Top Ten News @ 9 PM
close

తాజా వార్తలు

Published : 11/06/2021 20:55 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Top Ten News @ 9 PM

1. రఘురామకృష్ణరాజుపై స్పీకర్‌కు ఫిర్యాదు

నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజును డిస్‌ క్వాలిఫై చేయాలని కోరుతూ లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాకు వైకాపా మరోసారి ఫిర్యాదు చేసింది. వైకాపా టికెట్‌పై నరసాపురం పార్లమెంట్‌ నియోజకవర్గం నుంచి ఎన్నికై పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న రఘురామకృష్ణరాజు  పార్లమెంట్‌ సభ్యత్వాన్ని రద్దు చేయాలని లోక్‌సభ స్పీకర్‌కు వైకాపా చీఫ్ విప్‌ మార్గాని భరత్‌ ఫిర్యాదు చేశారు. అనంతరం భరత్‌ మీడియాతో మాట్లాడుతూ... రఘురామకృష్ణరాజు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతూ చేసిన వ్యాఖ్యలపై గతంలోనే ఆధారాలను తాము లోక్‌సభ స్పీకర్‌కు సమర్పించామన్నారు. 

2. Covid test: ముక్కులో విరిగిన స్వాబ్‌ స్టిక్‌

కరీంనగర్‌ జిల్లా రామడుగు మండలంలోని వెంకట్రావుపల్లిలో కరోనా పరీక్ష నిర్వహించే సమయంలో జరిగిన నిర్లక్ష్యం కలకలం రేపింది. మండలానికి చెందిన ఓ గ్రామ సర్పంచి శేఖర్‌ కొవిడ్‌ పరీక్ష చేయించుకునేందుకు పరీక్షా కేంద్రానికి వెళ్లారు. అక్కడ పరీక్ష చేస్తుండగా టెస్టు చేసేందుకు వినియోగించే స్వాబ్‌ స్టిక్‌ ముక్కులో విరిగిపోయింది. తీవ్ర ఇబ్బంది పడిన బాధితుడు.. దాన్ని బయటకు తీసేందుకు ప్రయత్నించినా రాకపోవడంతో  తీవ్ర ఆందోళనకు గురయ్యాడు. స్థానికంగా వైద్య సదుపాయాలు అందుబాటులో లేకపోవటంతో కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి పరుగులు తీశారు.

TS NEWS: కొత్తగా 1,707 కరోనా కేసులు

3. ఏపీలో 8,239 కేసులు.. 61 మరణాలు

ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో 1,01,863 పరీక్షలు నిర్వహించగా.. 8,239 కేసులు నిర్ధారణ అయ్యాయి. తాజా కేసులతో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో 17,96,122 మంది వైరస్‌ బారినపడినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బులెటిన్‌ విడుదల చేసింది. గడిచిన 24 గంటల వ్యవధిలో కొవిడ్‌ వల్ల  61 మంది బాధితులు ప్రాణాలు కోల్పోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా మృతుల సంఖ్య 11,824కి చేరింది. 24 గంటల వ్యవధిలో 11,135 మంది బాధితులు కోలుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా కోలుకున్న వారి సంఖ్య 16,88,198కి చేరినట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో 96,100 యాక్టివ్‌ కేసులున్నాయి.

4. భూముల అమ్మకానికి వ్యతిరేకం: సంజయ్‌

రాష్ట్ర ప్రభుత్వం ఆదాయ వనరుల కోసం సర్కారు భూములు అమ్మడాన్ని భాజపా తీవ్రంగా వ్యతిరేకిస్తోందని తెలంగాణ భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ తెలిపారు. రాష్ట్రంలోని భూమి తెలంగాణ ప్రజల ఆస్తి.. రాష్ట్ర ప్రభుత్వం సంరక్షకుడిగా ఉండాలి తప్ప వాటిని అమ్మే అధికారం ఉండదన్నారు.  ‘‘రాష్ట్రంలో ప్రభుత్వ ఆధీనంలో ఉన్న భూములను ప్రజల సౌకర్యాల కోసం వినియోగించాలి తప్ప విక్రయించడం అనైతికం. పేదలకు ఇళ్ల స్థలాలు,  ప్రభుత్వ ఆసుపత్రులు, విద్యాలయాలు, శాస్త్ర సాంకేతిక పరిశోధనలు, స్టేడియంలు, బస్‌ స్టేషన్లు, గిడ్డంగుల నిర్మాణాల కోసం ఉపయోగించుకోవాలి తప్ప విక్రయించడం సరైంది కాదు. 

5. DSC 2008: అభ్యర్థులకు ప్రత్యేక రిక్రూట్‌మెంట్‌

డీఎస్సీ-2008 అభ్యర్థుల్లో 2,193 మంది అర్హులకు ఎస్‌జీటీ పోస్టింగులివ్వాలని నిర్ణయించినట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. వీరికోసం ప్రత్యేక నియామక ప్రక్రియ చేపట్టనున్నట్లు చెప్పారు. మినిమమ్ టైమ్ స్కేల్‌ విధానంలో పని చేసేందుకు అభ్యర్థులు రాత పూర్వకంగా అంగీకారం తెలిపారన్నారు. ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా కేవలం డీఎస్సీ-2008 అభ్యర్థులకు మాత్రమే వర్తించేలా 2,193 మంది అర్హులకు ఎస్‌జీటీ పోస్టింగులివ్వాలని సీఎం జగన్‌ నిర్ణయం తీసుకున్నారని వెల్లడించారు. దీనికి సంబంధించి త్వరలోనే జీవో విడుదల చేస్తామని మంత్రి తెలిపారు.

6. ఈ యాప్‌ గురువారం మాత్రమే పనిచేస్తుంది!

ప్రపంచవ్యాప్తంగా టిండర్‌, బంబుల్‌ వంటి ఎన్నో డేటింగ్‌ యాప్‌లు అందుబాటులో ఉన్నాయి. దీంతో చాలా మంది యువతీయువకులు ఈ యాప్స్‌లో తమ భాగస్వామిని వెతుక్కుంటారు. ఈ క్రమంలో సమయం, లోకం రెండూ మర్చిపోతారు. దీంతో చేయాల్సిన ఇతర పనులు ఆలస్యమైపోతుంటాయి. అందుకే, ఇలాంటి సమస్యలకు పరిష్కారంగా ఇద్దరు టెకీలు ‘థర్స్‌డే(గురువారం)’ పేరుతో వినూత్న డేటింగ్‌ యాప్‌ను తీసుకొచ్చారు. ఈ యాప్‌ కేవలం గురువారం రోజు మాత్రమే పనిచేస్తుంది. ఆ 24 గంటల్లోనే యువత తమకు నచ్చిన వ్యక్తిని పరిచయం చేసుకొని.. మాట్లాడి.. ఒక్కటి కావొచ్చు. రోజు ముగిసిందంటే యాప్‌ ఆటోమేటిక్‌గా పనిచేయడం మానేస్తుంది. 

7. Investments: భారత్‌కు అమెరికా దిగ్గజ సంస్థ?

అమెరికా దిగ్గజ కంపెనీల్లో ఒకటైన అప్లైడ్‌ మెటీరియల్స్ భారత్‌లో పరిశ్రమను నెలకొల్పేందుకు యోచిస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నట్లు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న ఓ అధికారి తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా సెమీకండక్టర్ల పరిశ్రమకు కావాల్సిన పరికరాలు, సేవలు, సాఫ్ట్‌వేర్‌ను అప్లైడ్‌ మెటీరియల్స్ అందిస్తుంటుంది. సెమీకండక్టర్ల తయారీలో ఉపయోగించే కొన్ని కీలక పరికరాలు, భాగాల తయారీ పరిశ్రమను భారత్‌లో నెలకొల్పాలని భావిస్తున్నట్లు సమాచారం. 17.2 బిలియన్‌ డాలర్ల మార్కెట్‌ విలువ కలిగిన అప్లైడ్‌ మెటీరియల్స్ భారత్‌లోకి ప్రవేశిస్తే.. సెమీకండర్ల పరిశ్రమకు భారత్‌ను కేంద్రంగా మార్చాలనుకుంటున్న కేంద్ర ప్రభుత్వ ప్రణాళికలకు ఊతం లభిస్తుంది. 

8. జీఎస్టీ కౌన్సిల్‌ భేటీ: ఈ సంగ్మా గురించి తెలుసా?

కరోనా మందులు, పరికరాలపై పన్నులు తగ్గించే విషయమై చర్చించడానికి జీఎస్టీ కౌన్సిల్‌ మంత్రివర్గ ఉప సంఘాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఆ మంత్రుల బృందం జీఎస్టీ కౌన్సిల్‌కు నివేదికను సమర్పించింది. ఈ బృందంలో తమ ఆర్థిక మంత్రులకు చోటు దక్కలేదని కాంగ్రెస్‌ పార్టీ అభ్యంతరం సైతం వ్యక్తంచేసింది. అయితే, మొత్తం 8 మంది సభ్యులున్న ఈ బృందానికి కన్రాడ్‌ సంగ్మాను కన్వీనర్‌గా నియమితులయ్యారు. గుజరాత్‌, మహారాష్ట్ర కేరళ, తెలంగాణ, ఒడిశా, యూపీకి చెందిన మంత్రులు ఇందులో సభ్యులుగా ఉన్నారు. పెద్ద పెద్ద రాష్ట్రాల మంత్రులు ఈ బృందంలో ఉన్నప్పటికీ చిన్న రాష్ట్రమైన మేఘాలయకు చెందిన సంగ్మాకే కన్వీనర్‌ బాధ్యతలు అప్పగించడం వెనుక బహుశా ఆయన నేపథ్యం కారణం కావొచ్చని తెలుస్తోంది. 

9. అరుణుడి చిత్రాలను విడుదల చేసిన చైనా

అంగారకుడిపై జీవం ఉనికి తెలుసుకునేందుకు గతేడాది చైనా తియెన్ వెన్-1 వ్యోమనౌకను పంపింది. అది అంగారకుడి కక్ష్యలో మూడు నెలల పరిభ్రమణం అనంతరం మే 14న విజయవంతంగా అరుణ గ్రహం మీద కాలుమోపింది. ఈ వ్యోమ నౌకలోని రోవర్‌ జూరాంగ్‌ పంపిన మార్స్ ఉపరితల చిత్రాలను చైనా అంతరిక్ష పరిశోధన సంస్థ సీఎస్‌ఏ విడుదల చేసింది. రోవర్‌లో ప్రత్యేకంగా అమర్చిన కెమెరా పది మీటర్ల ఎత్తులో ఫొటోలు తీసినట్లు పేర్కొంది. ఈ చిత్రాల్లో ఎరుపు వర్ణంలో అంగారకుడి ఉపరితలం మెరిసిపోతోంది.

10. Mamata: ఇంకా వస్తారు.. వాళ్లను మాత్రం తీసుకోం! 

అసెంబ్లీ ఎన్నికలకు ముందు పార్టీని వీడి, తీవ్ర పదజాలంతో దూషించి తమకు ద్రోహం చేసిన వాళ్లను తిరిగి టీఎంసీలోకి తీసుకోబోమని తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి, పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పష్టం చేశారు. భాజపా జాతీయ ఉపాధ్యక్షుడు ముకుల్‌ రాయ్‌, ఆయన తనయుడు సుభ్రాంశురాయ్‌ శుక్రవారం సాయంత్రం మమతా బెనర్జీ సమక్షంలోనే సొంతగూటికి చేరారు. ఈ సందర్భంగా దీదీ మీడియాతో మాట్లాడుతూ.. ముకుల్‌ రాయ్‌కి స్వాగతం చెబుతున్నామన్నారు. ఆయన ఎప్పుడూ టీఎంసీకి వ్యతిరేకంగా మాట్లాడలేదని తెలిపారు. భాజపాలో ఆయన్ను బెదిరించారని, అదే ఆయన అనారోగ్యానికి దారితీసిందన్నారు. టీఎంసీ ఎలాంటి కుంభకోణాలూ చేయలేదని.. భాజపా ఎందుకు బీటలు వారుతోందో వారినే అడగాలని సూచించారు.

Mukul Roy: సొంతగూటికి ముకుల్‌ రాయ్‌


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని