Top Ten News @ 9 PM
close

తాజా వార్తలు

Published : 13/06/2021 20:58 IST

Top Ten News @ 9 PM

1. పనితీరు సరిగా లేకపోతే క్షమించను: కేసీఆర్‌

రాష్ట్రంలోని పల్లెలు, పట్టణాల అభివృద్ధికి అందరి భాగస్వామ్యం కావాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. ఒక జిల్లాను దత్తత తీసుకుని పల్లె, పట్టణ ప్రగతిలో పాల్గొననున్నట్లు సీఎం చెప్పారు. గ్రామాలు, పట్టణాల అభివృద్ధిని యజ్ఞంలా భావించి కృషి చేయాలన్నారు. గ్రామాలు, పట్టణాల్లో పచ్చదనం, పరిశుభ్రతకు ప్రాధాన్యమిచ్చే పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలు ప్రారంభించి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా వాటి అమలు తీరుపై సీఎం సమీక్షించారు. అన్ని జిల్లాల అదనపు కలెక్టర్లు, జిల్లా పంచాయతీ అధికారులు(డీపీవో)తో పల్లె, పట్టణ ప్రగతిపై సమీక్ష నిర్వహించారు.

TS NEWS: కొత్తగా 1,280 కరోనా కేసులు
జమ్మూలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి భూమిపూజ

2. Ap News: 6,770 కేసులు.. 58 మరణాలు

ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో 1,02,876 పరీక్షలు నిర్వహించగా.. 6,770 కేసులు నిర్ధారణ అయ్యాయి. తాజా కేసులతో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో 18,09,844 మంది వైరస్‌ బారినపడినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బులెటిన్‌ విడుదల చేసింది. గడిచిన 24 గంటల వ్యవధిలో కొవిడ్‌ వల్ల 58 మంది బాధితులు ప్రాణాలు కోల్పోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా మృతుల సంఖ్య 11,940కి చేరింది.  దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 17,12,267 మంది బాధితులు కొలుకున్నట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో 85,637 యాక్టివ్‌ కేసులున్నాయి.

3. అప్పులు ప్రమాదకరంగా మారాయ్‌: భట్టి

ప్రభుత్వ భూములను విక్రయించాలని తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తెలిపారు. భట్టి విక్రమార్క నేతృత్వంలో వర్చువల్‌ విధానంలో సీఎల్పీ అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులు, సర్కార్‌ తీసుకుంటున్న నిర్ణయాలు, ఉద్యమ కార్యాచరణపై నేతలు సుదీర్ఘంగా చర్చించారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తున్న అప్పులు చాలా ప్రమాదకరంగా మారాయని.. తెచ్చిన అప్పులను ఇష్టానుసారంగా, జవాబుదారీ లేకుండా ఖర్చు చేస్తున్నారని మండిపడ్డారు.

4. దిల్లీలో సచిన్‌ పైలట్‌.. వేడెక్కిన రాజస్థాన్‌ రాజకీయం

కాంగ్రెస్‌ సీనియర్ నేత సచిన్‌ పైలట్‌ దిల్లీ పర్యటన రాజస్థాన్‌ రాజకీయ వర్గాల్లో పలు ఊహాగానాలకు తెరతీసింది. అధిష్ఠానం ఇచ్చిన హామీలను నెరవేర్చుకొనేందుకే సచిన్‌ దిల్లీకి వెళ్లారంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. గతేడాది జులైలో రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్‌తో విభేదించి తిరుగుబాటు స్వరం వినిపించిన సచిన్‌ను కాంగ్రెస్‌ పెద్దలు సముదాయించి రాష్ట్ర ప్రభుత్వంలో  సముచిత స్థానం కల్పిస్తామంటూ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో పార్టీ అగ్ర నేతల మధ్య సయోధ్య కుదిర్చేందుకు అధిష్ఠానం ఓ కమిటీ కూడా ఏర్పాటు చేసినప్పటికీ సమస్య అపరిష్కృతంగానే మిగిలింది. ఏడాది గడుస్తున్నా సచిన్‌కు ఇచ్చిన హామీలను కూడా అధిష్ఠానం నెరవేర్చలేదు.

5. పొమ్మనలేక పొగబెడుతున్నారు: వీహెచ్‌

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ విధేయులకు విలువ.. ఆత్మగౌరవం ఉందా? లేదా? అని కాంగ్రెస్‌ సీనియర్‌ వి.హనుమంతరావు .. రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మాణికం ఠాగూర్‌ను ప్రశ్నించారు. ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి పెద్దపీట వేస్తామంటే అది మాకు అవమానం కాదా? అని నిలదీశారు. పీసీసీ అధ్యక్షుడు రాజీనామా చేసినా ఆయన అదృష్టం బాగుండి తిరిగి కొనసాగుతున్నారన్నారు. కర్ణాటకలో కొత్త పీసీసీ కోసం పరిశీలకుడిని పంపించారని, పంజాబ్‌లో కూడా అదే జరుగుతోందని.. ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే మాణికం ఠాగూర్‌ ఒక్కరే అభిప్రాయ సేకరణ చేశారని ఆరోపించారు. కాంగ్రెస్‌లో తనను పొమ్మనలేక పొగబెట్టి పంపించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. 

6. కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల్లో పెట్రో ధరలు తగ్గిస్తారా..?

ఇంధన ధరల పెరుగుదలపై కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించిన కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీపై పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేద్ర ప్రధాన్‌ మండిపడ్డారు. పెట్రో ధరల పెరుగుదలతో ఇబ్బంది పడుతున్న సామాన్య ప్రజల గురించి జాలి ఉంటే..  ధరలు తగ్గించాలంటూ కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాలకు ఆదేశాలివ్వాలని రాహుల్‌కు సవాలు విసిరారు. అయితే భాజపా పాలిత రాష్ట్రాల్లో ఆ విధంగా చేస్తారా..లేదా.. అనే విషయంపై ఆయన మాట్లాడలేదు. ‘‘ఇంధనం ధరలు పెరిగిన మాట వాస్తవమే. అయితే పేద ప్రజలకు ఉచితంగా ఆహార ధాన్యాలు అందించడం కోసం కేంద్రం ఈ ఏడాది రూ. లక్ష కోట్లు ఖర్చు చేస్తోందన్నారు. మరోవైపు కొవిడ్‌ కట్టడిలో భాగంగా వ్యాక్సిన్లు, ఆరోగ్యపరమైన మౌలిక సదుపాయాల కోసం కూడా రూ.కోట్లు వెచ్చిస్తోందన్నారు.

7. Vaccine:ఇప్పటి వరకు రాష్ట్రాలకు 26 కోట్ల డోసులు! 

ఇప్పటి వరకు రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాలకు 26 కోట్లకు పైగా కరోనా టీకా డోసులు సరఫరాచేసినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ ఆదివారం వెల్లడించింది. వీటిలో కేంద్ర ప్రభుత్వం ఉచితంగా అందజేసిన డోసులతో పాటు రాష్ట్రాలు నేరుగా తయారీ సంస్థల నుంచి కోనుగోలు చేసినవి ఉన్నాయని తెలిపింది. రాష్ట్రాలకు అందిన మొత్తం 26,64,84,350 టీకా డోసుల్లో 25,12,66,637 డోసులు వినియోగించారని(వ్యర్థాలతో కలిపి) పేర్కొంది. కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాల ప్రకారం రాష్ట్రాల వద్ద ఇప్పటికీ 1.53 కోట్ల డోసులు అందుబాటులో ఉన్నాయి. దాదాపు మరో 4.5 లక్షల డోసులు సరఫరాలో ఉన్నాయి.

8. వ్యాక్సిన్‌ వేసుకోకపోతే ఫోన్‌ బ్లాక్‌ చేస్తారట!

కరోనా కట్టడికి ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ జరుగుతోన్న విషయం తెలిసిందే. కరోనా మూడో వేవ్‌ వచ్చే అవకాశాలు ఉన్నాయన్న శాస్త్రవేత్తల హెచ్చరికలతో అన్ని దేశాలు అప్రమత్తమవుతున్నాయి. వీలైనంత వరకు ప్రజలందరికీ వ్యాక్సిన్‌ వేయించి కరోనా నుంచి వారిని రక్షించాలని ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ క్రమంలో వ్యాక్సిన్‌ వేయించుకోవాలని ప్రజలకు ప్రభుత్వాలు.. ప్రముఖులు విజ్ఞప్తి చేయడం, ప్రోత్సాహకాలు ఇవ్వడం మనం చూస్తున్నాం. అయితే, పాకిస్థాన్‌లో మాత్రం ప్రజలు వ్యాక్సిన్‌ వేసుకోకపోతే వారి ఫోన్లను బ్లాక్‌ చేస్తామని, ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వమని హెచ్చరికలు జారీ అవుతున్నాయి.

9. చాపకింద నీరులా చైనా నిఘా సంస్థలు..!

చైనా జనాభా ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో స్థిరపడింది. దీంతో వారిని వాడుకొని డ్రాగన్‌ భారీగా సమాచారం సేకరిస్తోంది. ప్రస్తుత జాతీయ భద్రత సలహాదారు అజిత్‌ దోబల్‌ 2013లో చైనా నిఘా కార్యకలాపాలపై ఒక అధ్యయనపత్రాన్ని రాశారు. చైనా వ్యాపార సంస్థలు, మీడియా, బ్యాంకులు, 180 దేశాల్లోని కన్ఫ్యూషియస్‌ సంస్థలను వాడుకొంటుందని తెలిపారు.  తాజాగా భారత్‌-బంగ్లాదేశ్‌ సరిహద్దుల్లో పట్టుబడిన చైనా దేశస్థుడు హాన్‌ జున్వే పదేళ్లకు పైగా గూఢచారిగా పనిచేస్తున్నాడని తేలింది. అతను హోటల్‌ నిర్వహిస్తుండటం గమనార్హం. అసలే సరిహద్దు వివాదం రగులుతున్న సమయంలో చైనా గూఢచర్య కార్యకలాపాలు ఆందోళనకరంగా మారాయి.

10. 38మంది భార్యల ‘బిగ్‌ ఫ్యామిలీమ్యాన్‌’ ఇకలేరు!

జియోనా చానా.. మిజోరం రాష్ట్రానికి చెందిన 76 ఏళ్ల వ్యక్తి కన్నుమూశారు. అది సాధారణమే కదా అనుకోవద్దు. ఆయనకు 38 మంది భార్యలు, 89 మంది పిల్లలు, 33 మంది మనవలు, మనవరాళ్లు. కోడళ్లతో కలిపితే  160కి పైమాటే.. వీళ్లంతా ఒకే ఇంట్లో ఉంటారు.  ప్రపంచంలో ఇదే అతిపెద్ద కుటుంబమేమో. ఇవాళ మధ్యాహ్నం ఐజ్వాల్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. జియోనా మరణం పట్ల మిజోరం ముఖ్యమంత్రి జోరమ్‌తంగా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ఈ మేరకు ట్విటర్‌లో ఆయన పోస్టు చేశారు.

Viral video: కారును మింగేసిన నీటి గుంత..!


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని