Top Ten News @ 9 PM
close

తాజా వార్తలు

Updated : 09/05/2021 21:14 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Top Ten News @ 9 PM

1. Corona: సీఎం కేసీఆర్‌ కీలక నిర్ణయం

కరోనా విపత్కర పరిస్థితుల్లో సీఎం కేసీఆర్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. 2,3 నెలల కాలానికి తాత్కాలిక ప్రాదిపదికన వైద్య సిబ్బందిని నియమించాలని నిర్ణయించారు.   రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై అధికారులతో సీఎం కేసీఆర్‌ సమీక్ష నిర్వహించారు. కరోనా కట్టడి చర్యలు, ఔషధాలు, వ్యాక్సినేషన్‌పై భేటీలో చర్చించారు.  వైద్య సిబ్బందికి గౌరవప్రదమైన వేతనాలు ఇవ్వాలని అన్నారు.  భవిష్యత్తులో ప్రభుత్వ ఉద్యోగాల నియామకాల్లో వారికి వెయిటేజీ ఇవ్వాలన్నారు. 

2. Corona: ఏపీలో 20వేలు దాటిన కేసులు

ఏపీలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. రోజువారీ కేసుల సంఖ్య 20 వేలు దాటేసింది. గడిచిన 24 గంటల వ్యవధిలో 1,05,494 నమూనాలను పరీక్షించగా.. 22,164 మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. కరోనా మహమ్మారి కారణంగా తాజాగా 92 మంది ప్రాణాలు కోల్పోయినట్లు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్‌ సింఘాల్‌ మీడియాకు వెల్లడించారు. తాజా కేసులతో రాష్ట్రంలో ఇప్పటి వరకు  12,87,603 కేసులు నమోదవ్వగా.. మరణాలు 8,707కి పెరిగాయి.  తాజాగా 8,832 మంది వైరస్‌ నుంచి కరోనా నుంచి కోలుకోగా.. ప్రస్తుతం 1,90,632 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. 

Corona: ఏపీలో 49 చోట్ల ఆక్సిజన్‌ ప్లాంట్లు

3. N440K:ఏపీ మంత్రి అప్పలరాజుపై ఫిర్యాదులు

ఏపీ మంత్రి అప్పలరాజుపై రవికుమార్‌, థరూర్‌ జేమ్స్‌ అనే ఇద్దరు వ్యక్తులు కర్నూలు వన్‌ టౌన్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఓ టీవీ చర్చాకార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ..కర్నూలులో N440Kవైరస్ వ్యాప్తి చెందుతోందని, సాధారణ వైరస్‌ కంటే ఇది 15 రెట్లు వేగంగా వ్యాపిస్తోందని మంత్రి అన్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. మంత్రి వ్యాఖ్యల వల్ల  ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారని, కొవిడ్‌ నిబంధనలకు వ్యతిరేకంగా మాట్లాడినందున ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. 

4. ధరలు అదుపులో ఉంచేందుకే వాటిపై జీఎస్టీ

కరోనా వ్యాక్సిన్లపైనా, మెడికల్‌ ఆక్సిజన్‌పై విధిస్తున్న పన్నులను పూర్తిగా రద్దు చేయాలంటూ పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ లేఖపై కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ స్పందించారు. వ్యాక్సిన్‌ (5 శాతం పన్ను), ఔషధాలు, ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్ల (12 శాతం పన్ను) ధరలను అదుపులో ఉంచేందుకే జీఎస్టీ విధిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు ఆదివారం ఆమె వరుస ట్వీట్లు చేశారు. ఆయా వస్తువులకు ఒకవేళ జీఎస్టీ నుంచి పూర్తి మినహాయింపు ఇస్తే.. దేశీయ తయారీదారులు ముడిపదార్థాలు, సేవలకు చెల్లించిన పన్నులు తిరిగి రాబట్టుకోలేక అంతిమంగా వాటి ధరలను పెంచుతారని, తద్వారా వినియోగదారుడిపైనే భారం పడుతుందని సీతారామన్‌ వివరించారు. 

5. ఏమిటీ ముంబయి మోడల్‌.. కరోనా వేళ ఏం చేసింది?

కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. ప్రతిరోజూ వేలాది ప్రాణాలను బలితీసుకుంటోంది. తొలిదశ వ్యాప్తి కంటే రెండో దశ మరింత ప్రాణాంతకంగా మారుతోంది. ఎప్పుడు ఎలాంటి వార్త వినాల్సి వస్తుందోనని ప్రజలు భయపడుతూనే ఉన్నారు. రెండోదశ ప్రారంభంలోనూ మహమ్మారి ముంబయి నగరాన్ని గజగజ వణికించింది. కానీ, కొద్ది రోజుల్లోనే కేసుల సంఖ్య అనూహ్యంగా తగ్గిపోయింది. దిల్లీ, గుజరాత్‌,ఉత్తర్‌ ప్రదేశ్‌లలో మరణ మృదంగం కొనసాగుతున్నప్పటికీ ముంబయి మహానగరం మాత్రం సులభంగా కట్టడి చేయగలిగింది.

6. ‘SUVలో రేప్‌కు అంత స్థలం ఉంటుందా..?’

గుజరాత్‌లోని వడోదర ఆర్టీఓ అధికారులకు ఓ వింతైన అభ్యర్థన వచ్చింది. ఒక స్పోర్ట్స్‌ యుటిలిటీ వాహనం(ఎస్‌యూవీ)లో అత్యాచారానికి పాల్పడే అంత స్థలం ఉంటుందా.. నిర్ధారించాలని  జిల్లా పోలీసు విభాగానికి చెందిన స్థానిక క్రైమ్‌ బ్రాంచ్‌ నుంచి ఆర్టీవో అధికారులకు ఓ అభ్యర్థన అందింది. ఓ అత్యాచార కేసు విచారణకు సంబంధించి క్రైమ్‌ బ్రాంచ్‌ ఈ సమాచారాన్ని కోరింది. ఎస్‌యూవీలో ముందు సీటుని వెనక్కి నెట్టిన తర్వాత తగినంత స్థలం ఉంటుందా.. తెలియజేయాలని పేర్కొంది. అలాగే వాహనం సెంట్రల్‌ లాకింగ్‌ సిస్టమ్‌ గురించి కూడా సమాచారం కావాలని అడిగింది. 

7. గాలిలో వైరస్‌ ప్రభావం ఎన్ని అడుగుల దూరం?

కరోనా వైరస్‌ మహమ్మారి గాలి ద్వారాను వ్యాప్తి చెందుతుందని జాతీయ, అంతర్జాతీయ నివేదికలు వెల్లడించడం ఆందోళన కలిగించిన విషయం తెలిసిందే. అయితే, గాలిలో వైరస్‌ కణాలు ఎంత దూరం వ్యాప్తి చెందుతాయనే విషయంపై అమెరికా వ్యాధి నియంత్రణ, నిర్మూలన కేంద్రం(సీడీసీ) మరోసారి స్పష్టతనిచ్చింది. వైరస్‌ సోకిన వ్యక్తినుంచి 3 నుంచి 6 అడుగులలోపు వ్యాప్తి అధికంగా ఉంటుందని.. వెంటిలేషన్ లేని ప్రాంతాల్లో ఆరు అడుగుల కంటే కాస్త ఎక్కువ దూరం వ్యాప్తికి అవకాశం ఉంటుందని అమెరికా సీడీసీ తాజా మార్గదర్శకాల్లో వెల్లడించింది. 

8. హైదరాబాద్‌లో ఆక్సిజన్‌ అందక ముగ్గురి మృతి

హైదరాబాద్‌లోని కింగ్‌ కోఠి ఆస్పత్రిలో సకాలంలో ఆక్సిజన్‌ అందక ముగ్గురు బాధితులు మృతి చెందారు. ప్రాణవాయువు లేక 2 గంటలుగా 20 మంది రోగులు ఇబ్బందులు పడుతున్నా అధికారులు నిర్లక్ష్యం చూపారని బాధితుల బంధువులు ఆరోపిస్తున్నారు. ఆస్పత్రికి ఆక్సిజన్‌ రవాణా ఆలస్యమైందని, అందుకే సమయానికి అందించలేకపోయామని అధికారులు చెబుతున్నారు. జడ్చర్ల నుంచి ఆస్పత్రికి నిన్న రాత్రే ఆక్సిజన్‌ ట్యాంకర్‌ రావాల్సి ఉంది. చిరునామా తెలియకపోవడంతో  ట్యాంకర్‌ డ్రైవర్‌ ఉస్మానియా ఆస్పత్రికి తీసుకెళ్లిపోయాడు. 

Corona: తెలంగాణలో కొత్తగా 4,976 కేసులు

9. చేతన్‌ సకారియా ఇంట మరో విషాదం..

రాజస్థాన్‌ రాయల్స్‌ యువపేసర్‌ చేతన్‌ సకారియా ఈరోజు తన తండ్రిని కోల్పోయాడు. ఇటీవల కరోనా బారిన పడిన కంజీభాయ్‌ సకారియా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దాంతో ఆయనను గుజరాత్‌లోని భావ్‌నగర్‌లో ఓ ఆస్పత్రిలో చేర్పించారు. ఈ క్రమంలోనే ఆదివారం మృతిచెందినట్లు రాజస్థాన్‌ ఫ్రాంఛైజీ ఓ ట్వీట్‌ చేసి విషయాన్ని తెలియజేసింది. ఈ సందర్భంగా సంతాపం ప్రకటించి చేతన్‌కు అండగా ఉంటామని చెప్పింది. 

10. వ్యాక్సిన్‌  చూడని ఆఫ్రికా దేశాలు..!

ప్రపంచాన్ని వణకిస్తోన్న కరోనా మహమ్మారిని ఎదుర్కొనే వ్యాక్సిన్‌ వేగంగా పంపిణీ చేసేందుకు ప్రపంచ దేశాలు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇప్పటివరకు దాదాపు 174 దేశాల్లో వ్యాక్సిన్‌ పంపిణీ ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో కొన్ని దేశాలు కరోనా వ్యాక్సిన్‌ కోసం ఆశగా ఎదురుచూస్తున్నాయి. ముఖ్యంగా ఆఫ్రికాలో దాదాపు డజనుకుపైగా దేశాలు ఇప్పటికీ వ్యాక్సిన్‌ చూపు చూడలేని దయనీయ స్థితిలో ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో వాటిని ముందుగానే సేకరించి పంపిణీ చేయడంలో ధనిక దేశాలు ముందున్నట్లు డబ్ల్యూహెచ్‌ఓ పదేపదే చెబుతోంది. 

ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని