సుప్రీం కోర్టు

దేశంలో కొవిడ్‌-19 థర్డ్‌ వేవ్‌ రానున్న  తరుణంలో సుప్రీం కోర్టు కీలక సూచనలు జారీచేసింది. దేశం అంతటా ఆక్సిజన్‌ సరఫరా చేయాలని కేంద్రాన్ని కోరింది. థర్డ్‌ వేవ్‌లో కరోనా వైరస్‌తో పోరాడటానికి పాన్ ఇండియా స్థాయిలో ఆక్సిజన్‌ అందించాలని కేంద్రానికి సూచించింది. ప్రజల్లో ఆక్సిజన్‌ కొరత పట్ల ఉన్న భయానికి తెర దించేలా బఫర్‌ స్టాక్‌ను ఏర్పాటుచేయాలని ఆదేశించింది. ఈ సందర్భంగా ‘‘మనం థర్డ్‌ వేవ్‌కు సిద్ధంగా ఉండాలి. ఇలాంటి పరిస్థితుల్లో ఆక్సిజన్‌ బఫర్‌ స్టాక్‌ను సిద్ధంగా ఉంచవలసిన అవసరం ఉంది’’ అని ధర్మాసనం పేర్కొంది. 

8. Mamata: 24 గంటలు కాలేదు.. అప్పుడేనా?

పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికల అనంతరం చోటుచేసుకున్న హింసాత్మక ఘటనల్లో మొత్తం 16 మంది ప్రాణాలు కోల్పోయారని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వెల్లడించారు. వారి కుటుంబ సభ్యులకు రూ.2 లక్షలు చొప్పున పరిహారం అందజేయనున్నామని తెలిపారు. ఈ మేరకు ఆమె గురువారం మీడియాతో మాట్లాడారు. చనిపోయిన వారిలో భాజపా, తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీలతో పాటు, సంయుక్త మోర్చాకు చెందిన ఒకరు ఉన్నారని చెప్పారు. పోలింగ్‌ సమయంలో కూచ్‌బెహార్‌లో సీఐఎస్‌ఎఫ్‌ కాల్పుల్లో మరణించిన ఐదుగురికి చెందిన కుటుంబ సభ్యుల్లో ఒకరికి చొప్పున హోంగార్డు ఉద్యోగం ఇస్తామని మమత ప్రకటించారు. 

9. Raina Oxygen అభ్యర్థన.. Sonusood సహాయం

టీమ్‌ఇండియా మాజీ క్రికెటర్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌ బ్యాట్స్‌మన్‌ సురేశ్‌ రైనా గురువారం అత్యవసర పరిస్థితుల్లో ప్రాణవాయువు సాయం కోరాడు. దానికి ప్రముఖ నటుడు సోనూసూద్‌ వెంటనే స్పందించి సరైన సమయంలో సహాయం చేశాడు. అసలేం జరిగిందంటే.. మీరట్‌లో ఒక మహిళకు కొవిడ్‌-19 సోకిందని, దాంతో ఆమె ఊపిరితిత్తులు బాగా దెబ్బతిని తీవ్ర అస్వస్థతకు గురయ్యారని, వెంటనే ప్రాణవాయువు కావాలని ట్వీట్‌ చేశాడు. దానికి ఉత్తర్‌ప్రదేశ్‌ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను సైతం ట్యాగ్‌ చేశాడు. 

10. Corona: అలా చేస్తే మరింత ముప్పు!

దేశంలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. ఎంతో కొంత పలుకుబడి ఉన్న వ్యక్తులకే ఆస్పత్రుల్లో బెడ్లు దొరకడం లేదంటే పరిస్థితి ఎలాఉందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఇలాంటి సమయంలో చాలా మంది ‘సొంత వైద్యం’పై దృష్టి పెడుతున్నారు. వైద్యుల సలహాలు తీసుకోకుండానే  తమకు తెలిసిన, అందుబాటులో ఉన్న ఔషధాలను వాడేస్తున్నారు. ఇలా చేయడం చాలా ప్రమాదకరమని, దీనివల్ల మేలు కంటే కీడే ఎక్కువగా జరుగుతుందని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. 

ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని